రైతు బజారు కలేనా?

ABN , First Publish Date - 2022-08-07T06:30:03+05:30 IST

రెవెన్యూ డివిజన్‌ స్థాయి నుంచి జిల్లా కేంద్రంగా ఆవిర్భవించినా, మునిసిపాలిటీని జీవీఎంసీలో విలీనం చేసి 15 ఏళ్లు దాటినా అనకాపల్లి పట్టణ వాసులకు రైతు బజారు మాత్రం అందుబాటులోకి రాలేదు.

రైతు బజారు కలేనా?
ఇరుకుగా వున్న కూరగాయల మార్కెట్‌


ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితం

టీడీపీ హయాంలో డీసీఎంఎస్‌ స్థల పరిశీలన

రైతుబజారు ఏర్పాటుకు అనుకూలంగా ఉందన్న అధికారులు

తరువాత ప్రభుత్వం మారడంతో అటకెక్కిన వైనం

మూడేళ్లు దాటినా పట్టించుకోని వైసీపీ పాలకులు

నష్టపోతున్న కూరగాయ రైతులు, వినియోగదారులు


అనకాపల్లిటౌన్‌, ఆగస్టు 6: రెవెన్యూ డివిజన్‌ స్థాయి నుంచి జిల్లా కేంద్రంగా ఆవిర్భవించినా, మునిసిపాలిటీని జీవీఎంసీలో విలీనం చేసి 15 ఏళ్లు దాటినా అనకాపల్లి పట్టణ వాసులకు రైతు బజారు మాత్రం అందుబాటులోకి రాలేదు. విశాఖ నగరం సుమారు రెండు దశాబ్దాల నుంచి రైతు బజార్లు నడుస్తున్నాయి. నేరుగా రైతులే కూరగాయలను తీసుకొచ్చి విక్రయించడం వల్ల మార్కెట్‌లో కన్నా తక్కువ ధరలకు వినియోగదారులకు లభిస్తున్నాయి. ఇటువంటి వెసులుబాటు తమకు ఎందుకు కల్పించడంలేదని అనకాపల్లి పట్టణవాసులతోపాటు చుట్టుపక్కల మండలాల్లో కూరగాయ పంటలు సాగు చేసే రైతులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. 

అనకాపల్లి పట్టణంలో పాత బెల్లం మార్కెట్‌ (గాంధీ మార్కెట్‌)లో చాలా కాలం నుంచి కూరగాయల మార్కెట్‌ నిర్వహిస్తున్నారు. అనకాపల్లి, కశింకోట, మునగపాక, అచ్యుతాపురం మండలాల నుంచి రైతులు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. ఇక్కడ కనీస సదుపాయాలు లేకపోవడంతో రైతులు, కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడితే మార్కెట్‌లోకి వచ్చే మార్గాలతోపాటు లోపల పలుచోట్ల నీరు నిలిచిపోయి బురదమయం అవుతున్నది. చిల్లర వర్తకుల కోసం  షెడ్లు వేయడంతో మార్కెట్‌ మరింత ఇరుకుగా మారి, కొనుగోలుదారులకు అసౌకర్యంగా వుంది. ఇక మార్కెట్‌కు తెల్లవారుజామునే వచ్చే రైతులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి సదుపాయం లేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధికారంలో వున్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లిలో రైతు బజారు ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు వచ్చి గాంధీమార్కెట్‌కు ఎదురుగా ఉన్న డీసీఎంఎస్‌ ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. రైతు బజారు ఏర్పాటుకు ఇది అనుకూలంగా వుందని ప్రతిపాదించారు. కానీ తరువాత అధికారులు పట్టించుకోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఇంతవరకు ఎటువంటి కదలిక లేదు. కరోనా వైరస్‌ ప్రభావం ఉధృతంగా ఉన్న సమయంలో కూరగాయల మార్కెట్‌ను ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులోకి తరలించారు. ఆ సమయంలో ఇక్కడ పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌... యార్డులో  ఖాళీగా వున్న ప్రదేశంలో రైతుబజారు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తదుపరి ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

రైతు బజారుతో అందరికీ మేలు

అనకాపల్లిలో రైతు బజారు ఏర్పాటు చేస్తే అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రస్తుతం కశింకోట మండలంలోని తీడ, చెరకాం, అడ్డాం, అచ్చెర్ల తదితర గ్రామాల రైతులు తాము పండించిన కూరగాయలను రోజూ విశాఖలోని రైతుబజార్లకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. అనకాపల్లి మార్కెట్‌లో దళారులు కొనుగోలు చేసే ధరలతో పోలిస్తే రైతుబజార్లలో ఎక్కువ ధర లభిస్తున్నదని అంటున్నారు. మరోవైపు వినియోగదారులు కూడా విశాఖ రైతుబజార్లలోకన్నా అనకాపల్లి మార్కెట్‌లో కూరగాయల ధరలు రెట్టింపు వుంటున్నాయని వాపోతున్నారు.  అనకాపల్లి జిల్లాగా ఏర్పడి నాలుగు నెలలు గడిచినా రైతుబజారు ఏర్పాటుపై దృష్టి సారించకపోవడం శోచనీయమని అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన అమర్‌నాథ్‌, ఉన్నతాధికారులు స్పందించి రైతుబజారు ఏర్పాటు చేయించాలని రైతులు, వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2022-08-07T06:30:03+05:30 IST