ఎంపీపీ పీఠంపై ‘రుత్తల’

ABN , First Publish Date - 2022-01-05T06:32:57+05:30 IST

మాకవరపాలెం ఎంపీపీగా వైసీపీకి చెందిన భీమబోయినపాలెం ఎంపీటీసీ సభ్యుడు రుత్తల సత్యనారాయణ, రెండో వైస్‌ ఎంపీపీగా రామన్నపాలెం ఎంపీటీసీ సభ్యుడు తుళ్లు రాజారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి శ్రీనివాసకుమార్‌ వెల్లడించారు.

ఎంపీపీ పీఠంపై ‘రుత్తల’
ఎంపీపీగా ఎన్నికైన రుత్తల సత్యనారాయణ. చిత్రంలో ఎమ్మెల్యే గణేశ్‌, వైసీపీ నాయకులు

ఏకగ్రీవంగా ఎన్నికైన సత్యనారాయణ

రెండున్నరేళ్ల తరువాత రుత్తల సర్వానికి పదవి

పార్టీ పెద్దల సమక్షంలో ఒప్పందం

రెండో వైస్‌ ఎంపీపీగా తుళ్లు రాజారావు ఎన్నిక


మాకవరపాలెం, జనవరి 4:  మాకవరపాలెం ఎంపీపీగా వైసీపీకి చెందిన భీమబోయినపాలెం ఎంపీటీసీ సభ్యుడు రుత్తల సత్యనారాయణ, రెండో వైస్‌ ఎంపీపీగా రామన్నపాలెం ఎంపీటీసీ సభ్యుడు తుళ్లు రాజారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి శ్రీనివాసకుమార్‌ వెల్లడించారు. అయితే పార్టీ పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందం మేరకు సత్యనారాయణ మొదటి రెండున్నరేళ్లు, మాకవరపాలెం ఎంపీటీసీ సభ్యుడు రుత్తల సర్వం మిగిలిన కాలం ఎంపీపీగా వుంటారు. 

పదవి దక్కించుకున్న రుత్తల

ప్రాదేశిక ఎన్నికల సమయంలో రుత్తల సత్యనారాయణ వైసీపీ మండల అధ్యక్షునిగా వున్నారు. పార్టీ అధిష్ఠానం ఎంపీపీ అభ్యర్థిగా ఆయన పేరుని ప్రకటించి బూరుగుపాలెం ఎంపీటీసీ టికెట్‌ ఇచ్చింది. వైసీపీకి మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ సత్యనారాయణ ఓడిపోయారు. దీంతో ఎంపీపీగా పాపయ్యపాలెం ఎంపీటీసీ సభ్యురాలు పైల భవానిని ఎన్నుకున్నారు. కొద్ది రోజుల అనంతరం భీమబోయినపాలెం ఎంపీటీసీ సభ్యుడు (టీడీపీ) మృతిచెందడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. రుత్తల సత్యనారాయణ ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఎంపీపీ పదవి కోసం పావులు కదిపారు. ‘వ్యక్తిగత కారణాల’తో ఎంపీపీ పదవికి పైల భవానీ రాజీనామా చేశారు. మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధి చేయడంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాణి అమ్మాజీ, ఎంపీడీవో అరుణశ్రీ, వైసీపీ మండల అధ్యక్షుడు రుత్తల వాసు, నాయకులు పెట్ల భద్రాచలం, హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.


నర్సీపట్నం వైస్‌ ఎంపీపీగా కూండ్రపు తాతబాబు...

నర్సీపట్నం అర్బన్‌ జనవరి 4: నర్సీపట్నం మండల రెండో వైస్‌ ఎంపీపీగా మెట్టపాలెం ఎంపీటీసీ సభ్యుడు కూండ్రపు తాతబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలుత తాతబాబు పేరుని వేములపూడి-2 ఎంపీటీసీ సభ్యుడు బోళెం వెంకటేశ్‌ ప్రతిపాదించగా, గబ్బాడ ఎంపీటీసీ సభ్యులు మాకిరెడ్డి తాతమ్మ బలపరిచారు. పోటీలో ఒక్కరే వుండడంతో తాతబాబు వైస్‌ ఎంపీపీగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారిణి ఎన్‌.సరోజని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, వైసీపీ మండల అధ్యక్షుడు సుర్ల సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీడీవో ఎన్‌.జయమాధవి తదితరులు పాల్గొన్నారు.


గొలుగొండలో జక్కు నాగమణి...

 గొలుగొండ: మండల రెండో వైస్‌ ఎంపీపీగా జోగంపేట ఎంపీటీసీ సభ్యురాలు జక్కు నాగమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ఎం.ఎ.రెహమాన్‌ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించి, ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డేవిడ్‌రాజ్‌, ఈవోపీఆర్‌డీ రఘురాం, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, జడ్పీటీసీ సభ్యుడు సుర్ల వెంకటగిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.


నాతవరంలో  మైనం నాగగోపి...

నాతవరం: మండల రెండో వైస్‌ ఎంపీపీగా చమ్మచింత ఎంపీటీసీ సభ్యుడు మైనం నాగగోపి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు ఎన్నికల అధికారి వి.మోహనరావు నియామకపత్రం అందజేశారు. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, డీసీసీబీ డైరెక్టర్‌ అంకంరెడ్డి జమీలు తదితరులు నాగగోపీకి శాలువాకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు శెట్టి నూకరాజు, నాయకులు  భాస్కర్‌బాబు, గొర్లి వరహాలబాబు, మంకు సాంబమూర్తి, షేక్‌ రజాక్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-05T06:32:57+05:30 IST