వైసీపీ నేతలకు విద్యార్థుల షాక్.. ‘సీఎం పవర్‌స్టార్’ అని నినాదాలు
ABN , First Publish Date - 2022-10-31T19:35:31+05:30 IST
రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా తమ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వైసీపీ నేతల (YCP leaders)కు విద్యార్థులు షాకిచ్చారు.
చోడవరం: రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా తమ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వైసీపీ నేతల (YCP leaders)కు విద్యార్థులు షాకిచ్చారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)కు జై కొట్టడం అధికార పార్టీ నేతలకు మింగుడుపడలేదు. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నాయకులు సోమవారం అనకాపల్లి జిల్లా చోడవరంలో ‘విద్యార్థి భేరి’ నిర్వహించారు. ఇందుకు పది రోజుల నుంచి చోడవరంతో పాటు చుట్టుపక్కల గల ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి విద్యార్థులను సమీకరించారు.
అయితే ర్యాలీలో విశాఖ పాలనా రాజధానికి మద్దతుగా నినాదాలు చేయాలని నేతలు ఆదేశిస్తే...విద్యార్థులు కొందరు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఫొటోతో ప్లకార్డులు పట్టుకుని ‘సీఎం పవర్‌స్టార్’, ‘మారాలి పాలన, మా కొద్దు జగన్ పాలన’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అధికార పార్టీ నేతలకు ఏం చేయాలో పాలుపోలేదు. కొందరు వైసీపీ నాయకులు ఆ నినాదాలు చేస్తున్న విద్యార్థులను నిలువరించేందుకు యత్నించినా, వారు పట్టించుకోలేదు. వారిని కొందరు వీడియోలు తీస్తున్నా...ఏమాత్రం భయపడకుండా ‘సీఎం పవర్‌స్టార్’ అని నినాదాలు కొనసాగించారు.