పకడ్బందీగా టేక్ హోం రేషన్
ABN , First Publish Date - 2022-11-17T00:59:00+05:30 IST
అంగన్‌వాడీ కేంద్రాలకు దూరంగా ఉన్న గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని కేంద్రానికి వచ్చి తీసుకునే అవసరం లేకుండా నిర్దేశించిన టేక్ హోం రేషన్(టీహెచ్‌ఆర్) పథకాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యలక్ష్మి తెలిపారు.
- జిల్లా వ్యాప్తంగా ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో అమలు
- కేంద్రాలకు దూరంగా ఉన్న గర్భిణులు, బాలింతలకు పౌష్టికారం అందించడమే లక్ష్యం
- ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి
కొయ్యూరు, నవంబరు 16: అంగన్‌వాడీ కేంద్రాలకు దూరంగా ఉన్న గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని కేంద్రానికి వచ్చి తీసుకునే అవసరం లేకుండా నిర్దేశించిన టేక్ హోం రేషన్(టీహెచ్‌ఆర్) పథకాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె స్థానిక ప్రాజెక్టు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే సురేంద్రపాలెం, రాజేంద్రపాలెం అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయటంతో పాటు అక్కడ పౌష్టికాహారం తీసుకుంటున్న లబ్ధిదారులను కలిసి వారికి పౌష్టికాహారం సక్రమంగా అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. ఈ విషయంలో ఏదైన నిరక్ష్యం జరిగితే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులతో సమావేశమై బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, చట్టపరంగా బాలికలకు సహాయపడే పలు చట్టాలను, వాటిని వినియోగించుకునే అవసరాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రానికి కిలో మీటరు పైబడి దూరంగా ఉన్న గర్భిణులు, బాలింతల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీహెచ్‌ఆర్ పథకాన్ని ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రారంభించామన్నారు. ఈ పథకం అమలులో ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం లేకుండా సీడీపీవోలకు తగిన మార్గదర్శకాలు ఇచ్చామన్నారు. కేంద్రాల వారీగా టీహెచ్‌ఆర్ లబ్ధిదారుల జాబితాను తయారు చేయించి వారికి నెలకు సరిపడా పౌష్టికాహారం ఒకేసారి అందించేలా జిల్లావ్యాప్తంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఆమె వెంట సీడీపీవో విజయకుమారి, సూపర్‌వైజర్లు లలిత, బాలామణి, సునీత తదితరులు ఉన్నారు.