విశాఖ ఉత్సవ్‌ ఊసేది!?

ABN , First Publish Date - 2022-12-16T01:19:16+05:30 IST

‘విశాఖ ఉత్సవ్‌’ను డిసెంబరు నెలాఖరులో నిర్వహిస్తామని నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ప్రకటించారు.

విశాఖ ఉత్సవ్‌ ఊసేది!?

డిసెంబరులో నిర్వహిస్తామని నెల క్రితం కలెక్టర్‌ ప్రకటన

నెల సగం గడిచిపోయినా ఆ ప్రస్తావనే లేదు

నిధుల కొరతే కారణం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘విశాఖ ఉత్సవ్‌’ను డిసెంబరు నెలాఖరులో నిర్వహిస్తామని నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ప్రకటించారు. ఆయనకు ఆ విషయం గుర్తుందో...లేదో గానీ డిసెంబరు సగం గడిచిపోయినా ఆ ఊసు ఎత్తడం లేదు. ఏటా డిసెంబరు నెలాఖరున విశాఖ ఉత్సవ్‌, భీమిలి ఉత్సవ్‌, అరకు ఉత్సవ్‌ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది (2019) ఈ మూడు ఉత్సవాలు నిర్వహించారు. అయితే వాటికి అరకొర నిధులే ఇచ్చారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఇప్పటికీ చాలా బిల్లులు మంజూరుకాలేదు. అప్పటి పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నియోజకవర్గంలో నిర్వహించిన భీమిలి ఉత్సవ్‌కు కూడా ప్రభుత్వం పూర్తిగా నిధులు ఇవ్వలేదు. ఆ తరువాత కరోనా వల్ల 2020, 2021లలో ఎటువంటి ఉత్సవాలు నిర్వహించలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ ఈ ఏడాది విశాఖ ఉత్సవ్‌ నిర్వహిస్తామని కలెక్టర్‌ చెప్పారు. కానీ ఉత్సవ్‌ నిర్వహించే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. నిధుల లేమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి మెప్పు కోసం ‘జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు’ పేరుతో మూడు రోజులు నగరంలో చాలా హడావిడి చేశారు. ఐదు జిల్లాల నుంచి కళాకారులను రప్పించి పోటీలు నిర్వహించారు. వీరికి రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టి, గెలిచిన వారికి సీఎం పుట్టినరోజున బహుమతులు ఇస్తామని ప్రకటించారు. సీఎం పుట్టిన రోజుకు రాష్ట్రమంతా హడావిడి చేయడానికి నిధులు వెచ్చిస్తున్న పర్యాటక శాఖ...పర్యాటకాభివద్ధికి ఉపయోగపడే ఉత్సవాలపై మాత్రం ఆసక్తి చూపడం లేదు. నిధులు లేవంటున్న ఆ శాఖ ఈ జగనన్న సంబరాలకు ఎక్కడి నుంచి తీసుకువచ్చిందో అర్థం కావడం లేదు. రెండు రోజులు విశాఖపట్నంలోనే వున్న పర్యాటక శాఖా మంత్రి రోజా విశాఖ ఉత్సవ్‌ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం మరీ విచిత్రం. విశాఖ ఉత్సవ్‌కు ఎలా లేదన్నా ఐదారు కోట్ల రూపాయలు అవసరం. నెల రోజుల ముందే తేదీలు ప్రకటించి, ఉత్సవాల గురించి పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్‌ల్లో పర్యాటక శాఖ రోడ్‌షోలు నిర్వహించాలి. ఆయా ప్రాంతాల నుంచే ఎక్కువగా పర్యాటకులు వస్తారు. అందుకని ముందస్తు ప్రచారం అవసరం. ఇప్పటివరకు అటువంటి ప్రయత్నాలు ఏమీ లేకపోవడంతో ఈ ఏడాదీ ఉత్సవ్‌ లేనట్టుగానే భావించాలేమో. ప్రజల దృష్టిని మళ్లించడానికి భారీ వ్యయంతో వర్షంలో సైతం ‘విశాఖ గర్జన’ నిర్వహించిన అమాత్యులకు విశాఖ ఉత్సవ్‌ నిర్వహించాలనే తపన లేకపోవడం శోచనీయం.

Updated Date - 2022-12-16T01:19:17+05:30 IST