పేర్లు మార్చి ఏమార్చి..

ABN , First Publish Date - 2022-11-17T02:58:09+05:30 IST

.ప్రభుత్వం పెంచలేదు... కానీ మద్యం సీసాల ధరలు పెరిగిపోయాయి. పెరిగిన ఎమ్మార్పీలతో మార్కెట్‌లోకి వచ్చేశాయి. ,,

పేర్లు మార్చి ఏమార్చి..

ప్రస్తుత బ్రాండ్లకే లేబుళ్లు మార్చి దోపిడీ

అదనపు ఆదాయానికి కొత్త ఎత్తుగడ

అదే పరిమాణం, అంతే నాణ్యత...

గుర్తించలేనిస్థాయిలో స్వల్ప సవరణ

(అమరావతి, ఆంధ్రజ్యోతి):.ప్రభుత్వం పెంచలేదు... కానీ మద్యం సీసాల ధరలు పెరిగిపోయాయి. పెరిగిన ఎమ్మార్పీలతో మార్కెట్‌లోకి వచ్చేశాయి. కొత్త రేట్లు చూసి మద్యంప్రియులు షాక్‌ అవుతున్నారు. అదేంటి ప్రభుత్వం ధరలు పెంచలేదు కదా అని ప్రశ్నిస్తే షాపులో సిబ్బంది వద్ద సమాధానం లేదు. ఇదంతా గమ్మత్తుగా ఉంది కదా! ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్మే సీసాల ధరల ఎలా పెరుగుతాయని అనిపిస్తోందా? వాస్తవానికి ధరలు పెరిగాయనే ఒక్క విషయం తప్ప అవి ఎలా పెరిగాయి? ఎందుకు పెరిగాయి? అనేది షాపుల్లోని సిబ్బందికిగానీ, బార్ల లైసెన్సీలకుగానీ ఎవరికీ తెలియదు. కేవలం చిన్న పేరు మార్పుతో వైసీపీ ప్రభుత్వం చేసిన గిమ్మిక్కు ఇది. నిబంధనల ప్రకారం ఒకసారి ఒక బ్రాండ్‌కు ధర నిర్ణయించిన తర్వాత మళ్లీ ప్రభుత్వం నియమించిన కమిటీ వద్దకు వెళ్లకుండా ఆ ధర మారదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో బ్రాండ్ల ధరలు మారిపోయాయి. ఉదాహరణకు బూమ్‌ లైట్‌ బీరు ధర కొద్దిరోజుల కిందటి వరకూ రూ.200 ఉంటే, ఇప్పుడు అది రూ.220 అయ్యింది. ఇలా దాదాపు పది రకాల బ్రాండ్ల ధరలు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే ధరలు పెరగలేదని, అవి కొత్త బ్రాండ్లని ఎక్సైజ్‌ శాఖ వాదిస్తోం ది. వాస్తవానికి అవి కొత్త బ్రాండ్లే. కానీ చూడటానికి అచ్చుగుద్దినట్లు పాత బ్రాండ్‌లానే కనిపిస్తున్నాయి. బ్రాండ్‌ పేరు, లోగో అన్నీ పాతవే ఉంటాయి. కానీ ఎవ రూ గుర్తించలేని స్థాయిలో ఎక్కడో చిన్నగా ఒక పదా న్ని దానికి కలపడంతో అది కొత్త బ్రాండ్‌గా మారిపోయింది. వాస్తవంగా చూస్తే ఆ లిక్కర్‌ నాణ్యతగానీ, పరిమాణంలోగానీ ఎలాంటి చిన్న మార్పు కూడా ఉం డదు. క్లుప్తంగా చెప్పాలంటే పేరు మార్చి కొత్త సీసాలో పాత మద్యం పోసి కంపెనీలు ధరలు పెంచుకుంటామంటే, జగన్‌సర్కారు అప్పనంగాఅనుమతులిచ్చేసింది.

వసూళ్లూ పెంపు

వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యం కంపెనీల నుంచి అమ్మే ప్రతి కేసుపై 20శాతం తమకు ఇవ్వాలని కండీషన్లు పెట్టారు. అలా అంగీకరించిన కంపెనీలే ఇప్పుడు రాష్ట్రంలో మద్యం విక్రయిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఈ వసూళ్ల వ్యవహారం నడిపిస్తున్నారు. పన్నులు వేయకముందు లెక్కలు తీసుకుంటే వేరియంట్ల పేరుతో దాదాపుగా అన్ని కంపెనీల బ్రాండ్ల కేసుల ధర సుమారు రూ.200 పెరిగింది. ఉదాహరణకు రూ.800 విలువైన కేసుపై ఇప్పటివరకూ రూ.160 కప్పం కడుతున్న కంపెనీలు, దాని ధర వెయ్యి కావడంతో రూ.200 కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఓ బ్రాండ్‌కు చెందిన ప్రతినిధి వ్యాఖ్యానించారు.

బ్రాండ్‌ వేరియంట్‌తో...

ఎక్సైజ్‌లో బ్రాండ్‌ వేరియంట్‌ అనే నిబంధన ఉంది. ఇప్పటికే రాష్ర్టానికి మద్యం సరఫరా చేస్తున్న మద్యం కంపెనీలు కొత్త పేరుతో వేరే బ్రాండ్‌ను ప్రవేశపెడితే నూతన ధరతో దానికి ఎక్సైజ్‌ అనుమతిస్తుంది. బ్రాండ్‌ వేరియంట్‌ పేరుతో కొత్త బ్రాండ్‌ కోసం కంపెనీలు చేసుకున్న దరఖాస్తులకు ఇటీవల ఎక్సైజ్‌ శాఖ అనుమతిచ్చింది. ఆవిధంగా పదికి పైగా కొత్త బ్రాండ్లకు అనుమతులు లభించినట్లు తెలిసింది. దీంతో కనిపించీ కనిపించకుండా మారిన పేరుతో పాత బ్రాండ్లనే కొత్త రేట్లకు అమ్ముతున్నారు. బ్రిటిష్‌ ఎంపైర్‌ అనే బీరుపై రూ.20 పెంచారు. హైదరాబాద్‌ బ్లూ విస్కీ క్వార్టర్‌ సీసా ధర రూ.130 నుంచి రూ.140కి చేరింది. అలాగే పలు చీప్‌ లిక్కర్‌, మీడియం రకం బ్రాండ్లు కొత్త వేరియంట్లను తీసుకొచ్చాయి. వీటికి ఇటీవల ఎక్సైజ్‌ శాఖ లేబుళ్లు జారీచేసింది. దీంతో కొత్త లేబుల్‌ వేసి, పెంచిన ఎమ్మార్పీతో మద్యం అమ్ముతున్నారు. ఇలా మధ్యలో వేరియంట్‌లను ప్రవేశపెట్టి ధరలు పెంచుకునే వ్యవహారం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ కావాల్సిన కంపెనీలకు మేలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఇష్టానుసారంగా అనుమతులిస్తోంది. పైగా కొత్త వేరియంట్‌ అంటే దాని నాణ్యతలో మార్పు ఉండాలి. ధర పెంచితే అందుకు అనుగుణంగా నాణ్యత మెరుగుపడాలి. కానీ ఇప్పుడు వచ్చిన వేరియంట్లలో ఎక్కడా నాణ్యత మెరుగుపడిన దాఖలాలు కనిపించడం లేదు. అదే మందుకు కొత్త పేరు పెట్టి అదనపు రేట్లతో అమ్ముతున్నారు.

రెండువిధాల లాభం...

కొత్త వేరియంట్లకు అనుమతులివ్వడం వల్ల అటు కంపెనీలకు ఇటు ప్రభుత్వానికీ లాభం చేకూరనుంది. సీసాపై రూ.10 పెరిగితే అందులో ఉత్పత్తి ఖర్చు కింద కంపెనీకి సుమారు మూడు రూపాయలు అదనంగా వెళ్తాయి. మిగిలిన ఏడు రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో వస్తాయి. అదే రూ.20 పెరిగితే దాదాపు రూ.15 ప్రభుత్వానికి ఆదాయంగా వస్తే, మిగిలిన రూ.5 మాత్రమే కంపెనీలకు వెళ్తాయి. అయితే 2017 నుంచి ధరలు పెంచడం లేదని ఆందోళనలో ఉన్న కంపెనీలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. చూడటానికి స్వల్పంగానే కనిపిస్తున్నా లక్షల సీసాలు అమ్మినప్పుడు లాభం భారీగా ఉంటుంది. అయితే అడిగిన అన్ని కంపెనీలకు కా కుండా కావాల్సిన కంపెనీలకు మాత్రమే అనుమతులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి.

Updated Date - 2022-11-17T02:58:22+05:30 IST