అమ్మో పులి .. బాబోయ్ ఏనుగులు
ABN , First Publish Date - 2022-11-27T00:18:55+05:30 IST
జిల్లావాసులను ఓ వైపు పులి.. మరోవైపు గజరాజులు వణికిస్తున్నాయి.
దీర్ఘకాలికంగా వేధిస్తున్న గజరాజుల సమస్య
తాజాగా పులి సంచారంతో మరింతగా భయాందోళన
(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి)
జిల్లావాసులను ఓ వైపు పులి.. మరోవైపు గజరాజులు వణికిస్తున్నాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వాటివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ప్రజలు, మూగజీవాలకు రక్షణ కొరవడింది. భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికార యంత్రాంగం కూడా పరిస్థితిని అదుపులోకి తేకపోవడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.
మన్యం జిల్లావాసులకు కొద్దిరోజులుగా ఏనుగులతో పాటు పులి భయం వెంటాడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఏనుగులతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి బెడద తీరక ముందే పులి హల్‌చల్ చేస్తుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి గజరాజుల సమస్య దశాబ్దాలుగా వేధిస్తున్నా అధికార యంత్రాంగం చర్యలు అంతంతమాత్రమే. వాటి తరలింపునకు చర్యలు తీసుకోకపోవడంతో జిల్లావాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిన్నమొన్నటి వరకూఏజెన్సీకి పరిమితమైన గజరాజులు ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. చేతికందొచ్చిన పంటలను ధ్వంసం చేస్తున్నాయి. రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇటీవల కొమరాడ మండలంలో ఓ రైతును ఒంటరి ఏనుగు హతమార్చిన విషయం తెలిసిందే. ప్రధానంగా జిల్లాలోని కొమరాడ, గరుగుబిల్లి, బలిజిపేట, సీతానగరం, తదితర మండలాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం అవి రోజుకోచోట హల్‌చల్ చేస్తూ స్థానికులను హడలెత్తిస్తున్నాయి. ఇదిలా ఉండగా మన్యంలో పులి సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. తాజాగా పార్వతీపురం మండల డొకిశీల పంచాయతీలో ఇప్పటికే గొర్రెతో పాటు ఆవును పులి హతమార్చింది. మరోక ఆవును తీవ్రంగా గాయపర్చింది. దీంతో ఆ పంచాయతీ పరిధిలోని బుచ్చింపేట, కొయ్యమెట్టవలస ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ ద్వారా నియామకమైన అమర్ ఇటీవల కొయ్యమెట్టవలసలో ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో పులి సంచారం దృశ్యాలు రికార్డయ్యాయి. హతమార్చిన ఆవును ఈ నెల 23 సాయంత్రం 6 గంటల సమయంలో పులి తీసుకెళ్లినట్లు కెమెరాల ద్వారా తెలిసింది. దీంతో ఆ ప్రాంతంలోనే పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖాధికారులు ప్రకటించారు. దాని పాదముద్రలు కూడా గుర్తించారు. దీనిపై అక్కడివారిని అప్రమత్తం చేశారు. ఒంటరిగా బయటకు రావొద్దని సూచించారు. దీంతో పశువులు, గొర్రెలు మేపుకునేందుకు, అటవీ ఉత్పత్తులను సేకరించేందుకు ఆయా గ్రామాల సమీపంలో జంతికొండ వైపు వెళ్లాల్సి ఉన్నా.. గిరిజనులు ఆ సాహసం చేయడం లేదు.
బోనులోకి పంపించేదెప్పుడో..?
డోకిశీల పంచాయతీ నుంచి సంగంవలస అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సంగంవలస దాటితే ఒడిశా బోర్డర్ ప్రారంభమవుతుంది. పులి ఒడిశా అటవీ ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉండడంతో కోరాపుట్ జిల్లా అటవీశాఖ అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర అటవీ శాఖాధికారులు ఈ నెల 24న సంగంవలస అటవీ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. కాగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల మధ్య సంచరిస్తున్న పులి వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. దానిని పట్టుకోవాలంటే జూలో ఉండే మత్తు తుపాకీల ద్వారా ప్రయత్నించాలి. పులికి 200-300 మీటర్ల దూరంలో ఆ తుపాకీ ద్వారా మత్తును పంపిస్తే ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అప్పుడే దానిని బోనులో బంధించడం సాధ్యమవుతుంది. అయితే ఇప్పటివరకూ పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి గజరాజులు, పులిని వేరే ప్రాంతానికి తరలించే చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు.
గుమడ సమీపంలో గజరాజులు
కొమరాడ : మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గుమడ గ్రామ పంట పొలాల్లో శనివారం గజరాజులు దర్శనమిచ్చాయి. దీంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ముమ్మరంగా వరి పంట కోతలు జరుగుతున్న తరుణంలో ఏనుగులు కనిపించడంతో పోలాల్లోకి వెళ్లలేకపోతున్నారు. వేలాది రూపాయలు మదుపులు పెట్టి ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందొంచిన తరుణంలో గజరాజుల సంచారం వారిని కలవరపెడుతోంది. గత నాలుగు రోజులుగా నాగావళి ఆవల వైపు తొడుము, దళాయిపేట, కోదులగుంప పంట పొలాల్లో సంచరించే ఏనుగులు గుమడ వైపు వచ్చినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు, ప్రజలు పంట పొలల్లోకి వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
రావివలస పరిసరాల్లో పులి!
గరుగుబిల్లి : రావివలస పరిసరాల్లోని పంట పొలాల్లో శనివారం పులి కనిపించినట్లు గ్రామస్థులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో రావివలస, లఖనాపురంలో కురుపాం అటవీ రేంజ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పరిసర గ్రామాలకు చెందిన వారు పంట పొలాలకు వెళ్లరాదని, రాత్రి సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పులి సంచారంపై నిర్ధారణ చేసిన తర్వాత పొలాలకు వెళ్లాలన్నారు. అటవీశాఖ అధికారులకు సహకరించాలని కోరారు.
చర్యలు తీసుకుంటున్నాం..
జిల్లాలో పులి సంచరిస్తున్న ప్రాంతంలో అటవీ శాఖ తరఫున తగు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలి. ఏనుగులు, పులి వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
- త్రినాథ్, పార్వతీపురం అటవీశాఖ రేంజర్