బెట్టింగ్ భూతం
ABN , First Publish Date - 2022-11-05T00:27:50+05:30 IST
రాజాం పట్టణంలోని ఓ వీధిలో ఇంటి వద్దకు పదుల సంఖ్యలో యువత చేరుతుంటారు. చేతిలో సెల్‌ఫోన్‌తో నిత్యం గడుపుతుంటారు. ఏదో సినిమానో, షార్ట్ వీడియోలు చూస్తుంటారని చాలా మంది అనుకుంటున్నారు. వారు బెట్టింగ్ ఆడుతున్నట్లు అతి కొద్దిమందికే తెలుసు.
పట్టణాలు, పల్లెల్లోనూ యథేచ్ఛగా నిర్వహిస్తున్న ఆట
డబ్బులు పోగొట్టుకొని బలవన్మరణాలు
మనస్తాపంతో కుటుంబాలను వదలి పరారీ
రాజాం, నవంబరు 4:
- రాజాం పట్టణంలోని ఓ వీధిలో ఇంటి వద్దకు పదుల సంఖ్యలో యువత చేరుతుంటారు. చేతిలో సెల్‌ఫోన్‌తో నిత్యం గడుపుతుంటారు. ఏదో సినిమానో, షార్ట్ వీడియోలు చూస్తుంటారని చాలా మంది అనుకుంటున్నారు. వారు బెట్టింగ్ ఆడుతున్నట్లు అతి కొద్దిమందికే తెలుసు.
- రాజాంకు సమీపంలో ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా బెట్టింగ్ ఆడేవారున్నారు. యువతతో పాటు చిరు వ్యాపారాలు చేసేవారు, చిరుద్యోగులూ బెట్టింగ్ కాస్తున్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకుని వడ్డీ వ్యాపారుల వేధింపులకు తాళలేక పరారీలో ఉన్న బాధితులు ఎందరో.
- విజయనగరం, గజపతినగరంలో బెట్టింగ్‌లో పేరు మోసిన వారున్నారు. ఇతర చోట్ల ఉన్న నిర్వాహకులతో చేతులు కలిపి ఒక్కొక్కొరిని ఈ రొంపిలోకి లాగుతుంటారు. డబ్బులు ఆశ చూపి ఇల్లు గుల్ల చేస్తుంటారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి ఊహించని షాక్ తగిలాక ఆత్మహత్య చేసుకున్న వారు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు.
- గత ఏడాది రాజాం పట్టణానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువులో చురుగ్గా ఉండే ఆ యువకుని మరణం కుటుంబ సభ్యులకు అంతుపట్టలేదు. క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని మనస్తాపంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆలస్యంగా తెలుసుకున్నారు. ఆ ఘటన నుంచి తల్లిదండ్రులు నేటికీ బయటపడలేకపోతున్నారు.
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ తార స్థాయిలో జరుగుతోంది. పట్టణాలు, పల్లెల్లోనూ ఈ క్రీడాకారులున్నారు. ఒకరిని చూసి మరొకరు సులువుగా దారి తప్పుతున్నారు. కొద్దిమొత్తంలో వచ్చే లాభాలను చూసి ఉన్నదంతా అప్పజెబుతున్నారు. ప్రస్తుతం అంతటా టి20 వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ప్రధాన జట్ల మధ్య మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఏ ఇద్దరు కలిసినా క్రికెట్ మ్యాచ్ విషయాలే చర్చకు వస్తున్నాయి. విద్యార్థులు, యువత టీవీలు, సెల్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. యువత ఆసక్తిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు బెట్టింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు, నిఘా ఎక్కువ కావడంతో పందెంరాయుళ్లు క్రికెట్ బెట్టింగ్‌పై పడ్డారు. మ్యాచ్‌లు కేవలం 20 ఓవర్లతో పూర్తవుతుండడంతో బెట్టింగు కాయడం సులువుగా మారింది. కేవలం రెండుమూడు గంటల పాటు టీవీ, సెల్ పట్టుకుని కూర్చుంటే చాలు రూ.లక్షల ఆదాయం చేతికి రావడమో, పోవడమో జరిగిపోతోంది. వందమందిలో ఒకరికి వచ్చినట్టు తెలిసి మిగతా వారు కూడా ఆశలు పెంచుకుని చివరకు అప్పుల ఊబిలోకి వెళ్లిపోతున్నారు. దీనిపై పోలీసుల నిఘా ఉండడం లేదు. ఆన్‌లైన్‌లో అంతా జరిగిపోతుండడంతో బెట్టింగ్‌రాయుుళ్లకు పని సులభతరమైంది.
ఓ మాఫియాలా..
బంతి బంతికీ, పరుగు పరుగుకూ, బౌండరీకి, సిక్సర్‌కు, వికెట్‌కి.. ఇలా అన్నింటికీ బెట్టింగ్ సాగుతోంది. ఇదో పెద్ద మాఫియాలా విస్తరిస్తోంది. బెట్టింగ్ రాయుళ్లు, నమ్మకస్తులు వాట్సాప్ గ్రూపుగా ఏర్పడుతున్నారు. పందాలు కాస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు, యువతను ఇందులో భాగస్థులను చేస్తున్నారు. టాస్ వేసిన నాటి నుంచి మ్యాచ్ ముగిసే వరకూ ప్రతి నిమిషం ఈ ప్రక్రియ సాగుతోంది. తోపుడు బళ్ల వ్యాపారుల నుంచి హోటల్ వ్యాపారుల వరకూ బెట్టింగులకు పాల్పడుతున్నారు. గెలుపొందితే రాత్రికి రాత్రే లక్షాధికారులం అవుతామని భ్రమ పడుతున్నారు. చివరికి నిండా మునిగిపోతున్నారు. అప్పులపాలై మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొందరు ముఖం చూపించలేక కుటుంబాలను వదలి పరారవుతున్నారు.
- రాజాంలో ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఎన్నో విద్యాసంస్థలున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణానికి వేలాది మంది విద్యార్థులు వస్తుంటారు. ఈ క్రమంలో బస్టాండ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు వేదికగా చేసుకొని కొంతమంది బుకీలు రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. వారు క్రికెట్ బెట్టింగ్ రొంపిలోకి విద్యార్థులను లాగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు తక్షణం దృష్టిసారించాల్సిన అవసరముంది.
చర్యలు చేపడతాం
పిల్లల కదలికలపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు పోలీస్ శాఖపరంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయంలో ఉన్నతాధికారులు కూడా కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక దృష్టిపెట్టాం. ఎవరినీ విడిచి పెట్టేదిలేదు. ఎక్కడైనా యువకులు, విద్యార్థులు అనుమానాస్పదంగా కనిపిస్తే ఫిర్యాదు చేయాలి. బెట్టింగ్ అత్యంత ప్రమాదకరం అన్న విషయాన్ని గుర్తెరగాలి.
- కె.రవికుమార్, సీఐ, రాజాం
-