ఇంకా ఎంతమంది చావాలి?

ABN , First Publish Date - 2022-11-05T00:06:33+05:30 IST

అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వానిది కాదా ఈపాపం! హామీలిచ్చి అటకెక్కించిన నాయకగణానిది కాదా ఈపాపం! గిరిజనులే కదాని నిర్లక్ష్యం వహించిన పాలకులది కాదా ఈపాపం! రోడ్డు సరిగాలేక.. వైద్యం సకాలంలో అందక ఓ 39 ఏళ్ల గిరిజనుడు ప్రాణాలొదిలాడు. భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు.

ఇంకా ఎంతమంది చావాలి?
దారపర్తి పంచాయతీ గ్రామాలకు వెళ్లే రోడ్డు ఇదే. ఇన్‌సెట్‌లో లక్ష్మణరావు మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్తున్న కుటుంబీకులు

సకాలంలో వైద్యం అందక మరో గిరిజనుడి మృతి

ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీ కట్టాల్సిందే

దశాబ్దాలుగా కానరాని రహదారి

14 కి.మీ. నడిస్తేనే అందుబాటులోకి వాహనం

అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వానిది కాదా ఈపాపం! హామీలిచ్చి అటకెక్కించిన నాయకగణానిది కాదా ఈపాపం! గిరిజనులే కదాని నిర్లక్ష్యం వహించిన పాలకులది కాదా ఈపాపం! రోడ్డు సరిగాలేక.. వైద్యం సకాలంలో అందక ఓ 39 ఏళ్ల గిరిజనుడు ప్రాణాలొదిలాడు. భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లేయించుకున్న ప్రజాప్రతినిధులు దీనికి ఏం సమాధానం చెబుతారు? తప్పు తమది కానేకాదంటారా? తమను గెలిపించిన ప్రజలదేనంటారా? ఇంకా ఎంతమంది చావాలి? చచ్చినా స్పందించరా?

శృంగవరపుకోట రూరల్‌, నవంబరు 4:

ఎస్‌.కోట మండలం దారపర్తి గ్రామానికి చెందిన పాడి లక్ష్మణరావు (39) గిరిజనుడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. తనకు, కుమారునికి కూడా జ్వరం రావడంతో ఈనెల 25న ఆసుపత్రికి వెళ్లారు. 18 కి.మీ. నడిచి ఎస్‌.కోటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులు అక్కడే ఉన్నారు. చికిత్స చేయించుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చారు. అయితే గత మూడు రోజుల నుంచి మళ్లీ జ్వరం మొదలైంది. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విరేచనాలు అవుతున్నాయి. నడవలేని స్థితిలో ఉన్నాడు. దీంతో శుక్రవారం ఉదయం కొందరు యువకులు డోలీ కట్టారు.లక్ష్మణరావును అందులో పడుకోబెట్టుకుని ఆసుపత్రికి బయల్దేరారు. కొద్దిదూరం వెళ్లగానే లక్ష్మణరావు మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు.

డోలీనే అంబులెన్స్‌

గిరిశిఖర పంచాయతీ వాసులకు డోలీలే అంబులెన్స్‌లు. దారపర్తి పంచాయతీ పరిధిలో 12గ్రామాలు, సుమారు 300 కుటుంబాలు ఉన్నాయి. 1100 మంది జనాభా, 700 పైగా ఓటర్లు ఉన్నారు. వీరికి చిన్నపాటి ఆనారోగ్యం చేసినా ఒక దుప్పటిని కర్రకు కట్టి అందులో బాధితుడిని 14 కి.మీ. దూరాన ఉన్న మైదాన ప్రాంతానికి తీసుకుని వెళ్తారు. కొన్ని సందర్భాల్లో మంచాన్ని డోలీగా మార్చి దానిపై పడుకోబెట్టి కిందకు దింపుతారు. మైదాన ప్రాంతానికి వచ్చి వాహనం మాట్లాడుకుని ఎస్‌.కోట ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఆసుపత్రికి చేరేవరకు వీరి ప్రాణాలు గాల్లో దీపాలే. ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. రోడ్డంతా రాళ్లుతేలి గుంతలు పడి కనీసం నడవడానికి కూడా వీలులేకుండా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు వచ్చినా వీరి సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నాయకులు కూడా తమను గెలిపిస్తే రోడ్డు వేయిస్తామన్నారు. గిరిజనుల కష్టాలన్నీ తీరుస్తామన్నారు. ఎన్నికలు పూర్తయ్యాయి. ఆపార్టీనే అధికారంలోకి వచ్చింది. మూడున్నరేళ్లు గడిచిపోయాయి. హామీ మాత్రం కార్యరూపం దాల్చలేదు. గిరిజనుల కష్టాలు గట్టెక్కలేదు.

ఇలాంటివి ఎన్నో..

- ఈ ఏడాది అక్టోబరులో దారపర్తి పంచాయతీ కురిడి గ్రామానికి చెందిన మాదల అరుణ్‌ అనే 15ఏళ్ల బాలుడు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి 13 కిలోమీటర్ల మేర నడిచి మైదాన ప్రాంతానికి తీసుకెళ్తారు.

- ఈ ఏడాది ఆగస్టు నెలలో పోర్లు గ్రామానికి చెందిన దారప్ప అనే మహిళ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటే డోలీ ద్వారా కిందకు దింపారు.

- ఈ ఏడాది జనవరిలో దారపర్తి పంచాయతీకి చెందిన మజ్జి గంగమ్మ (నెలలు నిండిన గర్భిణి)ను డోలీ కట్టి 12 కిలోమీటర్ల మేర నడిచి తీసుకువెళ్లారు.

- ఇదే నెలలో చప్పనిగెడ్డ గ్రామానికి చెందిన కిల్లో జమ్మపతికి పురిటినొప్పులు అధికం కావడంతో అతికష్టమ్మీద 13 కిలోమీటర్లు వెదురుతట్టను డోలీగా మార్చి మైదాన ప్రాంతానికి తరలించారు.

Updated Date - 2022-11-05T00:08:54+05:30 IST