Weather Bulletin: జనవరిలో సాధారణ చలి

ABN , First Publish Date - 2022-12-31T19:37:22+05:30 IST

చలి (cold)తో గజగజలాడాల్సిన డిసెంబరులో నాలుగైదు రోజులు తప్ప మిగిలిన రోజులు ఉక్కపోత కొనసాగింది. జనవరి నెలలో కూడా అదే మాదిరి వాతావరణం కొనసాగనున్నది.

Weather Bulletin: జనవరిలో సాధారణ చలి

విశాఖపట్నం: చలి (cold)తో గజగజలాడాల్సిన డిసెంబరులో నాలుగైదు రోజులు తప్ప మిగిలిన రోజులు ఉక్కపోత కొనసాగింది. జనవరి నెలలో కూడా అదే మాదిరి వాతావరణం కొనసాగనున్నది. ఉత్తర కోస్తాలో కొంత ప్రాంతం తప్ప కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో చలి సాధారణంగా ఉండనున్నది. ఈ నెలలో రాయలసీమ (Rayalaseema), కోస్తాలోని నెల్లూరు నుంచి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే ఎక్కువ నమోదుకానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదు కావడంతో చలి తీవ్రత వుంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు ఉత్తర కోస్తాలో సాధారణం కంటే ఎక్కువగా, దక్షిణ కోస్తాలో తక్కువగా, రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో సాధారణంగా, కొద్ది ప్రాంతాల్లో తక్కువగా నమోదు కానున్నాయని పేర్కొంది.

దేశంలో జనవరి నుంచి మార్చి వరకు ఉష్ణోగ్రతలు, వర్షాలు, జనవరి (January)లో ఉష్ణోగ్రతలు, వర్షాలపై శనివారం భారత వాతావరణ శాఖ బులెటిన్‌ (Bulletin) విడుదల చేసింది. వర్షాలపరంగా చూస్తే జనవరిలో రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువగా, ఉత్తర కోస్తాలో సాధారణంగా, దక్షిణ కోస్తాలో తక్కువగా కురవనున్నాయి. కాగా జనవరి నుంచి మార్చి వరకు రబీ సీజన్‌లో సాగు ఎక్కువగా జరిగే వాయువ్య భారతంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని తాజా బులెటిన్‌ వెల్లడించింది. సాధారణంలో 86 శాతం కంటే తక్కువ వర్షాలు కురవడం వల్ల గోధుముల సాగు, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం వుంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఇదే సీజన్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు చూస్తే మధ్య భారతంలో సాధారణం కంటే తక్కువగా, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లానినా మార్చి వరకు కొనసాగి తరువాత క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2022-12-31T19:37:23+05:30 IST