ఆనందం ఆవిరి

ABN , First Publish Date - 2022-07-19T05:54:08+05:30 IST

ఆనందం ఆవిరి

ఆనందం ఆవిరి

చెల్లించిన సొమ్ము వెనక్కి .. పామాయిల్‌ రైతుల్లో ఆందోళన
 మేలో టన్ను రూ. 23,365గా ప్రకటన.. జూన్‌లో రూ.20,451గా నిర్ణయం
 టన్నుకు రూ.2,914 తగ్గింపు.. రైతులకు చెల్లించింది 22,770.. వెనక్కి తీసుకునేది 2,319

పెదవేగి, జూలై 18: మునుపెన్నడూ లేనంతగా, రైతులెవ్వరూ ఊహి ంచని రీతిలో పామాయిల్‌ గెలలకు నెలనెలా ధర పెరుగుతూ వస్తుండడంతో రైతులు సంతోషించారు. ఆ ఆనందం ఆవిరవడానికి ఎన్నోనెలలు పట్టలేదు. నవంబరు నుంచి పామాయిల్‌ గెలల ధరలో పెరుగుదల ప్రారంభమైంది. జనవరిలో టన్ను రూ.17వేలకు చేరుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి గణనీయంగా పెరుగుతూ టన్ను రూ.23,365కు చేరి, మేలో ఆయిల్‌పామ్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. జూన్‌లో రైతులకు ఏపీ ఆయిల్‌ఫెడ్‌ రూ.22,770 చెల్లించింది. జూలైలో ధర సవ రించి, టన్ను రూ.20,451గా నిర్ణయించింది. దీంతో ధరలో రూ.2914ను తగ్గించేసింది. రైతుల నుంచి రూ.2,319 వెనక్కి తీసుకోనుంది. అధికంగా చెల్లించిన సొమ్మును జూలైలో పంపించిన పామాయిల్‌ గెలల్లో తగ్గించి రైతులకు చెల్లిస్తారు. దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరను పెంచినట్లు పెంచి, తగ్గించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గెలల ధరను తగ్గించారు. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించారా అని నిలదీస్తున్నారు. అం తర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గడంతో ఆ ప్రభావం పామాయిల్‌ ధరలపై పడిందని ఏపీ ఆయిల్‌ఫెడ్‌ అధికారులు చెబు తున్నారు. జనవరిలో క్రూడాయిల్‌ మెట్రిక్‌ టన్ను ధర రూ.1,07,808. మే నాటికి గరిష్ఠంగా రూ.1,46,074కు చేరుకుంది. జూన్‌లో తగ్గింది. ఈ ప్రభావం జూన్‌లో రైతులకు చెల్లించే పామాయిల్‌ గెలలపై పడింది. మేలో ధరను జూన్‌లో రైతులకు చెల్లించినప్పటికీ జూలైలో చెల్లింపుల్లో కోత విధిస్తారు. మార్కెట్‌ ధరలో వచ్చే మార్పులను బట్టి రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు. కనీస మద్దతు ధర రూ.20వేలకు తగ్గకుండా ఉంటేనే గిట్టుబాటు ఉంటుందనేది రైతులు చెబుతున్నారు.

Updated Date - 2022-07-19T05:54:08+05:30 IST