కార్తీక సోమవారం శైవక్షేత్రాలు కిటకిట
ABN , First Publish Date - 2022-11-15T00:01:28+05:30 IST
కార్తీక మాసం మూడో సోమవారం శివాలయాలు భక్తుల శివ నామస్మరణతో హోరెత్తాయి.
ఆచంట, నవంబరు 14: కార్తీక మాసం మూడో సోమవారం శివాలయాలు భక్తుల శివ నామస్మరణతో హోరెత్తాయి. వేకువజామునే గోదావరి కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. ఆచంటేశ్వరుడి ఆలయం వేకువజాము నుంచి సాయంత్రం వరకు భక్తులతో కిటకిట లాడింది. భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కర్పూర జ్యోతిలో భక్తులు ఆవు నెయ్యి వేసి మొక్కు తీర్చుకున్నారు.
భీమవరం టౌన్ / రూరల్: పట్టణంలోని మెంటే వారి తోట బాలా త్రిపుర సుందరి ఆలయంలో రుద్రహోమం, నవగ్రహ హోమం నిర్వహిం చారు. గునుపూడి పెద కుమ్మర్ల వీధి వీరభద్రస్వామికి ప్రత్యేక అలంకారం చేశారు. మండలంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యనమదుర్రు శక్తీశ్వరస్వామి, దిరుసుమర్రు గంగా భ్రమరాంబిక రామలింగేశ్వరస్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నరసాపురం: శివ నామస్మరణతో తీరం మార్మోగింది. తెల్లవారుజా మున గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో వలంధర్‌రేవు, అమరేశ్వర రేవులు కిటకిటలా డాయి. మహిళలు గోదావరిలో కార్తీక దీపాలను విడిచిపెట్టారు.