తొలగించరెందుకో..?
ABN , First Publish Date - 2022-11-03T00:24:17+05:30 IST
శిథిలావస్థకు చేరిన ట్యాంకు తొలగింపుపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
కలిదిండి, నవంబరు 2: శిథిలావస్థకు చేరిన ట్యాంకు తొలగింపుపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పెదలంకలోని రక్షిత మంచినీటి సరఫరా చేసే ఓవర్ హెడ్ ట్యాంక్ శిథిలావస్థకు చేరడంతో అధికారులు మరో ట్యాంకును నిర్మించారు. అయితే 37 ఏళ్ల క్రితం నిర్మించిన పాత ట్యాంక్ పిల్లర్లు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటపడి కూలడానికి సిద్ధంగా ఉంది. దీనికి ఒక పక్క కొత్తగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్, మరో పక్క జడ్పీహైస్కూల్ ఉంది. పురాతన ట్యాంకు జడ్పీ హైస్కూల్ వైపు కూలిపోతే విద్యార్థులకు ప్రమాదం. కొత్త ట్యాంక్‌పై కూలితే భారీ నష్టం సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో నిరుపయోగంగా ఉన్న ట్యాంక్‌ను అధికారులు ఎందుకు తొలగించటం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్‌ను తొలగించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. ఏ క్షణంలో ఓవర్ హెడ్ ట్యాంక్ కూలిపోతుందోనని జడ్పీ హైస్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ నాగబాబును వివరణ కోరగా, శిథిలావస్థలో ఉన్న ట్యాంక్ తొలగింపునకు చర్యలు తీసుకుంటామన్నారు.