Zomato: ఓ జొమాటో కస్టమర్ ఎన్ని ఆర్డర్లు ఇచ్చాడో తెలిస్తే నమ్మలేరు!
ABN , First Publish Date - 2022-12-27T21:55:24+05:30 IST
ఆకర్షణీయమైన ఆఫర్లు, వందలాది రకాల రుచికరమైన ఆహార పదార్థాల లభ్యతతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌పై ఆర్డర్లు చేసే కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగరాల నుంచి పట్టణాల వరకు ఈ ట్రెండ్ కనిపిస్తోంది. ఆకలి తీర్చుకోవడానికి కొందరైతే..
న్యూఢిల్లీ: ఆకర్షణీయమైన ఆఫర్లు, వందలాది రకాల రుచికరమైన ఆహార పదార్థాల లభ్యతతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌పై ఆర్డర్లు చేసే కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగరాల నుంచి పట్టణాల వరకు ఈ ట్రెండ్ కనిపిస్తోంది. ఆకలి తీర్చుకోవడానికి కొందరైతే.. మరికొందరు కస్టమర్లు తమకు ఆహారం నచ్చితే పదేపదే ఆర్డర్ చేస్తుంటారు. అయితే లెక్కకు మించి ఆర్డర్లు ఇచ్చేవారు కూడా ఉంటారని ఓ కస్టమర్ నిరూపించాడు. ఢిల్లీకి చెందిన అంకుర్ అనే జొమాటో (Zomato) కస్టమర్ 2022 ఏడాదిలో ఏకంగా 3,330 ఫుడ్ ఆర్డర్లు ఇచ్చాడు. ఏడాదంతా ప్రతిరోజూ సగటున 9 చొప్పున ఫుడ్ ఆర్డర్లు ఇచ్చాడు. దీంతో అంకుర్‌ను 2022లో ‘ది నేషన్స్ బిగ్గెస్ట్ ఫుడీ’గా (The nation’s biggest foodi) జొమాటో గుర్తించింది. ఈ మేరకు తన వార్షిక రిపోర్టులో పేర్కొంది.
2022లో కస్టమర్లు ఫుడ్ ఆర్డర్లు ఇచ్చిన తీరును ఈ నివేదికలో ప్రస్తావించింది. మరోసారి 2022లో కూడా బిర్యానీ అత్యధికంగా ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌గా నిలిచిందని పేర్కొంది. 2022లో ప్రతి నిమిషానికి 186 బిర్యానీలు చొప్పున జొమాటో కస్టమర్లు ఆర్డర్లు ఇచ్చారని తెలిపింది. బిర్యానీ ఒక్క జొమాటోపైనే కాకుండా స్విగ్గీపైనే కూడా టాప్ ప్లేస్‌లో ఉండడం గమనార్హం. మరోవైపు 2022లో జొమాటోపై అత్యధికంగా ఆర్డర్లు ఇచ్చిన ఆహారాల పదార్థాల జాబితాలో బిర్యానీ తర్వాతి స్థానంలో పిజ్జా నిలిచింది. పిజ్జా లవర్స్ ఈ ఏడాది ప్రతి నిమిషానికి 139 పిజ్జాల చొప్పున ఆర్డర్లు ఇచ్చారని జొమాటో వార్షిక రిపోర్టు పేర్కొంది.