Elon Musk: సంచలనం.. ట్విటర్‌ చీఫ్ పదవికి మస్క్ రాజీనామా చేయనున్నారా.. ?

ABN , First Publish Date - 2022-12-19T21:47:43+05:30 IST

వేల కోట్లు పెట్టి ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. సంస్థ చీఫ్‌గా రాజీనామా చేయనున్నారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న ప్రశ్న ఇది. కారణం.. ఆయన తాజాగా నిర్వహించిన ఓ ట్విటర్ పోల్. పోల్ ఫలితాలు మస్క్‌కు వ్యతిరేకంగా రావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Elon Musk: సంచలనం..  ట్విటర్‌ చీఫ్ పదవికి మస్క్ రాజీనామా చేయనున్నారా.. ?

ఇంటర్నెట్ డెస్క్: వేల కోట్లు పెట్టి ట్విటర్‌ను(Twitter) కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్(Elon Musk).. సంస్థ చీఫ్‌గా రాజీనామా చేయనున్నారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న ప్రశ్న ఇది. కారణం.. ఆయన తాజాగా నిర్వహించిన ఓ ట్విటర్ పోల్(Twitter Poll). ‘‘నన్ను ట్విటర్‌ పగ్గాలు వదులుకోమంటారా..’’ అంటూ మస్క్ ఆదివారం నాడు నెటిజన్లపై అకస్మాత్తుగా ఓ ప్రశ్న సంధించారు. పోల్ ఫలితాలకు కట్టుబడి ఉంటానని చెప్పిన ఆయన.. తన ప్రశ్నకు ఆచితూచి సమాధానం ఇవ్వాలని సూచించారు. ఈ పోల్‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. మస్క్ వైదొలగాలంటూ అత్యధికులు డిమాండ్ చేశారు. ట్విటర్ పగ్గాలను మస్క్ వదులుకోవాలని 57.5 శాతం మంది తేల్చి చెప్పగా.. ట్విటర్‌ పగ్గాలు మస్క్ వద్దే ఉండాలంటూ 47.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. ట్విటర్ పోల్ ఫలితం వ్యతిరేకంగా వస్తే తను ఎప్పటిలోగా రాజీనామా చేస్తారనే విషయాన్ని మాత్రం మస్క్ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో..మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ షేర్లు ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో 5 శాతం మేర పుంజుకున్నాయి.

స్పేస్ ఎక్స్(Space X), ట్విటర్(Twitter), టెస్లా(Tesla), న్యూరాలింక్(Neuralink) సంస్థలతో పాటూ టన్నెళ్లను నిర్మించే ది బోరింగ్ కంపెనీకి కూడా మస్క్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు..మస్క్‌కు ట్విటర్ ఆర్థికంగా భారంగా మారొచ్చని టెస్లా సంస్థ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ టెస్లా షేర్ల విలువ 60 శాతం మేర పతనమైంది. సప్లయ్ చైన్ సమస్యలు, ఎలక్ట్రిక్ వాహనరంగంలో పోటీ పెరగడం వంటి పరిణామాలు టెస్లా షేర్ల పతనానికి దారితీసాయి. ట్విటర్ కొనుగోలుకు పూర్వం అత్యంత ధనవంతుడిగా వెలిగిన మస్క్.. ఈ నెలలో రెండవ స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. అయితే.. టెస్లా పగ్గాలను మస్క్ వదులుకుంటారని వ్యాపార రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘ట్విటర్ చీఫ్‌గా మస్క్ ప్రయాణం ముగిసినట్టే కనిపిస్తోంది. ఇది టెస్లా సంస్థకు ఓ సానుకూల పరిణామం కావచ్చు.’’ అని ప్రముఖ స్టాక్‌మార్కెట్ ఎనలిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు. టెస్లా అంటే మస్క్..మస్క్ అంటే టెస్లా అంటూ తన అభిప్రాయాన్ని ఒక్కవాక్యంలో ముగించారు.

Updated Date - 2022-12-19T21:56:05+05:30 IST