twitter layoffs: భారత్‌లో భయం భయంగా ఉద్యోగులు
ABN , First Publish Date - 2022-11-04T18:52:07+05:30 IST
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) చేతికి ట్విట్టర్ (Twitter) వెళ్లాక ఉద్యోగుల్లో భయం మొదలైంది. ఉద్యోగాలు ఉంటాయో
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) చేతికి ట్విట్టర్ (Twitter) వెళ్లాక ఉద్యోగుల్లో భయం మొదలైంది. ఉద్యోగాలు ఉంటాయో, పోతాయో తెలియని స్థితిలో వారంతా క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ముఖ్యంగా ఇండియాలోని దాదాపు 200 మంది ఉద్యోగుల్లో భయం నెలకొంది. వారు కార్యాలయాలకు చేరుకున్న తర్వాత అధికారిక ఈ-మెయిల్స్, గ్రూప్ చాట్‌ల యాక్సెస్ కోల్పోవడంతో మరింత గందరగోళానికి గురయ్యారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉద్యోగులు మాట్లాడుతూ.. శుక్రవారం తాము ఇంటి నుంచి (వారంతా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నారు) తమ సిస్టమ్స్‌లో లాగిన్ అయేందుకు ప్రయత్నిస్తే యాక్సెస్ కాలేదని వాపోయారు. తమ ఉద్యోగాలు ఉన్నాయో, పోయాయో తెలియక ఆందోళనకు గురవుతున్నట్టు చెప్పారు. కాగా, ఉద్యోగం ఉన్నదీ, లేనిదీ ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తామని కంపెనీ పేర్కొందని ఉద్యోగులు చెబుతున్నారు. కంపెనీతో తెగదెంపుల చెల్లింపులు, ఇతర విషయాలపై తమకు ఎలాంటి సమాచారమూ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ట్విట్టర్ స్లాక్, గ్రూప్ చాట్ గ్రూప్స్ యాక్సెస్ కాకపోవడంపై ఉద్యోగులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి అంతర్గతంగా ఎలాంటి సమాచారమూ లేదని వాపోతున్నారు. తమను వదిలించుకోవాలనుకోవడం అమానవీయ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ఇండియాలో ఏళ్ల తరబడి పని చేసిన తమకు.. సంస్థ మస్క్ చేతుల్లోకి వెళ్లాక ఎలాంటి సమాచారమూ లేకుండా పోయిందన్నారు.
ఉన్న ఉద్యోగులు కూడా భయంభయంగా గడుపుతున్నారు. తదుపరి రౌండ్‌లో వేటు తమపైనే పడుతుందన్న భయం వారిలో కనిపిస్తోంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో 7,600 మంది ఉద్యోగులు ఉండగా దానిని 3,800కు తగ్గించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ట్విట్టర్ కార్యాలయాలకు ఉద్యోగి బ్యాడ్జ్ యాక్సెస్ ఇప్పటికే తాత్కాలికంగా మూసివేసినట్టు తెలుస్తోంది. ప్రతి ఉద్యోగి, ట్విట్టర్ సిస్టమ్స్, కస్టమర్ డేటా భద్రతను నిర్ధారించడంలో సాయపడేందుకు తమ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ట్విట్టర్ అంతర్గత మెమోలో పేర్కొంది. అలాగే, అన్ని బ్యాడ్జ్ యాక్సెస్ నిలిపివేసినట్టు తెలిపింది. కార్యాలయాల్లో కానీ, లేదంటే కార్యాలయాలకు వెళ్లే మార్గంలో ఉంటే కనుక దయచేసి ఇంటికి వెళ్లిపోవాలని అందులో పేర్కొంది.