Parag agrawal: ఉద్యోగం కోల్పోయినా పరాగ్ అగర్వాల్‌దే విజయం..కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-10-28T19:29:56+05:30 IST

ట్విటర్ సీఈఓగా ఉద్యోగం కోల్పోయినా తాను అనుకున్నది సాధించిన పరాగ్ అగర్వాల్‌

Parag agrawal: ఉద్యోగం కోల్పోయినా పరాగ్ అగర్వాల్‌దే విజయం..కారణం ఇదే..

వాషింగ్టన్: మస్క్(Elon Musk) చేతికి ట్విటర్.. కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌(Parag Agrawal) తొలగింపు.. ఇదీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వర్గాల్లో నేడు పెద్ద చర్చకు దారితీసిన అంశం! ఇది మొదటి నుంచీ అందరూ ఊహిస్తున్నదే. అయితే.. తన ఉద్యోగం పొగొట్టుకున్నప్పటికీ విజయం మాత్రం పరాగ్ అగర్వాల్‌దే అని వ్యాపార వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. మస్క్‌తో ట్విటర్‌ను(Twitter) కొనుగోలు చేయించేందుకు అనేక ప్రయత్నాలు చేసిన పరాగ్.. చివరకు అనుకున్నది సాధించారు. ఈ మొత్తం వ్యవహారంలో పరాగ్ తొలగింపునకు ప్రాధాన్యం తక్కువే అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ అసలు కథ..

ట్విటర్‌లో మస్క్ కొంత వాటా కొనుగోలు చేసిన తరువాత.. పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ట్విటర్ వాటాలు కొనుగోలు చేశాక మస్క్.. బోర్డు సభ్యుడిగా చేరేందుకు విముఖత ప్రదర్శించారు. దీంతో.. పరాగ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ట్విటర్ యాజమాన్యంతో మస్క్‌కు పొసగలేదన్న విషయం అందరకీ అర్థమైపోయింది. దీనికి కారణం.. అప్పటి ట్విటర్‌ యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలు నచ్చకపోవడమే. ఈ విషయంలో మస్క్ తన అభ్యంతరాలను పలుమార్లు బహిరంగపరిచారు. ఆ తరువాత.. మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేస్తానంటూ భారీ ఆఫర్(Twitter deal) ప్రకటించారు. ఏకంగా 44 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇది చూసి వాణిజ్య వర్గాలు ముక్కున వేలేసుకున్నాయి. ట్విటర్‌ను అంతపెట్టి కొనుగోలు చేయడం అనవరమనేది అప్పట్లో మార్కెట్ పండితుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో మస్క్ యూటర్న్ తీసుకున్నారు. ట్విటర్ యాజమాన్యం తనను తప్పుదోవ పట్టించిందంటూ డీల్ రద్దుకు పూనుకున్నారు.

కానీ.. అగర్వాల్ మాత్రం తన లక్ష్యం నుంచి దృష్టి మరల్చలేదు. మస్క్‌తో డీల్ ముగించేందుకే మొగ్గు చూపారు. ట్విటర్ ఆయన చేతుల్లోకి వెళితే తన ఉద్యోగం పోతుందని తెలిసినా.. 44 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని వదులుకునేందుకు ఆయనకు ఇష్టపడలేదని తెలుస్తోంది. ఈ డీల్ తుదిరూపం దాల్చితే.. ట్విటర్‌లో వాటాలున్న వారికి భారీ ఆర్థిక ప్రయోజనం దక్కుతుంది. అందుకే.. పరాగ్ అగర్వాల్‌ ఎదురుతిరిగారని సమాచారం. ఈ నేపథ్యంలో ట్విటర్ మస్క్‌పై కోర్టుకెక్కింది. అప్పటికి ఈ డీల్ నుంచి మస్క్ బయటపడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారట. ఈ క్రమంలోనే ట్విటర్ బాట్స్(Bots) విషయంలో పలు బహిరంగ ప్రకటనలు, విమర్శలు గుప్పించారు. చివరికి న్యాయస్థానం జోక్యంతో ఈ వివాదానికి ముగింపు పడింది. డీల్‌ను ముగించాలంటూ కోర్టు డెడ్ లైన్ విధించడంతో చివరకు ట్విటర్.. మస్క్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ తరువాత.. పరాగ్ అగర్వాల్‌ సహా ట్విటర్‌లో కీలక స్థానాల్లో ఉన్న కొందరు సంస్థను వీడాల్సి వచ్చింది.

అయితే.. ట్విటర్‌ కీలక ఉద్యోగులు సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఇలా ఉద్యోగాల నుంచి తొలగిస్తే కంపెనీ వారికి పరిహారం చెల్లించాలి. ఫలితంగా.. అగర్వాల్‌ తన జీతంతో కలిపి మొత్తం 42 మిలియన్ డాలర్లు పొందనున్నారని తెలుస్తోంది. ఇందులో అధిక భాగం ట్విటర్‌లో వాటాల రూపంలోనే ఉంటుందట. గతేడాది ఆయన ట్విటర్ సీఈఓగా 30.2 మిలియన్ డాలర్లు ఆర్జించారట. ‘‘పరాగ్.. ఉద్యోగం పొగొట్టుకుని ఉండొచ్చుగానీ.. ఆయన వెళుతూ వెళుతూ ఎలాన్ జేబులో నిధుల్ని షేర్ హోల్డర్లకు బదిలీ చేయగలిగారు’’.. ఇది ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ట్వీట్.. ట్విటర్ డీల్ మొత్తాన్నీ ఒక్క వాక్యంలో వివరించిన వ్యాఖ్య ఇది. ‘‘పరాగ్ శ్రమ కారణంగా ట్విటర్ వాటాదారులు భారీగా లాభపడ్డారు. కాబట్టి.. వాళ్లు ఆయనకు విగ్రహం కట్టించాలి’’ అన్న కామెంట్లూ వినబడుతున్నాయి.

Updated Date - 2022-10-28T19:38:27+05:30 IST