Stock markets: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. దానికి కారణం ఇదే !
ABN , First Publish Date - 2022-12-16T16:24:14+05:30 IST
దేశీయ ఈక్విటీ సూచీలు (Indian equity benchmarks) వారాంతం శుక్రవారం గణనీయ నష్టాల్లో ముగిశాయి. ఈ వారం పలు ప్రధాన కేంద్ర బ్యాంకుల (Central banks) కఠిన వ్యాఖ్యలు, వైఖరి స్పష్టమైన నేపథ్యంలో గ్లోబల్ మాంద్యం (global recession) తప్పదనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో మరింత ఎక్కువయ్యాయి.
ముంబై: దేశీయ ఈక్విటీ సూచీలు (Indian equity benchmarks) వారాంతం శుక్రవారం గణనీయ నష్టాల్లో ముగిశాయి. ఈ వారంలో పలు ప్రధాన కేంద్ర బ్యాంకుల (Central banks) కఠిన వ్యాఖ్యలు, వైఖరి స్పష్టమైన నేపథ్యంలో గ్లోబల్ మాంద్యం (global recession) తప్పదనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో మరింత ఎక్కువయ్యాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపైనా పడడంతో సెన్సెక్స్ (sensex) 461.22 పాయింట్లు లేదా 0.75 శాతం నష్టపోయి 61,337.81 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) సూచీ 145.90 పాయింట్లు లేదా 0.79 శాతం పతనమై 18,269 పాయింట్ల క్లోజయ్యింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండవ సెషన్‌లో నష్టపోయినట్టయ్యింది.
కాగా ఆసియా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. గత రెండు నెలల వ్యవధిలో అత్యధిక నష్టాలను నమోదు చేసినట్టయ్యింది. ఈ వారం కొన్ని కేంద్ర బ్యాంకుల కఠిన వ్యాఖ్యలు మార్కెట్ల నష్టాలకు కారణమని మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖెమ్కా విశ్లేషించారు. కాగా బుధ, గురువారాల్లో యూఎస్, యూరో జోన్, యూకే, స్విట్జర్లాండ్‌లకు చెందిన కేంద్ర బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే.
సెన్సెక్స్ 30 ప్యాక్‌పై మొత్తం 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి. వాటిల్లో అత్యధికంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎం అండ్ ఎం, ఏసియన్ పెయింట్స్, ఎస్బీఐ, టీసీఎస్, టైటాన్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్ పతనమయ్యాయి. ఇక నిఫ్టీ-50 సూచీపై అదనంగా అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ క్షీణించాయి. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 1.4 శఆతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.9 చొప్పున నష్టాలను చవిచూశాయి. రంగాలవారీగా చూస్త నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ అత్యధికంగా 3 శాతం నష్టపోయింది. ఆ తర్వాత నిఫ్టీ రియల్టీ, ఫార్మా, మీడియా సూచీలు 1 శాతం వరకు క్షీణతను చవిచూశాయి.