Meta: వాట్సాప్, మెటా‌కు గుడ్‌బై చెప్పేసిన ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్స్

ABN , First Publish Date - 2022-11-15T21:25:51+05:30 IST

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ మెటా (Meta) ఇండియాకు మరో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై చెప్పేశారు

Meta: వాట్సాప్, మెటా‌కు గుడ్‌బై చెప్పేసిన ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్స్
Meta and Whatsapp

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ మెటా (Meta) ఇండియాకు మరో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై చెప్పేశారు. మెటాలో లే ఆఫ్‌లు ప్రకటించిన కొన్ని రోజులకే వీరి రాజీనామాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ (Abhijit Bose), మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ (Rajiv Aggarwal) తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలను మెటా ఆమోదించింది.

అభిజిత్ బోస్ వాట్సాప్‌లో దాదాపు నాలుగేళ్లపాటు పనిచేశారు. ఈ సమయంలో ‘ఇంపాక్ట్ ఇండియా’ వంటి పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. తాను చిన్న విరామం తీసుకుంటున్నానని, త్వరలోనే మళ్లీ వ్యవస్థాపక ప్రపంచంలోకి వస్తానని బోస్ ప్రకటించారు. భారత్‌లో వాట్సాప్ మొదటి హెడ్‌గా బోస్ చేసిన అద్భుతమైన సేవలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నట్టు వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ తెలిపారు. ఆయన వ్యవస్థాపక డ్రైవ్ మిలియన్ల మంది ప్రజలు, వ్యాపారాలకు ప్రయోజనం చేకూర్చే కొత్త సేవలను అందించడంలో తమ బృందానికి సాయ పడిందని అన్నారు.

మెటా ఇండియా ఇండియా హెడ్ అజిత్ మోహన్ రాజీనామా చేసిన కొన్ని రోజులకే వీరు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, రాజీవ్ అగర్వాల్‌కు వేరే అవకాశాలు రావడం వల్లే ఆయన రాజీనామా చేసినట్టు మెటా పేర్కొంది. సంస్థకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. సెప్టెంబరులో వాట్సాప్ పేమెంట్ హెడ్ మనేశ్ మహాత్మే కూడా సంస్థకు గుడ్‌బై చెప్పేశారు. మరోవైపు, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా శివనాథ్ తుక్రల్‌ను నియమించింది. శివనాథ్ 2017 నుంచి కంపెనీ పబ్లిక్ పాలసీ టీంలో అంతర్భాగంగా ఉన్నారు.

Updated Date - 2022-11-15T21:26:22+05:30 IST