Twitter Blue Tick: ట్విట్టర్ ఖాతాలకు మళ్లీ బ్లూ టిక్.. నెల చందా ఎంతో తెలుసా?
ABN , First Publish Date - 2022-11-17T18:28:00+05:30 IST
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) ఎలాన్ మస్క్ చేతిలోకి వెళ్లిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారు కాగా, యూజర్ల పరిస్థితి దారుణంగా
న్యూఢిల్లీ: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) ఎలాన్ మస్క్ చేతిలోకి వెళ్లిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారు కాగా, యూజర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే బ్లూటిక్ విషయంలో మరింత గందరగోళం నెలకొంది. నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా నిలిపివేసిన బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ నెల 29 నుంచి ఇది అందుబాటులోకి రానుండగా నెలకు 8 డాలర్లు చెల్లించి బ్లూటిక్ బ్యాడ్జిని పొందొచ్చు. ఒకవేళ అలా చెల్లించని పక్షంలో బ్లూ టిక్‌ను నిరభ్యంతరంగా వదులుకోవాల్సి ఉంటుంది.
నెలకు 8 డాలర్లతో ఈ నెల 6న ట్విట్టర్ బ్లూటిక్ సేవలను తిరిగి తీసుకొచ్చింది. అయితే, ఇది మరో కొత్త సమస్యకు దారితీసింది. ప్రముఖ సంస్థలు, వ్యక్తుల పేర్లతో ఎవరు పడితే వారు 8 డాలర్లు చెల్లించి బ్లూటిక్‌ను పొందడంతో ఏది అసలు ఖాతాలో, ఏది నకిలీ ఖాతానో తెలియక గందరగోళం ఏర్పడింది. దీంతో ట్విట్టర్ ఈ సేవలకు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పెట్టింది. నకిలీల బెడదను తట్టుకునేలా మార్పు చేర్పులు చేసి ఈ నెల 29న బ్లూటిక్ సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఎలాన్ మాస్క్ ప్రకటించారు.
గతంలో ఈ బ్లూటిక్ పూర్తి ఉచితంగా ఉండేది. సెలబ్రిటీలు, ప్రభుత్వ హెడ్‌లు, మీడియా ఆర్గనైజేషన్స్‌కు బ్లూటిక్ ఇచ్చేవారు. ఆయా ఖాతాలను వెరిఫై చేసిన అనంతరం బ్లూటిక్ బ్యాడ్జ్‌ని ట్విట్టర్ కేటాయించేది. అయితే, ట్విట్టర్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన వెంటనే ఈ బ్లూటిక్ కోసం డబ్బులు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. చాలామంది ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ మస్క్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.