Twitter layoffs: ట్విటర్‌లో చివరి క్షణాలు.. కంప్యూటర్ ఓపెన్ చేయగానే..
ABN , First Publish Date - 2022-11-06T20:40:05+05:30 IST
ట్విటర్‌లో తమ చివరి క్షణాలను గుర్తు చేసుకుంటున్న ఉద్యోగులు
ఇంటర్నెట్ డెస్క్: కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో మొత్తం ట్విటర్ ఉద్యోగుల్లో సగం మంది ఉద్వాసనకు(Twitter layoffs) గురయ్యారు. అలాంటి పరిస్థితుల్ని తామెన్నడూ చూడలేదని మాజీ ఉద్యోగి ఒకరు తాజాగా వ్యాఖ్యానించారు. ‘‘కొందరు ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నట్టుండి ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు ముందుగానే రాజీనామాలు చేసేశారు. కానీ.. గురువారం 5గంటల వరకూ తొలగింపుల నిర్ధారణకు సంబంధించి కంపెనీ నుంచి అధికారిక సమాచారం ఏదీ అందలేదు. కంపెనీ మస్క్ చేతుల్లోకి వెళ్లి అప్పటికే వారం అయిపోయింది’’ అని ఆ మాజీ ఉద్యోగి అప్పటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. ట్విటర్(Twitter) ఉద్యోగులకు గురువారం సాయంత్రం 5 గంటలకు తొలగింపుల పర్వానికి సంబంధించి తొలి ఈమెయిల్ అందింది. మరుసటి రోజు వారి భవితవ్యం ఏంటో తెలిపోతుందంటూ ఆ మెయిల్‌లో సంస్థ స్పష్టం చేసింది. ఇక శుక్రవారం నాటికి దాదాపు 50 శాతం మంది ఉద్వాసనకు గురయ్యారు.
ట్విటర్‌లోని మార్కెటింగ్ శాఖలో అత్యధికంగా ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయారు. ఇక డిజైన్ విభాగంలోని ఉద్యోగుల్లో సుమారు 66 శాతం మంది సంస్థను వీడాల్సి వచ్చింది. మేనేజర్లలో 75 శాతం మంది ఉద్వాసనకు గురయ్యారు. కంటెంట్ మాడరేషన్ విభాగంపై తొలగింపుల ప్రభావం తక్కువగానే ఉందని సమాచారం. ఆ డిపార్ట్‌మెంట్‌లో కేవలం 15 శాతం మందినే తొలగించినట్టు తెలుస్తోంది. అయితే.. తొలగింపులు తప్పవని ముందుగానే ఊహించిన ఉద్యోగులు అందుకు తగినట్టు మానసికంగా సిద్ధపడ్డారట.
ఇదీ చదవండి: యువకుడి ఉదంతం వైరల్..! ట్విటర్‌లో ఉద్యోగం పోయాక..
‘‘ కొందరికి ఉద్యోగం పోయినట్టు ఫోన్ కాల్ లేదా ఈమెయిల్ రాలేదు. వాళ్లు తమ కంప్యూటర్లు తెరవగానే.. సిస్టం రీబూట్ అయ్యేది. ఆ తరువాత స్క్రీన్ మొత్తం బ్లాంక్(Blank screen) అయిపోయేది.’’ అని ఎమాన్యుయెల్ కార్నెట్ అనే ఇంజినీర్ తెలిపారు. దాదాపు ఏడాదిన్నర పాటు ట్విటర్‌లో చేసిన ఆయన.. ఇటీవలే జాబ్ కాల్పోయారు. ఆయనను తీసేస్తున్నట్టు మంగళవారమే ట్విటర్ లేఖ పంపించింది. కంపెనీ విధానాలను ఉల్లంఘించినందుకు తొలగిస్తున్నట్టు పేర్కొంది. అయితే.. పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ రీతిలో ఉద్యోగాలు పోతుండటంతో చాలా మంది షాక్‌కు గురయ్యారట. అయితే.. అకస్మాత్తుగా ఉద్యోగం పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు చివరకు కోర్టులో ఉమ్మడిగా కేసు(Class action law suit) వేశారు. తొలగింపునకు 60 రోజుల ముందే ఉద్యోగులకు ఇవ్వాల్సిన తప్పనిసరి నోటీసులను సంస్థ ఇవ్వలేదంటూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా.. తొలగింపులు ప్రారంభమయ్యాక దాదాపు 24 గంటల తరువాత మస్క్(Elon musk) ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘దురదృష్టవశాత్తూ ఇది తప్ప మరో మార్గం లేదు. కంపెనీ రోజుకు 4 మిలియన్ డాలర్ల చొప్పున నష్టపోతోంది.’’ అని ఆయన ట్వీట్ చేశారు.