Teachers Transfers: టీచర్లతో బదిలీలాట
ABN , First Publish Date - 2022-12-12T10:56:16+05:30 IST
బదిలీలకు షెడ్యూలు విడుదల చేసిన ప్రభుత్వం(Ap Government) మరోవైపు ‘సర్దుబాటు’ ప్రక్రియను కూడా సమాంతరంగా నడిపించాలని చూస్తోంది. దీంతో ఉపాధ్యాయుల(Teachers)కు కొత్త చిక్కులు వచ్చినట్టయింది. సర్దుబాటులో ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు వెళ్లిన వారికి ఇప్పుడు బదిలీ ప్రక్రియ ఇబ్బందిగా మారింది.
ఓ వైపు బదిలీలకు షెడ్యూల్..
మరోవైపు సర్దుబాటుకు ఒత్తిడి
బదిలీకి ముందే కొత్త స్కూళ్లకు టీచర్లు
వెళ్లినా కొత్తగా పాయింట్లు ఉండవు
అన్ని జిల్లాల్లో డీఈవోల ఉత్తర్వులు
ఇదేం తలనొప్పి అంటున్న టీచర్లు
బదిలీలకు షెడ్యూలు విడుదల చేసిన ప్రభుత్వం(Ap Government) మరోవైపు ‘సర్దుబాటు’ ప్రక్రియను కూడా సమాంతరంగా నడిపించాలని చూస్తోంది. దీంతో ఉపాధ్యాయుల(Teachers)కు కొత్త చిక్కులు వచ్చినట్టయింది. సర్దుబాటులో ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు వెళ్లిన వారికి ఇప్పుడు బదిలీ ప్రక్రియ ఇబ్బందిగా మారింది. అక్కడి నుంచి వేరే చోటకి వెళ్లాలా? అక్కడే ఉండాలా? అనేది సందేహం. అయితే, ఉపాధ్యాయుల గోడును అధికారులు పక్కన పెట్టారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూలు కంటే ముందు రేషనలైజేషన్ ప్రకారం టీచర్లను సర్దుబాటు చేయాలని ఈ నెల 2న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వెంటనే బదిలీలకు షెడ్యూలు రావడంతో బదిలీ అయి వేరే పాఠశాలకు వెళ్లిపోవచ్చనే భావనలో ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పుడు బదిలీలతో పాటు సర్దుబాటు ప్రక్రియనూ కొనసాగించాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. ఈ మేరకు డీఈవోలు ఉత్తర్వులు జారీచేశారు. కర్నూలు జిల్లాలో దాదాపు 350 మంది ఉపాధ్యాయులు సర్దుబాటులో భాగంగా ఇతర పాఠశాలలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే, ఓవైపు బదిలీలు జరుగుతుండగా ఈ సర్దుబాటు ఎందుకని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ పాఠశాల విద్యా శాఖ అధికారులు మాత్రం ఉపాధ్యాయుల వాదనను వినిపించుకోవడం లేదు. దేనికదే కొనసాగాలని తేల్చి చెబుతున్నారు. పైగా ‘‘టీచర్లు న్యాయస్థానాలకు వెళ్తారేమో. బదిలీలు సక్రమంగా జరగనిస్తారా? అందుకే బదిలీలు జరిగినా, జరగకపోయినా సర్దుబాటు జరగాలి’’ అని ఆ శాఖకు చెందిన ఓ అఽధికారి వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే పేరుకి షెడ్యూలు ఇచ్చినా చివరకు బదిలీలు జరగవేమోనని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బదిలీలు, సర్దుబాటు రెండింటినీ సమాంతరంగా చేపట్టడం జిల్లాల్లో అధికారులు, టీచర్లకు పరీక్షగా మారింది. రాత్రిళ్లు కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. జీవో 117 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 7,938 మంది టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉంది.
నూతన విద్యా విధానంలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు స్కూల్ అసిస్టెంట్లను కేటాయించడంతో అక్కడ వారిని సర్దుబాటు చేయాలి. అలాగే ఉన్నత పాఠశాలల్లో కొత్త ప్యాట్రన్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్లను కేటాయించాలి. పదో తరగతి ఉన్న ప్రతి ఉన్నత పాఠశాలలో ప్రతి సబ్జెక్టుకు ఒక స్కూల్ అసిస్టెంట్ ఉండాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. బదిలీలు ఇప్పట్లో ఉండవనే ఉద్దేశంతో సర్దుబాటు చేస్తున్నారని అందరూ భావించారు. కానీ, సరిగ్గా వారం రోజులకే బదిలీల షెడ్యూలు రావడంతో సర్దుబాటు ప్రక్రియను నిలిపివేస్తారని అనుకున్నారు. అయితే, రెండు ప్రక్రియలు జరగాలనే ఉత్తర్వులు రావడంతో అధికారులు, టీచర్లు కూడా తలలు పట్టుకుంటున్నారు.
పాయింట్ల మాటేంటి?
తరగతుల విలీనం వల్ల ప్రాథమిక పాఠశాలల నుంచి ఇతర పాఠశాలలకు వచ్చిన టీచర్లకు బదిలీల్లో అదనంగా 5 పాయింట్లు ఇచ్చారు. అయితే, ఇప్పుడు సర్దుబాటు వల్ల కొత్త పాఠశాలకు వెళ్లే వారికి అదనపు పాయింట్లు రావు. మరోవైపు కొత్త పాఠశాలలకు వెళ్లినా బదిలీల వరకు ఏదో ఒక పనిపై పాత పాఠశాలకు తరచూ రావాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా పెద్ద తలనొప్పిగా మారుతుందని, బదిలీలు ఉన్నందున సర్దుబాటు ఆపేయాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఒక్కసారే దరఖాస్తు: తాజా ఉత్తర్వులు
బదిలీల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ఒక్కసారే దరఖాస్తు చేసుకోవాలని, ఒకటికి మించి కుదరదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. బదిలీల జీవోపై ఆ శాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఆదివారం వివరణతో కూడిన మార్గదర్శకాలు జారీ చేశారు. ఒక పాఠశాలలో 2017 నవంబరుకు ముందు నుంచి ఉన్న ప్రధానోపాధ్యాయులు, 2014 నవంబరుకు ముందు నుంచి ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కావాలని పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమం లేదా స్పెషల్ పాయింట్లు రెండింటికీ అర్హులైన వారు ఏదైనా ఒక్కదాన్నే ఎంచుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా బదిలీలు జరుగుతాయని, ఖాళీలను మండలాలకు దామాషా పద్ధతిలో బ్లాక్ లిస్టు జాబితాలో చూపుతారని తెలిపారు. ఖాళీలు ఒక్కసారి ప్రదర్శించిన తర్వాత ఇక వాటిలో మార్పులకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.