Face attendance: ‘దీవెన’కు హాజరు ఎసరు!
ABN , First Publish Date - 2022-12-27T15:37:57+05:30 IST
ఉన్నత విద్యలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు(Face recognition system) (ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం) విధానం విద్యార్థులకు కీలకమైన ‘విద్యా దీవెన’(Vidya divena) నిధులకు ఎసరు పెడుతోంది. ముఖ హాజరు 75% ఉంటేనే ఈ
విద్యా దీవెన నిధులు మిగుల్చుకునేలా ప్రభుత్వం ముఖ హాజరు వ్యూహం
ఉన్నత విద్యాసంస్థల్లో అమలు అంతంతే..
పీజీలో 51%, బీఈడీలో 42% అమలు
దీనిపై ప్రైవేటు కాలేజీల వెనుకడుగు..
పట్టించుకోని ఉన్నత విద్యాశాఖ అధికారులు
లబ్ధిదారుల కోతపైనే జగన్ సర్కారు దృష్టి
ఉన్నత విద్యలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు(Face recognition system) (ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం) విధానం విద్యార్థులకు కీలకమైన ‘విద్యా దీవెన’(Vidya divena) నిధులకు ఎసరు పెడుతోంది. ముఖ హాజరు 75% ఉంటేనే ఈ పథకం కింద అర్హులవుతారని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, దీనిపై ఉన్నత విద్యాశాఖ(Department of Higher Education) అవగాహన కల్పించకపోవడంతోపాటు.. అమలు చేయని విద్యాసంస్థలపై చర్యలు కూడా తీసుకోవడం లేదు. హాజరు 75% లేకపోతే.. భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ పథకానికి అనర్హులవడంతో నిధులు మిగిలిపోతాయన్న ధ్యాస తప్ప అధికారులకు మరొకటి కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ నెల 1 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అంటే 20 రోజులు గడిచిపోయాయి. అయినా, హాజరు శాతం మాత్రం సరాసరి 50% మించలేదు. ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థలు దీనిని అసలు పట్టించుకోవడం లేదు. ఈ నెల 1 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినా ఇప్పటికీ అనేక విద్యా సంస్థలు నూతన విధానంలో హాజరు నమోదు చేయడం లేదు. ప్రైవేటు యాజమాన్యాలకు ఈ విధానం శాశ్వతంగా ఉంటుందా? అనే సందేహం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ముఖ హాజరును అమలుచేస్తే భవిష్యత్తులో దీనికి ఇంకేం మెలికలు పెడతారోననే ఆందోళనతో ఈ విధానం వైపు మొగ్గు చూపడం లేదని సమాచారం. మొత్తంగా చూస్తే సరాసరి 50 శాతం మాత్రమే ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్టు సమాచారం. విద్యార్థులతో పాటు, బోధన, బోధనేతర సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో దీనిని వినియోగించడం లేదు. అయితే, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ‘విద్యా దీవెన’ పథకం అమలుకు ముఖ హాజరునే ప్రామాణికంగా తీసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ అధికారులు ఉన్నత విద్యాశాఖకు సమాచారం ఇచ్చారు. అంటే, ముఖ హాజరు విధానంలో 75శాతం అటెండెన్స్ ఉన్నవారికే విద్యా దీవెన అందనుంది. విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైనందున నవంబరు వరకు మాన్యువల్, డిసెంబరు నుంచి ముఖ హాజరును ప్రామాణికంగా తీసుకోనున్నారు.
100 శాతం అమలు లేనట్టే!
ఉన్నత విద్యలో ముఖ హాజరు అమలును మూడు రకాలుగా వర్గీకరించారు. ఐటీఐ(ITI), పాలిటెక్నిక్లు(Polytechnics) ఒక విభాగంగా, డిగ్రీ కాలేజీలు రెండో విభాగంగా, మిగిలిన కాలేజీలను మూడో విభాగంగా వర్గీకరించి, వేర్వేరు యాప్లు రూపొందించారు. వాటిలో ఇప్పటి వరకు ఇంజనీరింగ్ విభాగంలో 310 కాలేజీలకు గాను 281 కాలేజీలు మాత్రమే ముఖ హాజరును ప్రారంభించాయి. అయితే, వీటిలోనూ వంద శాతం అమలు ఎక్కడా లేదు. రాష్ట్రంలో మొత్తం 3,35,950 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటే వారిలో 2,52,170(75శాతం) మాత్రమే ముఖ హాజరు నమోదు చేస్తున్నారు. ఇక, 33,483 మంది అధ్యాపకులు, ఉద్యోగుల్లో కేవలం 19,643 మంది మాత్రమే నమోదుచేసుకున్నారు. న్యాయ కళాశాలల్లో 2,828 మంది విద్యార్థులకుగాను 1,333 మంది, సిబ్బందిలో 645 మందికిగాను 308 మాత్రమే నమోదు చేసుకున్నారు. బీఈడీ కాలేజీల్లో 7,946 మంది విద్యార్థులకుగాను 3,359 మంది, సిబ్బంది 4,443 మందిలో 1,269 మంది నమోదుచేసుకున్నారు. ఫార్మసీ కాలేజీల్లో 23,457 మంది విద్యార్థులకు 19,793 మంది, సిబ్బంది 4,253 మందిలో 2,160 మంది మాత్రమే ముఖ హాజరుకు నమోదయ్యారు. పీజీ కోర్సుల్లో 10,906 మందికి 5,606 మంది, సిబ్బందిలో 2,014 మందికి 1,231 మంది నమోదుచేసుకున్నారు. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 3,76,372 మంది విద్యార్థులకు 2,34,823 మంది, సిబ్బందిలో 21,476 మందిలో 14,565 మంది నమోదుచేసుకున్నారు.
పీజీ, బీఈడీపై అనుమానాలు
ప్రధానంగా పీజీ, బీఈడీ కోర్సుల విద్యార్థుల హాజరుపై పలు అనుమానాలున్నాయి. అసలు కాలేజీ ముఖం కూడా చూడని విద్యార్థులకు కూడా హాజరు వేస్తూ, పరీక్షలు రాయించి సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున ఉన్నాయి. ఇలా బీఈడీ కాలేజీల్లో ఇతర రాష్ర్టాల విద్యార్థులు భారీగా అడ్మిషన్లు పొంది కోర్సు పూర్తిచేశారనే వాదన ఉంది. తెలుగు రాకుండానే తెలుగు పరీక్షలోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతున్నారని అధికారులు గుర్తించారు. అలాగే పీజీ కోర్సుల్లోనూ విద్యార్థులు కాలేజీలకు రాకుండా పూర్తిచేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ముఖ హాజరును తీసుకొచ్చింది. కానీ, ఇప్పుడు కూడా ఈ విధానం అమలు కాకపోవడం గమనార్హం.
దీవెనలో కోత!
ముఖ హాజరు విధానం పూర్తిస్థాయిలో అమలుచేస్తే విద్యా దీవెన భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మాన్యువల్ హాజరు విధానంలో విద్యార్థులు వచ్చినా రాకున్నా అందరికీ హాజరు వేస్తున్నారని, దీనివల్ల దాదాపు అందరికీ ‘విద్యాదీవెన’ అందుతోందని అధికారులు భావిస్తున్నారు. ముఖ హాజరు విధానంలో అయితే విద్యార్థి కళాశాలకు వస్తేనే హాజరు పడుతుందని, 75% హాజరు నమోదుకాకపోతే విద్యా దీవెనలో కోత పెట్టొచ్చనే భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా హాజరు నెపంతో పథకం లబ్ధిదారులను తగ్గించే వ్యూహం స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.