Supreme Court: కొలీజియ వర్సెస్ ఎన్‌జేఏసీ..
ABN , First Publish Date - 2022-12-16T14:01:36+05:30 IST
ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. 217 అధికరణ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను నియమించే సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమార్తి, ఆ రాష్ట్ర గవర్నర్, ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం
కొలీజియ వర్సెస్ ఎన్‌జేఏసీ
గ్రూప్-1 మెయిన్స్ - జనరల్ ఎస్సే
స్వాతంత్ర్యానికి పూర్వం భారత దేశం(India)లో ఫెడరల్ కోర్టు (Federal Court) ఉండేది. అయితే స్వాతంత్రానంతరం 1950 జనవరి 26 నుంచి సుప్రీంకోర్టు (Supreme Court) ఏర్పడింది. రాజ్యాంగంలోని 124 నుంచి 147 వరకు గల అధికరణలు సుప్రీంకోర్టు ఏర్పాటు, నిర్మాణం, అధికార పరిధి, 214 నుంచి 231 వరకు గల అధికరణలు హైకోర్టుల నిర్మాణం గురించి చెబుతున్నాయి. 124 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే సమయంలో రాష్ట్రపతి(President) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. 217 అధికరణ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను నియమించే సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమార్తి, ఆ రాష్ట్ర గవర్నర్, ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి తీసుకుంటారు. 222 అధికరణ ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఇతర న్యాయమూర్తుల బదిలీల (JudgesTransfers ) విషయంలో కూడా రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తారు. అంటే ఉన్నత న్యాయస్థానాల్లోని న్యాయమూర్తుల నియామకం, బదిలీల ప్రక్రియలో న్యాయవ్యవస్థతోపాటు కార్యనిర్వాహక శాఖకు కూడా తగిన ప్రాధాన్యం ఉండేది.
కాలక్రమేణా న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరుగుతూ వచ్చింది. 1976లో ఈ జోక్యం విపరీత పోకడలకు దారి తీసింది. దానిని నివారించడానికి 1981లో ఎస్.పి.గుప్తా సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక శాఖ అధికారాన్ని ప్రశ్నించారు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జడ్జీల నియామకంలో రాష్ట్రపతి మిగిలిన వారిని సంప్రదించడం అనేది కేవలం సంప్రదాయం అని, కార్యనిర్వాహక శాఖకే పూర్తి అధికారం ఉంటుందని పేర్కొంది. కొన్ని బలమైన కారణాలతో రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సలహాను కూడా తిరస్కరించవచ్చని చెప్పింది. దీంతో న్యాయశాఖాధికారంపై కార్యనిర్వాహకశాఖ ఆధిపత్యం కొనసాగింది. ఈ కేసునే ప్రముఖంగా మొదటి జడ్జస్ కేసుగా పరిగణించారు.
ఆ తరవాత 1993లో(రెండో జడ్జస్ కేసు) సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ ఆసోసియేషన్, యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ జె.ఎస్.వర్మ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులు ఉన్న ధర్మాసనం మొదటిసారిగా కొలీజియం వ్యవస్థ గురించి పేర్కొంది. ఈ తీర్పులో రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తిని ‘సంప్రదించడం’ అంటే న్యాయమూర్తి ‘ఒప్పుకోవడం’అని నూతన భాష్యం చెప్పింది. ఈ తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. అయితే సలహా ఇచ్చే విషయంలో కేవలం ప్రధాన న్యాయమూర్తే కాకుండా, అతనితో కలిపి మరో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం వ్యవస్థ రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని తెలిపింది.
అయితే కొన్ని సందర్భాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను సంప్రదించకుండానే తన సలహాను రాష్ట్రపతికి తెలియజేస్తారు. దీనిపై అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణ్ 143 అధికరణను అనుసరించి న్యాయమూర్తుల నియామకం, బదిలీల అంశంలో భారత ప్రధాన న్యాయమూర్తికి ఉన్న సంప్రదింపు అనే అంశం గురించి అర్థవివరణ ఇవ్వాలని(మూడో జడ్జిస్ కేసు) సుప్రీంకోర్టును కోరారు. అంటే సంప్రదింపునకు భారత ప్రధాన న్యాయమూర్తి సలహాను మాత్రమే గ్రహించాలా? లేదా ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఇతర న్యాయమూర్తుల సూచనలను కూడా పరిగణించాలా? అనే అంశంపై వివరణ అడిగారు. దానికి సుప్రీంకోర్టు విస్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించి, రాష్ట్రపతికి తెలియజేసింది. రాజ్యాంగంలోని 124(2), 127(1), 222(1) అధికరణల్లో ‘సంప్రదింపు’ అంటే బహుళ న్యాయమూర్తుల సూచనలతో కూడిన భారత ప్రధాన న్యాయమూర్తి సలహా అని అర్థం.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి, నలుగురు ఇతర సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల సలహాను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో ఇద్దరు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సలహాను తప్పనిసరిగా పాటించాలి. దీనినే కొలీజియం వ్యవస్థగా పరిగణించారు. భారత ప్రధాన న్యాయమూర్తి, నలుగురు ఇతర సీనియర్ న్యాయమూర్తుల సూచనలను కూడా తీసుకోవాలి. తన సూచనలు జోడించి తుది నిర్ణయాలను భారత ప్రభుత్వానికి రాతపూర్వకంగా అందించాలి. న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి స్వతంత్రంగా వ్యక్తిగత సామర్థ్యాలను అనుగుణంగా వ్యవహరించడానికి వీలు లేదు. అతను తప్పనిసరిగా కొలీజియం వ్యవస్థలోని ఇతర నలుగురు న్యాయమూర్తుల సలహాను కూడా పాటించాలి. సంప్రదింపుల ప్రక్రియలోని నిబంధనలను పాటించకుండా భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన సిఫార్సులకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో కొలీజియం వ్యవస్థ - లోపభూయిష్టమైన, పారదర్శకత, జవాబుదారీతనం లేని ప్రక్రియగా రూపాంతరం చెందడంపై చర్చలు మొదలయ్యాయి. స్వయంగా కొందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కొలీజియం వ్యవస్థలో ఉన్న లోపాలపై తమ వైఖరిని వ్యక్తపరిచారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మెరుగైన వ్యవస్థ కోసం ఆన్వేషించాయి. పలు కమిటీలు, కమిషన్లు సిఫార్సులు చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వం 99వ రాజ్యాంగ సవరణ ద్వారా 2014 ఆగస్టులో పార్లమెంట్ ఉభయసభల్లో కొలీజియం స్థానంలో ప్రవేశపెట్టిన ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్’ ఆమోదం పొందింది. 368 అధికరణ ప్రకారం 20 రాష్ర్టాల శాననసభల ఆమోదం కూడా పొంది, 2014 డిసెంబర్ 31న రాష్ట్రపతి ఆమోదంతో నూతన వ్యవస్థను ఏర్పాటు చేసింది. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా 124(ఎ) అధికరణను చేర్చారు.
99వ రాజ్యాంగ సవరణలోని ముఖ్యాంశాలు
124(ఎ) జాతీయ న్యాయ నియామక కమిషన్ రాజ్యాంగ ప్రతిపత్తిని కలిగి ఉంది. 2015 ఏప్రిల్ 13 నుంచి ఎన్‌జెఎసి అమల్లోకి వచ్చింది. దీని సిఫార్సులకు అనుగుణంగా న్యాయమూర్తుల నియామకం జరగాలి. ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ కాగా సభ్యులుగా ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉంటారు. ఇద్దరు ప్రముఖ వ్యక్తులను ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడితో కూడిన కమిటీ మూడేళ్ల కాలానికి నియమిన్తుంది. వీరు మరోసారి నామినేట్ కారాదు. ఈ ఇద్దరు ప్రముఖుల్లో ఒకరు తప్పకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసి, మైనారిటీ లేదా మహిళా వర్గానికి చెందినవారై ఉండాలి.
ఎన్‌జెఎసి విధులు
ఎన్‌జెఎసికి ప్రత్యేకంగా కొన్ని విధులు కేటాయించారు. వాటి గురించి 124(బి) అధికరణలో పేర్కొన్నారు. అవి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు నియామకానికి సంబంధించి సిఫార్సు చేయడం.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ విషయంలో సిఫార్సులు చేయాలి.
ఫ నిజాయితీ, సమర్థత ఉన్న వ్యక్తులను సిఫార్సు చేయాలి.
124(సి) - భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో పార్లమెంట్ చట్టం ద్వారా నియంత్రించే అధికారం కలిగి ఉంటుంది.
ఐదుగురు సభ్యులు ఉన్న ఎన్‌జెఎసిలోని ఏ ఇద్దరు సభ్యులు వీటో చేసినా, ఆ నియామకంపై రాష్ట్రపతికి సిఫార్సు చేయరాదు.
కమిషన్ సిఫార్సు చేసే న్యాయమూర్తుల జాబితాపై పునఃపరిశీలన చేయాలని ఆదేశించే అధికారం రాష్ట్రపతికి ఉంది. అలాంటి సందర్భంలో తిరిగి ఏకగ్రీవంగా కమిషన్ మళ్లీ అదే జాబితాను రెండోసారి పంపితే రాష్ట్రపతి తప్పకుండా ఆమోదించాల్సిందే.
బిల్లు చట్టసభల ఆమోదం పొంది, నోటిఫికేషన్ జారీ అయ్యే 30 రోజుల వ్యవధిలోగా న్యాయమూర్తులకు సంబంధించిన ఖాళీలను కమిషన్ నోటిఫై చేస్తుంది.
హైకోర్టుల న్యాయమూర్తుల నియామక విషయంలో ఎప్పటికప్పుడు కమిషన్ ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను కూడా సేకరిస్తుంది.
ఒకసారి వీటో చేసిన అభ్యర్థుల పేర్లను మళ్లీ సిఫార్సు చేయడం కుదరదు.
ప్రముఖ వ్యక్తుల నియామకానికి సంబంధించి, ప్రత్యేకమైన అర్హతలేమి నిర్థేశించలేదు
ఎన్‌జెఎసిపై సుప్రీంకోర్టు తీర్పు- ముఖ్యాంశాలు
1030 పేజీలతో కూడిన సుదీర్ఘమైన తీర్పులో జస్టిస్ ఖేహార్‌తో కూడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం అనేక అంశాలను పేర్కొంది. ‘సుప్రీం కోర్టుకు న్యాయమూర్తులను, హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను, న్యాయమూర్తులను నియమించే వ్యవస్థ, విధానం, 99వ రాజ్యాంగ సవరణ చట్టానికి ముందు ఉన్నట్లుగా(కొలీజియం వ్యవస్థ) పనిచేస్తుందని ప్రకటిస్తున్నాం’ అంటూ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్, భారత ప్రభుత్వం కేసులో జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జెఎసి) ఏర్పాటు రాజ్యాంగబద్ధం కాదంటూ జస్టిస్ ఖేహార్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 నిష్పత్తిలో సంచలనాత్మక తీర్పు వెలువరించింది. న్యాయమూర్తుల నియామకంలో ప్రస్తుతం కొనసాగుతున్న కొలీజియం వ్యవస్థ సరైనదేనని సుప్రీం కోర్టు మెజారిటీ తీర్పు చెప్పింది. ఈ సందర్భంలో ఆ తీర్పునకు అనుకూలంగా, వ్యతిరేకంగా వాదనలు అప్పట్లో చాలానే వినిపించాయి. దీంతో దేశ వ్యాప్తంగా న్యాయకోవిదులు, రాజకీయ అగ్రనాయకులు, కేంద్ర మంత్రులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ - స్వతంత్ర న్యాయ వ్యవస్థల మధ్య రాజ్యాంగపరమైన అంశాలపై లోతైన చర్చలకు తెరతీశారు.
సుప్రీం తీర్పుపై వాద- ప్రతిపాదనలు
న్యాయమూర్తుల నియామకంపైనే న్యాయ వ్యవస్థ నిస్పాక్షికత, ప్రమాణాలు ఆధారపడి ఉంటాయి. ఇందులో రాజకీయ ప్రమేయానికి అనుమతిస్తే న్యాయవ్యవన్థ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని న్యాయమూర్తులతో పాటు ప్రజాస్వామికవాదులు ఆభిప్రాయపడుతున్నారు. అయితే కొలీజియంను వ్యతిరేకించేవారు మాత్రం పార్లమెంట్‌కు, ప్రజలకు భాగస్వామ్యం లేకుండా ‘న్యాయమూర్తులను న్యాయమూర్తులే’ నియమించుకోవడం మంచిది కాదని అంటున్నారు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇలాంటి విధానం లేనప్పటికీ, ఆయా దేశాలు మనుగడ సాగించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
న్యాయ వ్యవస్థ నియామకాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం ఉన్నట్లయితే అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, అవినీతి, పక్షపాతం వంటి విపరీత పోకడలు పొడచూపి న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఈ తీర్పును సమర్ధించేవారి వాదన. కొలీజియంను ప్రవేశపెట్టక ముందు వరకూ న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యం ఉండేదని, నాడు నియమితులైన న్యాయమూర్తులు ఏ విషయంలోనైనా తక్కువగా ఉన్నారా అని ప్రశ్నించడమే కాదు, దేశ చరిత్రలోనే అత్యుత్తమ జడ్జీలుగా పేరొందిన వెంకటాచల్లయ్య, కృష్ణయ్యర్ వంటివారు అప్పట్లో నియమితులైన వారే కదా అని ఈ తీర్పుని వ్యతిరేకించేవారు వాదిస్తున్నారు.
ఇప్పటివరకు ఉన్న కొలీజియం వ్యవస్థ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా పనిచేసేలా కృషిచేస్తోంది. ఈ విధానం ద్వారా ఎంపికైన న్యాయమూర్తులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఉన్న వ్యవస్థను ఇంకా పటిష్టపరచడానికి కొన్ని చర్యలు తీసుకొంటే సరిపోతుందని తీర్పుని సమర్థించేవారు అభిప్రాయపడుతున్నారు. అసలు కొలీజియం వ్యవస్థ గురించి రాజ్యాంగంలో పేర్కొనలేదు. అది కొత్తగా చేరిందే. కొంతకాలం క్రితం సృష్టించిన వ్యవస్థ, దీని ద్వారా నియమితులైన న్యాయమూర్తులు దేశ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పడంలో హేతుబద్దత లేదని ఎన్‌జెఎసి సమర్థకుల అభిప్రాయం.
న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు ద్వారా రాష్ట్రపతిని డమ్మీగా మార్చివేశారని కొలిజియం ఉండాలనే తీర్పును సమర్థించేవారు అంటుంటే, అసలు రాజ్యాంగంలోని ఆంశాల పరంగా రాష్ట్రపతి నామమాత్ర అధికారే కదా! అలాంటప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నమవడంలో ఔచిత్యమేమిటని ఎన్ జెఎసిని సమర్థించే వారు వాదిస్తున్నారు.
ఎన్‌జెఎసిలో సభ్యుడిగా కేంద్ర న్యాయశాఖ మంత్రి భాగస్వామ్యం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగాలైన అధికార విభజన, న్యాయవ్యవస్థ స్వతంత్రత భావాలను ఉల్లంఘిస్తుందని ఈ తీర్పును సమర్థించేవారు వాదిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాతినిథ్యం వహించేది కార్యనిర్వాహక వ్యవస్థలోని కేంద్ర మంత్రివర్గం. అలాంటి వారిని జడ్జీల ఎంపిక ప్రక్రియలో పూర్తిగా పక్కనపెట్టేయడం తగదు. కేవలం న్యాయమూర్తులు మాత్రమే న్యాయనియామకాలకు ‘న్యాయం’ చేయగలరని చెప్పడం పౌర సమాజాన్ని, దేశ ప్రజలను అవమానించడమే అవుతుందని ఈ తీర్పును వ్యతిరేకించేవారి వాదన.
వీటో అధికారం దుర్వినియోగమై, నియామక ప్రక్రియ జాప్యం అయ్యే అవకాశం ఉండి, ఎన్‌జెఎసిలోని ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ప్రాధాన్యం పెరిగిపోయే అవకాశం ఉందని సుప్రీం తీర్పును సమర్థించేవారు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థలోనే హైకోర్టు కొలీజియం సిఫార్సును సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించడం, సుప్రీంకోర్టు కొలీజియంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమై, ఆ నియామకాలు వివాదాస్పదమవడం జరుగుతూనే ఉన్నా యి కదా! అని తీర్పును వ్యతిరేకించేవారు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ఒక న్యాయమూర్తిని నియమించాలని ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్, చేసే సిఫార్సును ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తమ వీటో అధికారం ద్వారా ఎలాంటి కారణాలు పేర్కొనకుండానే అడ్డుకోవచ్చు. వారు ఏ కారణం లేకుండానే న్యాయమూర్తుల నియామకాన్ని ఆపివేయవచ్చు. తరచూ ఇలా జరగకపోవచ్చు కానీ అలాంటి పరిస్థితి వస్తే గందరగోళం ఏర్పడుతుంది. ఈ నిబంధన ఫలితంగా ఒక న్యాయమూర్తి నియామక బాధ్యత పాక్షికంగా రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి నుంచి ఎన్‌జెఎసి సభ్యులకు బదిలీ అవుతుంది.
న్యాయమూర్తుల నియామకంలో ప్రస్తుతం కొనసాగుతున్న కొలీజియం వ్యవస్థ సరైనదేనని సుప్రీం కోర్టు మెజారిటీ తీర్పు చెప్పింది. ఈ సందర్భంలో ఆ తీర్పునకు అనుకూలంగా, వ్యతిరేకంగా వాదనలు అప్పట్లో చాలానే వినిపించాయి. దీంతో దేశ వ్యాప్తంగా న్యాయకోవిదులు, రాజకీయ అగ్రనాయకులు, కేంద్ర మంత్రులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ - స్వతంత్ర న్యాయ వ్యవస్థల మధ్య రాజ్యాంగపరమైన అంశాలపై లోతైన చర్చలకు తెరతీశారు.
ప్రత్యామ్నాయం
అత్యున్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి ఐఎఎస్, ఐపిఎస్‌లకు మాదిరిగానే ఒక నూతన అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేసి, సివిల్ సర్వీస్ పరీక్ష మాదిరిగా యుపిఎస్‌సి ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించాలని చాలా కాలంగా పలువురు సూచిస్తున్నారు. అయితే న్యాయవ్యవస్థ తీర్పులు వెలువరించేటప్పుడు తగిన అనుభవం, సామర్థ్యం, వయసు పరంగా ఎంతవరకు దక్షత కలిగి ఉంటారనేది ప్రశ్నార్థకమవుతుంది.
ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థను పటిష్ఠపరచాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవస్థలో ప్రత్యేక సచివాలయం, వ్యక్తిగత నేపథ్యాలను పరిశీలించే నిఘా వ్యవస్థ, తగిన సిబ్బంది, పారదర్శకత లేవు. కనుక వీటన్నింటిని చేరుస్తూ ఒక నూతన కొలీజియం వ్యవస్థ ఏర్పాటు చేసి రాజ్యాంగబద్థత కల్పిస్తే సమస్యకు తగిన పరిష్కారంగా ఉండగలదని కొందరి అభిప్రాయం.
ప్రస్తుతం ఎన్‌జెఎసిపై సుప్రీంకోర్టు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని కొత్తగా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించడం. అయితే ఇది సుదీర్ఘ, క్లిష్ణమైన ప్రక్రియ. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతులు ఆధిక్యంతో పాటు దేశంలో సగం రాష్ర్టాలు కూడా ఈ బిల్లును తమ చట్టసభల్లో ఆమోదించాలి.
నూతన ఎన్‌జెఎసి ఏర్పాటు చేసి, అందులో కేవలం న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలనే కాకుండా శాసన వ్యవస్థలోని కొంత మందిని చేర్చి మూడు వ్యవస్థలకు సమ ప్రాధాన్యం ఇచ్చి ఎంపిక కమిటీని రూపొందించాలని కొంతమంది ఆభిప్రాయం. అయితే ఈ ప్రతిపాదన కూడా న్యాయస్థానాల ముందు ఎంతవరకు నిలబడగలదనేది కీలకమైన అంశం.
పద్ధతా, ఫలితమా ఏది ప్రాథమికం అనే మీమాంస ఎప్పుడూ చర్చనీయాంశమే. న్యాయ వ్యవస్థలోని అవినీతి, బంధుప్రీతి, అసమర్థత, అరాచకం వంటి అవలక్షణాలు అనేక సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా ప్రజా ప్రాతినిధ్య చట్ట సభల్లో వివిధ లోపాలకు గతంలో బయటపడిన కుంభకోణాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. అయితే ఈ రెండు వ్యవస్థలు ఒకదానితో ఒకటి పోటీపడటం ప్రజాస్వామిక వ్యవస్థకు మంచిది కాదు. రాజ్యాంగానికి లోబడి రెండు వ్యవస్థలు పనిచేయాలి. అయితే ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ కాలానుగుణంగా చట్టాల్ని సవరించే హక్కు కలిగి ఉన్నప్పటికీ, రాజ్యాంగంలోని అంతర్భాగంగా ఉన్న మౌలిక రాజ్యాంగ సూత్రాలకు విరుద్థంగా వ్యవహరించకూడదు. అదేవిధంగా లోపభూయిష్టమైన కొలీజియం స్థానంలో నిష్పాక్షికమైన న్యాయమూర్తుల నియామకాల వ్యవస్థ రావడం అవసరం.
-ఎం. బాలలత
సివిల్స్ మెంటార్