Telugu Universityకి తెగులు..! స్నాతకోత్సవంలో వింతలు!

ABN , First Publish Date - 2022-12-26T11:55:59+05:30 IST

ఇటీవల జర్నలిజం (Journalism)లో ఓ విద్యార్థి ఎంఫిల్‌ పూర్తిచేశారు. స్నాతకోత్సవంలో ఆయనకు జర్నలిజంలో

Telugu Universityకి తెగులు..! స్నాతకోత్సవంలో వింతలు!
స్నాతకోత్సవంలో వింతలు!

ఎంఫిల్‌ చేస్తే.. పీహెచ్‌డీ పట్టా

ఫెయిల్‌ అయిన విద్యార్థికి డిస్టింక్షన్‌

డిస్టింక్షన్‌ వచ్చిన విద్యార్థి ఫెయిల్‌

నియంత్రణ లేని పరీక్షల విభాగం

పాలన వ్యవహారాల్లో నాన్‌-టీచింగ్‌ అధికారి

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇటీవల జర్నలిజం (Journalism)లో ఓ విద్యార్థి ఎంఫిల్‌ పూర్తిచేశారు. స్నాతకోత్సవంలో ఆయనకు జర్నలిజంలో పీహెచ్‌డీ(PhD) పట్టాను అందజేశారు. ఓ సబ్జెక్టులో ఫెయిల్‌ అయిన విద్యార్థిని ‘డిస్టింక్షన్‌’గా పేర్కొన్నారు. తర్వాతి రోజు పరీక్ష ప్రశ్నపత్రాన్ని ఇచ్చి.. బలవంతంగా రాయమన్నారు. ఇవీ ఖ్యాతి గడించిన తెలుగు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వింతలు. నాన్‌-టీచింగ్‌ అధికారితో పరీక్షల నియంత్రణ విభాగం నిర్వహణ.. కొత్త ప్రశ్న పత్రాల ముద్రణకు స్వస్తి..! పాత ప్రశ్న పత్రాలనే కాపీ-పేస్ట్‌ చేస్తున్న వైనం. అడ్డగోలు వ్యవహారాలతో తెలుగు వర్సిటీ(Telugu University)కి తెగులు పట్టించేశారు.

గందరగోళం వ్యవహారం

తెలుగు వర్సిటీ(Telugu University)లో ప్రస్తుతం ఎందెందు వెతికినా గందరగోళమే అన్నట్లు పరిస్థితులు తయారయ్యాయి. ఇటీవలి స్నాతకోత్సవంలో జర్నలిజంలో ఎంఫిల్‌కు బదులు డాక్టరేట్‌(Doctorate) ఇచ్చారంటూ ఓ విద్యార్థి వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. నాలుక కరుచుకున్న అధికారులు ఆ పట్టాను వెనక్కి తీసుకుని, ప్రింట్‌ చేశాక ఎంఫిల్‌ పట్టా ఇస్తామంటూ తాపీగా చెప్పారు. ఎంఏ సంగీతం పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థి డిస్టింక్షన్‌లో పాసైనట్లు.. డిస్టింక్షన్‌ వచ్చిన విద్యార్థి ఫెయిలైనట్లు నోటీసుబోర్డులో పెట్టి.. ఆ తర్వాత తప్పును దిద్దుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఎంఏ కర్ణాటక సంగీతానికి సంబంధించిన సెమిస్టర్‌ పరీక్షలో విద్యార్థులను పరీక్షల విభాగం అధికారులు గందరగోళానికి గురి చేశారు. సెమిస్టర్‌ పరీక్ష షెడ్యుల్‌ ప్రకారం విద్యార్థులు హాజరయ్యారు. పేపర్‌-2 పరీక్షకు హాజరైన విద్యార్థులకు పేపర్‌-3 ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. విద్యార్థులు తప్పును గుర్తించి, ఇన్విజిలేటర్‌కు వివరించగా.. అదే ప్రశ్నపత్రాన్ని రాయాలని, పేపర్‌-2కు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని బదులిచ్చారు. పేపర్‌-2కు సన్నద్ధమై వెళ్లిన విద్యార్థులు, ప్రిపేర్‌ అవ్వని పేపర్‌-3 రాయాల్సి వచ్చింది.

నాన్‌-టీచింగ్‌ అధికారి చేతుల్లోనే..

వర్సిటీకి పూర్తిస్థాయి ఉపకులపతిని నియమించినా.. గందరగోళ పరిస్థితులకు తెరపడలేదు. ముఖ్యంగా పరీక్షల నియంత్రణ విభాగంలో ఎలాంటి బోధన అనుభవం లేని నాన్‌-టీచింగ్‌ అధికారి కొనసాగుతున్నారు. అంతే కాదు.. సదరు అధికారి జర్నలిజం, జ్యోతిషం, యోగ (Yoga) విభాగాలకు కూడా డీన్‌గా ఉన్నారు. ఆ అధికారి వర్సిటీలో అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌గా ఉన్నప్పుడు, ద్రావిడ వర్సిటీలో దూరవిద్య కేంద్రం సమన్వయకర్తగా పనిచేసినప్పుడు పెద్దఎత్తున ఆరోపణలను ఎదుర్కొన్నారు. అప్పట్లో ఆయనను లైబ్రరీకే పరిమితం చేయగా.. ఉన్నతస్థాయి పైరవీలతో పలు పదవులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల రిజిస్ట్రార్‌కు ప్రమాదవశాత్తు గాయమైతే.. మెడికల్‌ లీవ్‌ బదులు.. సాధారణ సెలవు పెట్టించారు. రిజిస్ట్రార్‌ మెడికల్‌ లీవ్‌ పెడితే, సదరు అధికారికి ఇన్‌చార్జి బాధ్యతలు దక్కవనే ఉద్దేశంతోనే అలా చేయించారనే ఆరోపణలున్నాయి. నాన్‌-టీచింగ్‌ అధికారి చెప్పుచేతల్లో పని చేసే ఇష్టంలేక, చాలా మంది ప్రొఫెసర్లు పరిపాలన వ్యవహారాలను పట్టించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.

ప్రశ్నపత్రాల తయారీ ఎక్కడ?

తెలుగు విశ్వవిద్యాలయం(Telugu University)లో 33 సబ్జెక్టుల్లో 74 సర్టిఫికెట్‌, డిప్లొమా, యూజీ, పీజీ, రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌లను ఆఫర్‌ చేస్తున్నారు. నిజానికి ప్రతీ సెమిస్టర్‌(Semester)కు ప్రశ్నపత్రాలను రూపొందించాలి. కానీ, ప్రస్తుతం వర్సిటీలో కొత్తగా ప్రశ్నపత్రాల (Question papers) కూర్పును అటకెక్కించారు. పాత ప్రశ్నపత్రాలనే కాపీ-పేస్ట్‌ ప్రక్రియతో రీ-ప్రింట్‌ చేస్తున్నారు. గైడ్లు, పాత ప్రశ్నపత్రాలను చూసి, చదువుకుని, రాస్తే సరిపోతుందని విద్యార్థులు విమర్శిస్తున్నారు. అకాడమిక్‌ ప్రొఫెసర్లకు ప్రాధాన్యత లేకపోవడం.. నాన్‌-టీచింగ్‌ అధికారి, సిబ్బంది ఆధిపత్యం కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలున్నాయి.

Updated Date - 2022-12-26T11:57:41+05:30 IST