Teacher posts: ఇంకెంత కాలం నాన్చుడు!
ABN , First Publish Date - 2022-11-22T12:21:34+05:30 IST
‘ఆ.. అంటే.. ఆర్నెల్లు’ అన్న చందంగా మారింది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. భారీగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటి భర్తీపై
ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి!
రాష్ట్రంలో ఖాళీగా 24 వేల టీచర్ పోస్టులు
భర్తీ చేసేస్తామని ఆర్నెల్ల క్రితం సీఎం ప్రకటన
వెలువడని నోటిఫికేషన్.. 64 శాతం బడుల్లో కొరత
ఏడేళ్లుగా పదోన్నతులు.. నాలుగేళ్లుగా బదిలీలూ లేవ్
ఇంగ్లిష్ మీడియం ప్రారంభించినా పెరగని అడ్మిషన్లు
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా (Telangana) ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ(Vacancy of teaching posts) చేయడంపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ‘ఆ.. అంటే.. ఆర్నెల్లు’ అన్న చందంగా మారింది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. భారీగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటి భర్తీపై నిర్ణయం తీసుకోవడం లేదు. ఖాళీలను భర్తీ చేసేస్తామంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేయడమే తప్ప.. ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. రాష్ట్రంలో సుమారు 24 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంచనా. 12 వేల పోస్టులకు పైగా ఖాళీ ఉన్నట్లు ప్రభుత్వమే గతంలో ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని విభాగాల్లోని సుమారు 52 వేల పోస్టుల భర్తీకి సర్కారు అనుమతి ఇచ్చింది. టీచర్ పోస్టుల భర్తీకి మాత్రం అనుమతివ్వలేదు. రాష్ట్రంలోని ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ప్రకటన చేసి ఆర్నెల్లు గడుస్తున్నా.. అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. దీంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న సుమారు 3 లక్షల మందికి నిరాశే మిగులుతోంది. టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకూ నష్టం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధిపర్చడానికి ‘మన ఊరు-మన బడి’ వంటి కార్యక్రమాలతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రారంభించారు. కానీ, విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మాత్రం నియమించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1 నుంచి 8 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించినందున ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు. కానీ, సాధారణ స్థాయిలోనే కొత్త అడ్మిషన్లు నమోదయ్యాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధనకు టీచర్లు లేకపోడంతో పాటు ఖాళీలూ ఎక్కువగా ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో పౌర స్పందన వేదిక చేసిన సర్వే ప్రకారం.. 64 శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు తేలింది. ఉమ్మడి రాష్ట్రంలో రెండేళ్లకోసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేవారు. అందులో భాగంగా 2012 మేలో 20 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 2013 నుంచి తెలంగాణ ఉద్యమం కారణంగా డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) విడుదలవలేదు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2017లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పట్లో 25 వేల ఖాళీలు ఉంటే ప్రభుత్వం 13,500 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఒక్క నోటిఫికేషనూ జరీ చేయలేదు.
24 వేల ఖాళీలు..
రాష్ట్రంలో సుమారు 24 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. 12,943 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలో వెల్లడించింది. ఆ మేరకు కేంద్రానికీ సమాచారం అందజేసింది. ప్రాథమిక విద్యలో 10,657 ఖాళీలు ఉండగా, ప్రాథమికోన్నత విద్యలో 2,286 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ రెండు విభాగాల్లో కలిపి మొత్తం 1,38,517 పోస్టులు మంజూరవగా, అందులో 1,25,574 పోస్టులను భర్తీ చేశారు. అయితే గతంలో పనిచేసిన 12 వేల మంది విద్యా వలంటీర్ పోస్టులను ఖాళీగా చూపించలేదు. అవి కూడా కలిపితే 24 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క.
ఏడేళ్లుగా పదోన్నతుల్లేవ్
రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఏడేళ్లుగా పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేవు. ఫలితంగా 1970 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 2,400 ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టులు, 8,270 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. మరోవైపు ప్రాథమిక పాఠశాలలకు కొత్తగా 5,571 ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించినా.. ఇంకా ఉత్తర్వులు రాలేదు. ఈ పోస్టులు మంజూరైతే.. ఆ మేరకు ఉపాధ్యాయులకు మరిన్ని పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది. కానీ, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల విషయంలోనూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వీరికి పదోన్నతులు కల్పించాలంటే.. వెంటనే బదిలీలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పదోన్నతులు, బదిలీలు, రేషనలైజేషన్ ఏక కాలంలో నిర్వహించాలనే చర్చ కూడా జరిగింది. అయితే కోర్టు కేసులు, ఉపాధ్యాయ సంఘాల మధ్య సమన్వయ లోపం వంటి కారణాలతో పాటు ప్రభుత్వ వైఖరితో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.