Munugode Bypoll: మునుగోడులో ప్రచారం బంద్.. ఇప్పటివరకూ ఎన్ని కోట్లు పట్టుబడ్డాయో తెలిస్తే..
ABN , First Publish Date - 2022-11-01T18:02:53+05:30 IST
మునుగోడులో ఉపఎన్నికల ప్రచారం (Munugode Bypoll) ముగిసింది. ప్రచార గడువు ముగియడంతో నియోజకవర్గంలోని గ్రామాల్లో గత కొద్దిరోజులుగా మోగిన రాజకీయ పార్టీల మైకులు...
నల్గొండ: మునుగోడులో ఉపఎన్నికల ప్రచారం (Munugode Bypoll) ముగిసింది. ప్రచార గడువు ముగియడంతో నియోజకవర్గంలోని గ్రామాల్లో గత కొద్దిరోజులుగా మోగిన రాజకీయ పార్టీల మైకులు మూగబోయాయి. రాజకీయ పార్టీల వ్యూహాల్లో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో (Munugodu By Election) తిష్ట వేసిన ముఖ్య నేతలంతా హైదరాబాద్‌కు తిరుగు బాట పట్టారు. స్థానికేతరులంతా నియోజకవర్గం విడిచివెళ్లాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది. నవంబర్ 3వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. మునుగోడు ఉప ఎన్నికలో (Munugode Election Heat) 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 298 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు (Munugode Voters) తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిసారిగా కొత్త డిజైన్ ఓటర్ ఐడీ కార్డులు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు అందాయి. 45 స్థానాల్లో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన ఎన్నికల సంఘం అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగే తీరుతెన్నులను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనుంది. ఫ్లయింగ్ స్క్వాడ్ సహా 50 టీమ్‌లు రంగంలోకి దిగాయి. నియోజకవర్గంలో ఇన్‌కం ట్యాక్స్ బృందాలు కాస్తంత గట్టిగానే ముందుకెళుతున్నాయి.
ఏ అభ్యర్థి అయినా నగదు, మద్యం ఇతర ఉచితాలు పంపిణీ చేస్తే వారిపై ఎన్నికల నిబంధన ఉల్లంఘన మేరకు చర్యలు తీసుకోనున్నారు. వారిపై పోలీస్ కేసు కూడా నమోదు చేస్తారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో భాగంగా ఎన్నికల కమిషన్ నిరంతరం జనరల్ అబ్జర్వర్, పోలీస్ నోడ ల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఎన్నికల పరిస్థితులను చర్చించి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తుంటారు. ఎన్నికల యంత్రాంగం తటస్థంగా ఉండేలా ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ల కు 100 మీటర్ల దూరంలో ప్రచారం చేయడం, పోలింగ్‌కు 48 గంటల వ్యవధిలోపు బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడం పోలింగ్ స్టేషన్‌కు బయటకి ఓటర్లను రవాణా చేయడం వంటి చర్యలు ఎన్నిక ల ప్రవర్తన నియామావళి ఉల్లంఘన కింద పరిగణిస్తారు.
మునుగోడు నియోజకవర్గంలో 199 మంది మైక్రోఅబ్జర్వర్లు అందుబాటులో ఉండనున్నారు. ఈ నెల 3వ తేదీన పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. సిబ్బంది పోలింగ్ స్టాక్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 3,366 మంది పోలింగ్ సిబ్బందిని మునుగోడులో వినియోగించనున్నారు. ఇప్పటికే 111 బెల్ట్‌షాపులను సీజ్ చేసిన అధికారులు 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. 104 క్లస్టర్ల ఏర్పాటుతో భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు ప్రాంతాలతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో 100 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఆయా గ్రామాల్లోకి వెళ్తున్న వాహనాల నెంబర్లను కూడా రిజిస్టర్‌లో నమోదు చేసుకుంటున్నా రు. ఇప్పటికే 185 కేసులు నమోదు చేయడంతో పాటు రూ.6.80 కోట్ల నగదు, 4,500 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు.