మునుగోడు ఓటర్లకు దీపావళి ధమాకా

ABN , First Publish Date - 2022-10-23T20:50:30+05:30 IST

మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు పండుగే పండుగ. ఇక దీపావళి పండుగకు ఓటర్లు ఏది అడిగితే అదే అన్న విధంగా ఆయా రాజకీయ పార్టీలు పంపిణీ చేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మద్యం ఏరులై పారుతుండగా ఆత్మీయ సమ్మేళనాల పేరిట దావత్‌లు కూడా కొనసాగుతున్నాయి.

మునుగోడు ఓటర్లకు దీపావళి ధమాకా

నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు పండుగే పండుగ. ఇక దీపావళి పండుగకు ఓటర్లు ఏది అడిగితే అదే అన్న విధంగా ఆయా రాజకీయ పార్టీలు పంపిణీ చేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మద్యం ఏరులై పారుతుండగా ఆత్మీయ సమ్మేళనాల పేరిట దావత్‌లు కూడా కొనసాగుతున్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకుని ఓ రాజకీయ పార్టీ సేమియా, పేనీల ప్యాకెట్లతో పాటు చక్కెరను కూడా పంపిణీ చేస్తోంది. రూ.500 విలువైన ఒక్కో ప్యాకెట్లో ఈ వస్తువులను పెట్టి నియోజకవర్గంలోని ఓటర్లకు అందజేశారు. ఆదివారం ఉదయం మర్రిగూడ మండలంలో ఈ ప్యాకెట్లను ఓటర్లకు పెద్దఎత్తున అందజేసిన ఆ రాజకీయ పార్టీల నాయకులు మిగతా మండలాల్లో కూడా పంపిణీ మొదలుపెట్టారు.

అయితే ప్యాకెట్లలో సేమియా, పేనీలు, చక్కెరను తీసుకున్న ఓటర్లు పాల ప్యాకెట్లు కూడా ఇవ్వాలని అడుగుతున్నారని సమాచారం. అంతేకాక మందు, మటన్‌, డబ్బులు ఎప్పుడిస్తారంటూ ఆ రాజకీయ పార్టీల నాయకులను కోరడం విశేషం. దీంతో పండుగ తర్వాత మందుతో పాటు ఒక్కో కుటుంబానికి కిలో నుంచి రెండు కిలోల యాట మాంసాన్ని అందిస్తామంటూ ఓటర్లకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. బలమైన సామాజిక ఓటర్లతో రెండు రాజకీయ పార్టీలు హైదరాబాద్‌లో ఫంక్షన్‌ హాల్‌లో ఆత్మీయ సమ్మేళనాల పేరిట సమావేశాలు ఏర్పాటు చేసుకుని విందులు ఏర్పాటు చేశాయి. ఇటీవల ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన దావత్‌లో మందు సరిపోకపోవడంతో నిర్వాహకులపై ఓటర్లు దాడికి కూడా దిగారు.

Updated Date - 2022-10-23T20:53:06+05:30 IST