Himachal Pradesh : హిమాచలంలో ఎన్నికల సెగ

ABN , First Publish Date - 2022-11-10T05:37:35+05:30 IST

ఒకసారి కాంగ్రెస్‌ గెలుపు! మరోసారి బీజేపీ విజయం!! దాదాపు మూడున్నర దశాబ్దాలుగా.. ఏ పార్టీ వరుసగా రెండుసార్లు గెలిచిన చరిత్ర..

Himachal Pradesh : హిమాచలంలో ఎన్నికల సెగ

మళ్లీ గెలుపే లక్ష్యంగా బీజేపీ పోరాటం..

ఆనవాయితీ ప్రకారం ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్‌ ధీమా

ఉనికి చాటుకునేందుకు ఆప్‌ ప్రయత్నం

పతాకస్థాయికి హిమాచల్‌ ఎన్నికలపోరు

సిమ్లా, నవంబరు 9: ఒకసారి కాంగ్రెస్‌ గెలుపు! మరోసారి బీజేపీ విజయం!! దాదాపు మూడున్నర దశాబ్దాలుగా.. ఏ పార్టీ వరుసగా రెండుసార్లు గెలిచిన చరిత్ర లేని హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి పతాకస్థాయికి చేరుకుంది. 68 సీట్లున్న హిమాచల్‌ అసెంబ్లీకి శనివారం (నవంబరు 12న) ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు గుజరాత్‌తోపాటు డిసెంబరు 8న వెలువడనున్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి, 1985 తర్వాత ఏ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదన్న ఆనవాయితీని బ్రేక్‌ చేయాలన్న పట్టుదలతో బీజేపీ.. ఆనవాయితీ ప్రకారం ఈసారి గెలుపు తమదేనన్న ధీమాతో కాంగ్రెస్‌.. చిన్నగానైనా తన ఉనికి చాటుకునే ఉద్దేశంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ.. తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే.. సాధారణంగా అధికార పార్టీపై ఉండే వ్యతిరేకత హిమాచల్‌లో బీజేపీపైనా ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగులేమో పాత పెన్షన్‌ పథకం కోసం డిమాండ్‌ చేస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌, నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కూడా అధికార పార్టీపై ప్రజాగ్రహానికి కారణమవుతోంది. ఇంత వ్యతిరేకత ఉన్నా.. దాన్ని అధిగమించి మరోసారి గెలుపు కోసం బీజేపీ నేతలు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.

ప్రధానంగా ఐదు సమస్యలు..

ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ ఎన్నికలనగానే అత్యంత ప్రధానమైన సమస్యలు ప్రచారాస్త్రాలుగా మారుతాయి. హిమాచల్‌లో అలాంటి ప్రధానాంశాలు.. గెలుపోటములను నిర్ణయించే సమస్యలు ఐదు ఉన్నాయి. అవేంటంటే.. నిరుద్యోగం, పాత పింఛను విధానం, యాపిల్‌ రైతుల సమస్యలు, రోడ్ల అనుసంధానం, అగ్నిపథ్‌ స్కీమ్‌. హిమాచల్‌లో నిరుద్యోగ రేటు సెప్టెంబరులో 9.2 శాతంగా, అక్టోబరులో 8.6 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు (7.6ు) కన్నా ఎక్కువ. హిమాచల్‌లో ఉద్యోగం చేయగలిగిన వయసు, అర్హత ఉండి ఉద్యోగాలు లేనివారి సంఖ్య దాదాపు 15 లక్షలు. దీంతో వారిని ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలూ హామీలు గుప్పిస్తున్నాయి. అలాగే.. 2003లో ఎత్తేసిన పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలంటూ ప్రభుత్వోద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో.. 2021లో బీజేపీ సర్కారు దీనిపై ఒక కమిటీని నియమించింది. తమ మేనిఫెస్టోలో మాత్రం దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో ప్రధానాంశంగా చేర్చింది. ఆప్‌ కూడా ఈ మేరకు హమీ ఇచ్చింది. ఇక, అనేక సమస్యలు ఎదుర్కొంటున్న యాపిల్‌ రైతులు వాటిని పరిష్కరించేవారికే ఈసారి తమ ఓటు అని ముక్తకంఠంతో చెబుతున్నారు. కొండప్రాంతం కావడంతో హిమాచల్‌లో రోడ్ల అనుసంధానం చాలా తక్కువగా ఉంటుంది. ఆ సమస్యపైనా పార్టీలు దృష్టిసారిస్తున్నాయి. అలాగే.. హిమాచల్‌ యువతలో చాలా మంది సైన్యంలో సేవలు అందించాలని కలలుగంటారు. ఈ నేపథ్యంలో.. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం వారిలో ఆగ్రహానికి కారణమైంది. ఇది ఈసారి బీజేపీకి తీవ్ర ప్రతికూలాంశమే.

హామీల తాయిలాలు..

ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో మూడు ప్రధాన పార్టీలూ హామీల వర్షాన్ని కురిపించాయి. అధికార బీజేపీ.. ఉమ్మడి పౌర స్మృతి అమలు, మహిళలకు ప్రభుత్వోద్యోగాల్లో 33ు రిజర్వేషన్‌ను తమ ప్రధాన హామీలుగా ప్రకటించింది. కాంగ్రె్‌సపార్టీ ఓపీఎ్‌సను, ఉద్యోగాల భర్తీని ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. ఆప్‌ ఢిల్లీ తరహాలోనే ఎక్కువగా ఉచితాలను తాయిలాలుగా ప్రకటించింది. అయితే... ఆమ్‌ ఆద్మీ పా ర్టీ గుజరాత్‌పై పెట్టినంత శ్రద్ధ హిమాచల్‌పై పెట్టలేదు. పోటీ ప్రధానంగా కాంగ్రె్‌స-బీజేపీ మధ్యనే నెలకొంది.

Updated Date - 2022-11-10T08:41:12+05:30 IST