Munugode Election Results: మునుగోడు ఫలితాలపై కేటీఆర్ ఆందోళన.. కారణం ఇదేనా..!

ABN , First Publish Date - 2022-11-06T20:00:35+05:30 IST

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను రోడ్డు రోలర్, రోటీ మేకర్ గుర్తులు ఇంకా వెంటాడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలిచింది కాబట్టి ఈ గుర్తులపై పెద్దగా చర్చ జరుగలేదు.

Munugode Election Results: మునుగోడు ఫలితాలపై కేటీఆర్ ఆందోళన.. కారణం ఇదేనా..!
kcr

హైదరాబాద్: అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను రోడ్డు రోలర్, రోటీ మేకర్ గుర్తులు ఇంకా వెంటాడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలిచింది కాబట్టి ఈ గుర్తులపై పెద్దగా చర్చ జరుగలేదు. కానీ, ఈ గుర్తులను మాత్రం మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తాజాగా, మీడియాతో మాట్లాడిన ఆయన.. మునుగోడులో కారును పోలిన గుర్తులు టీఆర్‌ఎస్ ఆధిక్యానికి గండి కొట్టాయని అన్నారు. కారును పోలిన గుర్తులకు దాదాపు ఆరు వేల ఓట్లు పోలయ్యాయని అన్నారు. అంటే ఆ ఓట్లన్నింటినీ టీఆర్ఎస్ కోల్పోయిందని పరోక్షంగా పేర్కొన్నారు. నిజానికి ఆరు వేల ఓట్లంటే చిన్న విషయం కాదు. అభ్యర్థి గెలపోటములను నిర్ణయిస్తాయి. అయితే, మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించడంతో ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

పలు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కారు గుర్తు పోలిన గుర్తులతో అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపించిన సందర్భాలు ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించి కారును పోలిన గుర్తులను స్వతంత్రులకు కేటాయించవద్దని కోరుతూ ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రాలు కూడా అందజేశారు. అయితే ఎన్నికల కమిషన్‌ చెప్పిన విధంగా ఏ గుర్తును కూడా తొలగించకుండా మునుగోడు ఉప ఎన్నికలో యథావిధిగా కారును పోలిన గుర్తును స్వతంత్రులకు కేటాయించేశారు. ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్‌ మెజార్టీకి మూడు గుర్తులు గండి కొట్టాయి. కారును పోలిన గుర్తుతో 6,551 ఓట్లు స్వతంత్రులకు పడటంతో ఆ ఓట్లు టీఆర్‌ఎస్‌ పార్టీకి మెజార్టీ రాకుండా చేశాయి.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మారమోని శ్రీశైలంయాదవ్‌కు రోటీమేకర్‌ గుర్తును కేటాయించారు. ఈ గుర్తుకు 2,407 ఓట్లు పడగా రోడ్డు రోలర్‌ గుర్తును పొందిన యుగతులసి పార్టీ అభ్యర్థి కె. శివకుమార్‌కు 1,874 ఓట్లు లభించాయి. ఈ రెండు గుర్తులు కూడా మొదటి ఈవీఎంలోనే ఉన్నాయి. ఇక రెండో ఈవీఎంలో చెప్పుల గుర్తు పొందిన దళిత శక్తి ప్రోగ్రాం (డీఎస్పీ) అభ్యర్థి ఏర్పుల గాలయ్యకు 2,270 ఓట్లు పడ్డాయి. రెండో ఈవీఎంలో ఆ గుర్తు రెండో స్థానంలో ఉంది. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి ఈవీఎంలో రెండో గుర్తు ఉండటంతో చాలా మంది కారుకు సంబంధించిన గుర్తు అని ఆ అభ్యర్థికి ఓటు వేయడంతో టీఆర్‌ఎస్‌ ఓట్లు కోల్పోవాల్సి వచ్చింది.

నిజానికి టీఆర్ఎస్‌ను ఈ గుర్తులు టీఆర్ఎస్‌ను కలవరపెట్టడం ఇదే తొలిసారి కాదు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేవలం 5వేల ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్‌ గుర్తు కలిగిన స్వతంత్ర అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లే బూర నర్సయ్య ఓటమికి కారణమయ్యాయన్న అభిప్రాయం టీఆర్‌ఎస్‌లో ఉంది. అంతకుముందు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్‌ నియోజకవర్గంలో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తుకు 11 వేల ఓట్లు పోలయ్యాయి. అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల వీరేశం 6వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమిపాలయ్యారు.

మునుగోడు ఉప ఎన్నికలోనూ ఆ ప్రమాదం ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముందే అంచనా వేసింది. మునుగోడులో స్వతంత్ర అభ్యర్థులు కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్‌, ట్రాక్టర్‌, చపాతీ మేకర్‌, ఆటో, కేక్‌, క్యాప్‌, ఇస్త్రీపెట్టె, టీవీ వంటి గుర్తులను ఆప్షన్‌గా పెట్టుకున్నారు. తమ గుర్తులను పోలిన గుర్తులను ఆప్షన్లుగా పెట్టుకున్న స్వతంత్ర అభ్యర్థులను నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. టీఆర్‌ఎస్‌‌కు సమస్యగా మారనున్న అభ్యర్థుల వివరాలను తీసుకుని వారితో బేరసారాలు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. నామినేషన్‌ ఉపసంహరించుకుంటే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు ఇస్తామని మంత్రులే ఆఫర్‌ చేసినట్టు సమాచారం. ఇప్పుడు టీఆర్‌ఎస్ గెలిచింది కాబట్టి ఆ పార్టీ నేతలు ప్రశాంతంగా ఉన్నారు.

Updated Date - 2022-11-06T21:05:07+05:30 IST