Gujarat Assembly Polls: తగ్గిన పోలింగ్‌తో గుబులు

ABN , First Publish Date - 2022-12-05T17:45:08+05:30 IST

ఈసారి ఓటింగ్ శాతం తగ్గడంతో అన్ని పార్టీల అభ్యర్ధుల్లో గుబులు నెలకొంది.

Gujarat Assembly Polls: తగ్గిన పోలింగ్‌తో గుబులు
Gujarat Assembly Polls

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడతలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈ విడతలో గాంధీనగర్, అహ్మదాబాద్, వడోదర సహా 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 14, 975 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,13,325 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడతలో కచ్‌-సౌరాష్ట్ర, దక్షిణ గు జరాత్‌ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. 63 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. 2017లో జరిగిన మొదటి విడతలో 66.75 శాతం పోలింగ్‌ నమోదైంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని నిషాన్ స్కూల్‌లో ఓటేశారు. పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్‌లో నిల్చుని ఓటేశారు. మోదీ మరో సోదరుడు సోమాభాయ్ కూడా అహ్మదాబాద్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో ఓటేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తల్లి హీరాబెన్ మోదీ (Heeraben Modi) గాంధీనగర్‌లో ఓటేశారు. నరేంద్ర మోదీ సోదరుడు పంకజ్ మోదీ తోడురాగా ఆమె వీల్ చెయిర్‌పై ఓటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. గాంధీనగర్‌లోని రేసాన్ ప్రైమరీ స్కూల్‌లో హీరాబెన్ ఓటేశారు. ఈ ఏడాది జూన్ 18న ఆమె వందో పుట్టిన రోజు జరుపుకున్నారు. వందేళ్ల వయసులోనూ ఓటేసేందుకు ఉత్సాహంగా వచ్చిన హీరాబెన్ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

అహ్మదాబాద్‌లోని నరన్‌పూర్ పోలింగ్ కేంద్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓటేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఓటేశారు.

27 ఏళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతా తానై ప్రచారం చేశారు. 2017లో 77 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి తమకే ఛాన్స్ అని ప్రచారం చేసింది. మరోవైపు పంజాబ్ తరహాలో విజయం అందుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది.

182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో మ్యాజిక్ నెంబర్ 92. ఈసారి ఓటింగ్ శాతం తగ్గడంతో అన్ని పార్టీల అభ్యర్ధుల్లో గుబులు నెలకొంది.

Updated Date - 2022-12-05T20:14:11+05:30 IST