Munugode: హోరాహోరీగా మునుగోడు పోలింగ్.. ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు

ABN , First Publish Date - 2022-11-03T16:30:04+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికపై అందరి దృష్టి పడింది. ఈ ఉప ఎన్నిక వచ్చే సార్వత్రిక ఎన్నికలను నిర్దేశిస్తాయని అనేక విశ్లేషణలు వచ్చాయి.

Munugode: హోరాహోరీగా మునుగోడు పోలింగ్.. ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు

మనుగోడు: మునుగోడు ఉప ఎన్నికపై అందరి దృష్టి పడింది. ఈ ఉప ఎన్నిక వచ్చే సార్వత్రిక ఎన్నికలను నిర్దేశిస్తాయని అనేక విశ్లేషణలు వచ్చాయి. ఇక్కడ పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉప ఎన్నికను అంత్యంత ఖరీదైన ఎన్నికగా అభివర్ణిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల మొదలు... ప్రచారం ముగిసే వరకు విందు, వినోదాల పేరుతో నగదు ప్రవాహాన్ని పారించారు. హోరాహోరీ పోరులో తమ ఓటుకు డిమాండ్‌ పెరిగిందని.. అడిగినంత ఇస్తారని ఆశించిన చాలా మంది.. ప్రధాన పార్టీల అభ్యర్థుల అనుచరులు చేతిలో పెట్టిన డబ్బును చూసుకుని నిరాశానిస్పృహలకు లోనయ్యారు.

మునుగోడు నియోజకవర్గంలో ఉన్న మౌలిక వసతులను అభ్యర్థుల దృష్టికి తేకుండా మాకు ఎంత ఇస్తారనే దానిపై ఓటర్లు ఎదురుచూశారు. మునుగోడులో ఒక ఓటుకు వేల రూపాయల డబ్బులను రాజకీయ పార్టీలు పంచాయి. అయితే ఆ నియోజకవర్గంలో స్కూల్స్‌ను మాత్రం ఏ పార్టీ పట్టించుకోలేదు. తమకు డబ్బులు అందలేదని ధర్నాలు చేసే ఓటర్లున్నారు. తమ గ్రామ స్కూల్‌ను బాగు చేయాలని ఇదే ఓటర్లు అభ్యర్థులను నిలదీయకపోవడం గమనార్హం. అయితే గట్టుప్పల్ మండలం రంగం తండాలో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని... సమస్యలను అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఓటు వేయమని హెచ్చరించారు. రంగం తండాలో మొత్తం 320 ఓట్లు ఉన్నాయి.

Updated Date - 2022-11-03T16:30:06+05:30 IST