Heeraben Modi: స్ఫూర్తిగా నిలిచిన మోదీ తల్లి.. వందేళ్ల వయసులోనూ తరగని ఉత్సాహం
ABN , First Publish Date - 2022-12-05T15:35:42+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తల్లి హీరాబెన్ మోదీ (Heeraben Modi) గాంధీనగర్‌లో ఓటేశారు.
గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తల్లి హీరాబెన్ మోదీ (Heeraben Modi) గాంధీనగర్‌లో ఓటేశారు. నరేంద్ర మోదీ సోదరుడు పంకజ్ మోదీ తోడురాగా ఆమె వీల్ చెయిర్‌పై ఓటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. గాంధీనగర్‌లోని రేసాన్ ప్రైమరీ స్కూల్‌లో హీరాబెన్ ఓటేశారు. ఈ ఏడాది జూన్ 18న ఆమె వందో పుట్టిన రోజు జరుపుకున్నారు. వందేళ్ల వయసులోనూ ఓటేసేందుకు ఉత్సాహంగా వచ్చిన హీరాబెన్ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
నిన్న గాంధీనగర్ నివాసంలో ప్రధానమంత్రి మోదీ తల్లి హీరాబెన్‌ను కలుసుకున్నారు. ఆశీస్సులు తీసుకున్నాక అమ్మ పక్కనే కూర్చుని చాయ్ తాగారు. అమ్మతో చాలాసేపు ముచ్చటించారు. తల్లితో ముచ్చట్ల సమయంలో మోదీ చిరునవ్వులు చిందించారు.
తల్లి హీరాబెన్‌తో సమావేశం తర్వాత మోదీ గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. ఇవాళ జరిగిన గుజరాత్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికల్లో అహ్మదాబాద్‌లో ఓటేశారు. అహ్మదాబాద్‌లోని నిషాన్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చిన మోదీ క్యూ లైన్‌లో నిల్చుని ఓటేశారు. మోదీ మరో సోదరుడు సోమాభాయ్ కూడా అహ్మదాబాద్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో ఓటేశారు.
రెండో విడతలో భాగంగా 93 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 14, 975 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,13,325 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడతలో కచ్-సౌరాష్ట్ర, దక్షిణ గు జరాత్ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. 63 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2017లో జరిగిన మొదటి విడతలో 66.75 శాతం పోలింగ్ నమోదైంది.