Himachal Results: బీజేపీ గెలుపు అవకాశాలకు రెబల్స్ గండి..?

ABN , First Publish Date - 2022-12-08T14:04:56+05:30 IST

హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ గెలుపు అవకాశాలకు ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు మోకాలడ్డిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు కౌటింగ్..

Himachal Results: బీజేపీ గెలుపు అవకాశాలకు రెబల్స్ గండి..?

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal pradesh) బీజేపీ (BJP) గెలుపు అవకాశాలకు ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు (Rebels) మోకాలడ్డిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు కౌటింగ్ జరుగుతుండగా, సుమారు 9 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థులు కొద్దిపాటి ఆధిక్యంలో సాగుతున్నారు. వీరిలో పలువురు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి 3 నుంచి 4 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. వీరిలో బీజేపీ రెబల్స్ కూడా ఉన్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ వెలువడిన ప్రాథమిక ఫలితాలను బట్టి కనీసం 12 స్థానాల్లో బీజేపీకి రెబల్స్ కారణంగా దెబ్బపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్‌కు కలిసొచ్చే పరిణామంగా కనిపిస్తోంది.

బిలాస్‌పూర్, ధర్మపూర్, ఇండోర, ఝాందుట, రాంపూర్, షిల్లై, శ్రీ రేణుకాజి, సుజన్‌పూర్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది. బిలాస్ పూర్‌లో కాంగ్రెస్‌పై బీజేపీ కేవలం 790 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, ధర్మపూర్‌లో కాంగ్రెస్‌పై బీజేపీ అభ్యర్థి కేవలం 800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇండోరలో బీజేపీ కంటే కాంగ్రెస్ 580 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, ఝాడుటలో బీజేపీ 578 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ రెబల్ అభ్యర్థికి 4,252 ఓట్లు వచ్చాయి. రాంపూర్‌లో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై కేవలం 64 ఓట్ల ఆధిక్యంలో ఉంది. షిల్లైలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే 349 ఓట్ల ఆధిక్యంలో ఉంది. శ్రీ రేణుకాజీలో బీజేపీ కంటే కాంగ్రెస్ కేవలం 417 ఓట్ల అధిక్యంలో ఉంది. సుజన్‌పూర్‌లోనూ బీజేపీ కంటే కాంగ్రెస్ 634 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తం మీద ఈ తొమ్మిది సీట్లు హిమాచల్ ప్రదేశ్ ఫలితాలను ప్రభావితం చేయబోతున్నాయి.

Updated Date - 2022-12-08T14:04:57+05:30 IST