బాబు పుట్టాక ఆ ఆసక్తి లోపించిందెందుకు?

ABN , First Publish Date - 2022-06-01T18:52:11+05:30 IST

బాబు పుట్టినప్పటి నుంచి నా భార్యకు సెక్స్‌ మీద ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. అలా కొన్ని నెలలపాటు దూరంగా ఉండిపోతోంది. బలవంతం చేస్తే బాబును చూసుకోవాల

బాబు పుట్టాక ఆ ఆసక్తి లోపించిందెందుకు?

ఆంధ్రజ్యోతి(01-06-2022)

ప్రశ్న: బాబు పుట్టినప్పటి నుంచి నా భార్యకు సెక్స్‌ మీద ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. అలా కొన్ని నెలలపాటు దూరంగా ఉండిపోతోంది. బలవంతం చేస్తే బాబును చూసుకోవాలనో, ఇంటి పనులున్నాయనో ఏదో ఓ వంక చెప్పి తప్పించుకుంటూ ఉంటుంది. ఆమెలో ప్రసవానికి పూర్వపు ఆసక్తిని తిరిగి కలిగించేదెలా? 


సమాధానం: ప్రసవంతో స్త్రీల బాధ్యతలు రెట్టింపవుతాయి. పిల్లాడి పనులు, ఇంటి పనుల వల్ల స్త్రీలకు సెక్స్‌ పట్ల ఆసక్తి తగ్గటం సహజం. ఇలాంటప్పుడు సెక్స్‌ కోసం బలవంతం చేస్తే పరిస్థితి మరీ ఇబ్బందిగా తయారవుతుంది. మీరు చెబుతున్న లక్షణాల్ని బట్టి మీ భార్య డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు కనిపిస్తోంది. లేడీ డాక్టర్‌కి చూపించి ఈ విషయం నిర్ధారించుకోండి. ఒకవేళ సెక్స్‌ పట్ల నిరాసక్తతకు డిప్రెషన్‌ కారణం కాకపోతే... ఈ కింది ప్రయత్నాలు చేయండి.  కొంతకాలంపాటు సెక్స్‌ ఆలోచనల్ని పక్కనపెట్టి ఆమెతో ప్రేమపూర్వక మాటలతో దగ్గరయ్యే ప్రయత్నం చేయండి. బాబును పెద్దలకి అప్పగించి వారానికోసారైనా ఆమెను బయటికి డిన్నర్‌కి తీసుకెళ్లండి. ఆమె దగ్గరకు రావటంలేదని కోపాన్ని ప్రదర్శిస్తే ఇద్దరి మధ్యా పరిస్థితులు మరింత జటిలంగా తయారవుతాయి. కాబట్టి అందుకోసం ఆమె సిద్ధపడేంత వరకూ ఓపికగా ఆగాల్సిందే! ఆమె పనుల్లో సహాయపడండి. మరీముఖ్యంగా రాత్రుళ్లు బాబు బాధ్యత మీరే తీసుకుని ఆమె కంటినిండా నిద్రపోయేలా చూసుకోండి. సెక్స్‌ కోసం ఒత్తిడి చేయటం, బలవంతపెట్టటం చేస్తే అందుకు అనుకూలంగాలేని పరిస్థితుల్లో ఆ ఆసక్తి తనలో కలుగుతుందని భర్త ఎలా అనుకుంటున్నాడు? అనే ప్రశ్నలు ఆమెలో తలెత్తుతాయి. కాబట్టి బాబు పుట్టకముందు మీ ఇద్దరి మధ్య ఉండే సాన్నిహిత్యాన్ని ఆమె ఫీలయ్యేలా వ్యవహరించండి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీ సెక్స్‌ లైఫ్‌ దార్లో పడుతుంది.


డా. షర్మిల మజుందార్‌

కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌

రామయ్య ప్రమీల హాస్పిటల్‌.

Updated Date - 2022-06-01T18:52:11+05:30 IST