అదే వ్యసనంగా మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..

ABN , First Publish Date - 2022-02-22T21:26:07+05:30 IST

ఆధునిక సమాజం లైంగిక ఆనందాలకు అనేక దోవలు చూపుతోంది. అయితే వీటికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. వీటిని దాటితే అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. వ్యక్తిగత సంతృప్తికి మించి.. పరస్పర ఆనందానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటున్నారు

అదే వ్యసనంగా మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..

ఆంధ్రజ్యోతి(22-02-2022)

ఆధునిక సమాజం లైంగిక ఆనందాలకు అనేక దోవలు చూపుతోంది. అయితే వీటికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. వీటిని దాటితే అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. వ్యక్తిగత సంతృప్తికి మించి.. పరస్పర ఆనందానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటున్నారు. ప్రయోగాల పేరిట వికారాలకు పోతే అసలుకే మోసం వస్తుందని ప్రముఖ సెక్సాలజిస్ట్‌ డాక్టర్‌ షర్మిలా ముజుందార్‌ హెచ్చరిస్తున్నారు. 


నీలి చిత్రాల నీడలో..

మొబైల్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నీలి చిత్రాల నీడ మరింత పెరిగిపోయింది. దీన్ని అదుపుచేయడం దాదాపు అసాధ్యమే! లైంగికోద్రేకం కోసం అప్పుడప్పుడు సాఫ్ట్‌ ఫోర్న్‌ చూసేవారు కొందరు ఉంటారు. వారికి పెద్ద మానసిక సమస్యలు రావు. కానీ అది ఒక వ్యవసనంగా మారిపోతే మాత్రం పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. గంటల తరపడి చూడటం.. ఖాళీ సమయం దొరికితే పోర్న్‌ చూడటానికి ఇష్టపడటం వ్యవసనంగా మారుతున్నాయనటానికి సంకేతాలుగా గుర్తించాలి. అంతే కాకుండా అసహజమైన పోర్న్‌ను చూడటానికి అలవాటు పడినవారిలో పారాఫిలియా అనే మానసిక సమస్య ఏర్పడే అవకాశముంది. భాగస్వామిని హింసించి దాని ద్వారా లైంగికోద్రేకం పొందటం ఈ రుగ్మత లక్షణం. అందువల్ల పోర్న్‌ను చూడటంలో నియంత్రణ ఉండడం తప్పనిసరి. భాగస్వామికి పోర్న్‌ చూడటం ఇష్టం లేనప్పుడు- మానివేయటం మంచిది. అంతే కాకుండా పోర్న్‌ చూడకపోతే లైంగికోద్రేకం పొందని పరిస్థితులు వస్తున్నాయేమో ఎవరికి వారు గమనించుకోవాలి. స్వీయ నియంత్రణ లేనప్పుడు అసలు పోర్న్‌ను చూడకపోవటమే మంచిది.

 

ప్రయోగాల హోరులో...

లైంగిక తృప్తి కోసం కొత్తదనాన్ని ప్రయత్నించటం తప్పు కాదు. అయితే ఇది భాగస్వాములిద్దరికీ ఆనందకరంగా ఉండాలి. ఇబ్బంది కలిగించకూడదు. ఈ మధ్యకాలంలో రకరకాల విపరీత ధోరణుల గురించిన సమాచారం ఇంటర్నెట్‌లో విస్తృతంగా లభిస్తోంది. లైంగిక హింసను ప్రేరేపించే రకరకాల పద్ధతులు కూడా కొన్ని నీలి వెబ్‌సైట్లలో ప్రచారంలో ఉన్నాయి. కొత్తదనం పేరిట భాగస్వామికి అసౌకర్యం కలిగించటం వల్ల మానసిక అనుబంధం పలుచబడే ప్రమాదం కూడా ఉంటుంది. అరుపులు విని ఉద్రేకం పొందటం.. లైంగిక హింస ద్వారా ఆనందం పొందటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మానసిక నిపుణులను సంప్రదించాలి. ఎక్కువ మందితో కలిసి లైంగిక కార్యకలాపాలలో పాల్గొనటం.. భాగస్వాములను మార్చుకోవటం వంటి అసహజమైన ప్రయోగాల వల్ల అనేక ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయి. 


బొమ్మలతో ప్రమాదం..

స్త్రీపురుషులిద్దరికీ లైంగిక ఆనందం కలిగించే అనేక రకాల టాయ్స్‌ ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్నాయి. సిలికాన్‌తో తయారయ్యే ఈ టాయ్స్‌ పట్ల అవగాహన కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. అయితే వీటి వాడకం గురించి దంపతులిద్దరూ ముందుగా చర్చించుకోవడం అవసరం. ఒకరికి తెలియకుండా మరొకరు వీటిని వాడుకోవడంలో కూడా ఓ సమస్య ఉంటుంది. పొరపాటున వాడుతూ కంటపడితే, తమ మీద జీవిత భాగస్వామి లైంగికాసక్తి కోల్పోయారనే బాధ మొదలవుతుంది. ఆ కుంగుబాటు క్రమేపీ సెక్సువల్‌ డిస్‌ఫంక్షన్‌కూ, ఎప్పటికీ లైంగిక క్రీడలో పాల్గొనలేని జడత్వానికీ దారి తీస్తుంది. టాయ్స్‌  సహజమైన లైంగిక అనుభూతులకు ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదు. యాంత్రికంగా మారిపోయిన లైంగిక జీవితాన్ని ఉత్తేజపరచుకోవడం కోసం వీటిని వాడాలి అనుకున్నా, హద్దెరిగి నడుచుకోవాలి.


పొంచి ఉండే ప్రమాదాలు   

టాయ్స్‌ వాడకంలో శుభ్రత పాటించకపోవడం, వాటిని షేర్‌  చేసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వేధిస్తాయి.  భాగస్వామి ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా సాగే ఎటువంటి లైంగిక క్రీడ అయినా అంతిమంగా మానసిక,  లైంగిక సమస్యలకు దారి తీస్తుంది.   పోర్న్‌తో తమ లైంగిక జీవితాన్నీ, జీవిత భాగస్వాములనూ సరిపోల్చుకోవడం వల్ల దాంతప్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. సహజసిద్ధంగా పొందవలసిన లైంగిక జీవిత ఆనందం కోసం పోర్న్‌, టాయ్స్‌ల మీద ఆధారపడడం వల్ల అవి లేనిదే లైంగికతృప్తి పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది.


పరిష్కార మార్గాలు

కొన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా ఉదృతిని నియంత్రించవచ్చు. అయితే వీటిని కేవలం డాక్టర్ల సలహా మేరకే ఉపయోగించాలి. కౌన్సెలింగ్‌ ద్వారా అసలు సమస్యను కనిపెట్టి, పరిష్కరించవచ్చు. మన సమాజంలో మహిళలు తమకున్న అసౌకర్యాన్ని ఎక్కువగా చెప్పటానికి ఇష్టపడరు. దీని వల్ల అసలు లైంగిక చర్య అంటేనే అయిష్టపడే పరిస్థితులు ఏర్పడతాయి. భాగస్వాములు సైతం కనిపెట్టలేని విధంగా లైంగిక జీవితం ఇబ్బందుల పాలవుతుంది. కాబట్టి ఇబ్బందితో సర్దుకుపోకుండా, భాగస్వామికి ఆ విషయం తెలియపరచాలి. బలవంతాలకు లైంగిక జీవితంలో తావు ఉండకూడదు. లైంగిక జీవితం సంతృప్తికరంగా సాగాలంటే దంపతులు పరస్పర అంగీకారంతో మసలుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా అలవాటు వ్యసనంగా మారుతున్న విషయాన్ని ఎవరికి వారు గ్రహించాలి. లేదా వారి భాగస్వాములు తెలియపరిచే ప్రయత్నం చేయాలి. నాణ్యమైన లైంగిక జీవితాన్ని గడపలేకపోతున్నా, సెక్స్‌ కోసం పూర్తిగా పోర్న్‌, టాయ్స్‌, ఇతరత్రా ప్రేరకాల మీద ఆధారపడుతున్నా... సమస్యగా భావించి సెక్సాలజి్‌స్టను సంప్రతించాలి.


మొహమాటం కూడదు

ఈ మధ్య నన్నొక జంట కలిసింది. భర్త తన పట్ల విపరీత ధోరణిని కనబరుస్తున్నారనేది భార్య అభియోగం. పోర్న్‌ చూడడానికి అలవాటు పడిన ఆయన, అశ్లీలంగా దుస్తులు ధరించమని బలవంతం చేస్తున్నారనీ, ఆ ప్రవర్తన తనను ఇబ్బంది పెడుతోందనీ భార్య చెప్పుకొచ్చింది. భర్త ధోరణితో ఆవిడ విపరీతమైన ఒత్తిడికి లోనవుతోంది. సెక్స్‌ విషయంలో ఊహలు, కోరికలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. అయితే అవి భాగస్వామికి ఇబ్బంది కలిగించకుండా ఉన్నంత కాలం ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. భర్త ప్రవర్తన ఇబ్బందికరంగా ఉన్న విషయాన్ని ఆవిడ ప్రారంభంలోనే భర్తకు తెలియపరచి ఉంటే, సమస్య అక్కడితో ముగిసి ఉండేది. కానీ అయిష్టంగానే ఆయన చెప్పినట్టు నడుకున్నట్టు ఆవిడ మాటలను బట్టి అర్థమైంది. ఇలాంటి సందర్భాల్లో భార్యలు మౌనంగా సర్దుకుపోవడం సరి కాదు. అదే విషయాన్ని ఆవిడకు చెప్పి, దంపతులిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి, సఖ్యత కుదర్చగలిగాను.


డాక్టర్‌ షర్మిలా మజుందార్‌

కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌.

www.Doctorsharmila.in

Updated Date - 2022-02-22T21:26:07+05:30 IST