ఖాళీ కడుపుతో వ్యాయామం చేయొచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ABN , First Publish Date - 2022-07-12T17:48:21+05:30 IST

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయాలా? లేక వ్యాయామానికి సరిపడా శక్తిని సమకూర్చుకోవడం కోసం

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయొచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయాలా? లేక వ్యాయామానికి సరిపడా శక్తిని సమకూర్చుకోవడం కోసం వ్యాయామానికి ముందు ఆహారం తీసుకోవాలా? నిపుణులు ఏమంటున్నారంటే....


ఏ వ్యాయామానికి ముందైనా పొట్ట నిండుగా ఉండకూడదు. సాధారణంగా ఉదయం చేసే వర్కవుట్లు గంటకు మించి కొనసాగవు. ఈ పాటి వ్యాయామానికి సరిపడా శక్తి మన శరీరానికి ఉంటుంది. కండరాల్లో, కాలేయంలో నిల్వ ఉండే గ్లైకోజన్‌ ద్వారా వ్యాయామానికి అవసరమైన శక్తి అందుతుంది. అయితే పరగడుపున చేసే వ్యాయామం వల్ల ఒరిగే ప్రయోజనాలు, దుష్ప్రయోజనాల గురించిన సందేహాల స్పష్టత కోసం బ్రిటన్‌లోని నార్తంబ్రియా యూనివర్శిటీలో అధ్యయనాలు చేపట్టారు. ఖాళీ కడుపుతో వ్యాయామాలు చేయవచ్చా? అలా చేయడం వల్ల ఆ తర్వాత అవసరానికి మించి ఆహారం తినే అవకాశాలు ఉన్నాయా? మొత్తంగా కరిగే కొవ్వు ఎంత? ఈ మూడు ప్రశ్నలకు సమాధానాల కోసం 12 మంది పురుషుల మీద ప్రయోగాలు చేపట్టడం జరిగింది. వీరిలో ఆరుగురికి ఉదయం అల్పాహారం తినిపించి, మిగతా ఆరుగురికి తినిపించకుండా ట్రెడ్‌మిల్‌ వ్యాయామం చేయించారు. ఆ తర్వాత జరిపిన పరీక్షల్లో అల్పాహారం తిన్న అభ్యర్థుల శరీరాల్లో వ్యాయామానికి అవసరమైన శక్తి వారి శరీరంలో ముందు నుంచీ నిల్వ ఉన్న చక్కెర నిల్వల నుంచే సమకూరినట్టు తేలింది. అలాగే ఖాళీ కడుపుతో వ్యాయామం చేసినవాళ్లు ఆ తర్వాత అవసరానికి మించి ఆహారం తీసుకోలేదు. అంతేకాకుండా ఇలా ఖాళీ కడుపుతో వ్యాయామం చేసినవాళ్లలో, అల్పాహారం తీసుకున్నవారి కంటే 20ు ఎక్కువ క్యాలరీలు ఖర్చయ్యాయి. దీన్నిబట్టి ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కొవ్వు అధికంగా కరుగుతున్నట్టు తేలింది. కాబట్టి ఉదయంపూట వ్యాయామాలు చేసేవాళ్లు ఖాళీ కడుపుతోనే మొదలుపెట్టడం మేలు.

Updated Date - 2022-07-12T17:48:21+05:30 IST