కండరాల పటుత్వం కోసం...

ABN , First Publish Date - 2022-05-17T18:09:57+05:30 IST

ఒకే తరహా జీవనశైలిని ఏళ్ల తరబడి కొనసాగించే వాళ్లలో కండరాలు పట్టేయడం, శరీరంలో అసౌకర్యం తలెత్తడం లాంటివి సహజం. ఎక్కువ సమయాల పాటు

కండరాల పటుత్వం కోసం...

ఆంధ్రజ్యోతి(17-05-2022)

ఒకే తరహా జీవనశైలిని ఏళ్ల తరబడి కొనసాగించే వాళ్లలో కండరాలు పట్టేయడం, శరీరంలో అసౌకర్యం తలెత్తడం లాంటివి సహజం. ఎక్కువ సమయాల పాటు కూర్చుని లేదా నిలబడి పని చేసేవాళ్లు, వాళ్ల శరీరాల్లోని కండరాలు, ఎముకలు పటుత్వం తప్పకుండా ఉండాలంటే, ఇవిగో ఈ యోగాసనాలను సాధన చేయాలి. 


గోముఖాసనం

ఛాతీ, భుజాలు, బాహుమూలాలు, పక్కటెముకలు బలపడతాయి. ఆయా ప్రదేశాల్లోని ఒత్తిడిలు తొలగి, కండరాలు వదులవుతాయి. ఈ ఆసనం క్రమం తప్పకుండా చేస్తే భుజాలు పట్టేయడం, ఛాతీ దగ్గరి కండరాలు పట్టేయడం లాంటి సమస్యలు తొలగుతాయి. ఈ ఆసనం ఎలా వేయాలంటే....


దండాసనంలో కూర్చుని కాళ్లను కుడి కాలిని ఎడమ కాలి మీదుగా తిప్పి, బొమ్మలో చూపించినట్టుగా ఉంచాలి.

ఎడమ చేతిని వీపు వైపు మడిచి, కుడి చేతిని తల మీదుగా పైకి లేపి వంచి, ఎడమ అర  చేతిని పట్టుకోవాలి.

ఈ భంగిమలో రెండు అరచేతులు సాధ్యమైనంత దగ్గరకు రావాలి. వేళ్లు కలవాలి.

ఈ భంగిమలో నిమిషంపాటు ఉండాలి.

తర్వాత చేతులు వదలి, కాళ్ల మడత తీసి వదులు చేయాలి.

ఇదే ఆసనాన్ని చేతులు, కాళ్లు మార్చి చేయాలి. అంటే, మొదటి భంగిమలో పైన ఉన్న కాలు కిందకి, పైన ఉన్న చేయి కిందకు రావాలి.


అధోముఖ శవాసనం

మణికట్టు నుంచి చీలమండలం వరకూ ఉన్న కండరాలు, నాడులు, కీళ్లు పట్టు వదిలి కదలికలకు అనువుగా మార్చే ఆసనమిది. కాలి పిక్కలు పట్టేయడం, మడమ శూల మొదలైన నొప్పులు తొలగిపోవడంతోపాటు, తిరగబెట్టకుండా ఉంటాయి. ఈ ఆసనం ఎలా వేయాలంటే....


బాలాసనంలో కూర్చున్నట్టు మోకాళ్లు మడిచి, నడుము పూభాగాన్ని, చేతులను ముందుకు వంచి తల, చేతులను నేలకు తాకించాలి.

చేతుల ఆధారంగా నడుమును పైకి లేపి, ఆంగ్ల అక్షరం ‘వి’ ఆకారంలో శరీరాన్ని లేపాలి.

ఈ భంగిమలో మోకాళ్లను కొద్దిగా వంచి ఉంచాలి.చేతులు పూర్తిగా చాపి నేల మీద ఆధారంగా ఉంచాలి.

తల నేల మీద ఉంచిన చేతులకు మధ్య ఉండాలి. చూపు నేల వైపు ఉండాలి.


ఆంజనేయాసనం

ఈ ఆసనంతో కండరాలు, కీళ్లను దృఢపరచడంతోపాటు వాటి కదలికలను సులువు చేస్తుంది. తొట్రుపాటు, నడకలో తడబాటు లాంటి సమస్యలు ఉన్నవారు ఈ ఆసనం వేస్తే శరీరాన్ని బ్యాలెన్స్‌ చేయగలుగుతారు. మెడ, వెన్ను, తొడలు, పిక్కలు బలపడతాయి. మెట్లు ఎక్కడం తేలికవుతుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే...


అధోముఖ శవాసనం మాదిరిగానే ఉండి, కుడి కాలును ముందుకు ఉంచి కుంగాలి. ఈ భంగిమలోకి మారుతున్నప్పుడే చేతులు రెండూ నిటారుగా గాల్లోకి లేపి ఉంచాలి.

ముందుకు ఉంచిన పాదం నేల మీద సమాంతరంగా, వెనక్కి ఉంచిన పాదం మడమ లేపి ఉంచాలి.

రెండు కాళ్ల మధ్య దూరం శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసేటంత సౌకర్యంగా ఉంచాలి.

ఈ భంగిమలో 30 సెకండ్లపాటు ఉండి, తిరిగి పూర్వ స్థితికి రావాలి.

తర్వాత ఎడమ కాలును ముందుకు ఉంచి ఇదే ఆసనం వేయాలి.

Updated Date - 2022-05-17T18:09:57+05:30 IST