వర్షాకాలంలో ఇంట్లో వ్యాయామం ఇలా చేయొచ్చు!

ABN , First Publish Date - 2022-07-09T17:27:16+05:30 IST

వర్షాకాలం ప్రారంభమైంది. రోజూ ఏదో ఒక సమయంలో వర్షం పడుతూనే

వర్షాకాలంలో ఇంట్లో వ్యాయామం ఇలా చేయొచ్చు!

  • మనసుంటే మార్గముంటుందంటున్న ఫిట్‌నెస్‌ నిపుణులు


హైదరాబాద్‌ సిటీ, జూలై 8, ఆంధ్రజ్యోతి: వర్షాకాలం ప్రారంభమైంది.  రోజూ ఏదో ఒక సమయంలో వర్షం పడుతూనే ఉంది. నగర రోడ్లపై జాగింగ్‌ లేదా రన్నింగ్‌ సంగతి పక్కన పెడితే వాకింగ్‌ చేసే పరిస్థితే లేదు. అలాగని జిమ్‌కు వెళ్దామా అని అంటే... జోరుగా కురుస్తోన్న వర్షంలో అవసరమా అనే సందేహం! కొవిడ్‌ కాలంలో ఫిట్‌నెస్‌ పట్ల ఆసక్తి పెరిగిన వేళ అసలు వ్యాయామాలు చేయకపోతే ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందోననే భయం వెంటాడుతుంది. ఇప్పటికే ఫిట్‌నెస్‌ కోసం ఆన్‌లైన్‌ యాప్‌ల బాట పట్టిన వారు ఏదో ఒకటి చేస్తున్నారు కానీ అలా అనుసరించని వారి సంగతి ప్రశ్నార్థకమే. ఈ భయాలకు చెక్‌ పెట్టి అతి సులభమైన వ్యాయామాలతోనే మీ శరీరాకృతిని మలుచుకోవచ్చంటున్నారు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ హరీష్‌. ఇందుకు ఆయన ఇస్తున్న సూచనలేమిటంటే..


ఎక్కి దిగితే చాలు... 

ఒకరోజు వర్కవుట్‌ చేయకపోతే వచ్చే నష్టమేమీ లేదు. కానీ మానసికంగా పడే ఆందోళన మాత్రం వారిని మరింతగా కుంగదీస్తుంది. అలాంటి వారు మెట్లు ఎక్కి దిగడం ద్వారా తమ వర్కవుట్‌ పూర్తి చేయవచ్చు అపార్ట్‌మెంట్‌ లైఫ్‌లో లిఫ్ట్‌లు వాడటం అలవాటు అయిన తరువాత మెట్లు ఎక్కడం చాలా మంది మర్చిపోయారు. కానీ మెట్లు ఎక్కి దిగడం అనేది కేలరీలు ఖర్చు కావడానికి మంచి వ్యాయామం. రెండు మూడు మెట్లు ఒకేసారి ఎక్కడం కాకుండా సాధారణంగా మెట్లపై జాగింగ్‌ చేస్తున్నట్లుగా ఎక్కడం ద్వారా మరిన్ని కేలరీలు ఖర్చు చేయవచ్చు. నిజానికి ఏ క్లైంబింగ్‌ వ్యాయామం అయినా సరే ఎక్కువ కేలరీలు బర్న్‌ కావడానికి దోహదపడతాయి. ఓ విధంగా చెప్పాలంటే దాదాపు 80 శాతం బాడీ వర్కవుట్స్‌ను ఈ మెట్ల వ్యాయామం అందిస్తుంది. ట్రెడ్‌మిల్‌తో పోలిస్తే ఇది కాస్త మంచి వ్యాయమం. మెట్లు ఎక్కితే చేతులు, భుజాలు, చెస్ట్‌, బ్యాక్‌, లోయర్‌ బాడీ, కాళ్లు... అన్ని అవయవాలు పని చేస్తాయి. కాకపోతే మెట్ల మీద వర్షపు నీరు ఉందేమో చూసుకుని నడక ప్రారంభించడం మంచిది.


10 మినిట్‌ వర్కవుట్స్‌ 

 వర్షాకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఫిట్‌నెస్‌ రొటీన్‌ ఇది. 10 నిమిషాల పాటు క్రంచెస్‌, లెగ్‌ లిఫ్ట్స్‌, కొన్ని అబ్‌డొమెన్‌-టోనింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. అయితే రోజూ ఒకే తరహా వ్యాయామాలు చేయడం కాకుండా  వైవిధ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిప్స్‌, లెగ్స్‌కు స్క్వాట్స్‌, జంపింగ్‌ జాక్స్‌, స్టెపప్‌, కిక్స్‌ సహాయపడితే, అప్పర్‌ బాడీకు వాటర్‌ బాటిల్స్‌ లిఫ్టింగ్‌ ద్వారా తగిన వ్యాయామం పొందవచ్చు.


డ్యాన్స్‌ కూడా చేయొచ్చు

నృత్యం కూడా మంచి వ్యాయామమే.  శాస్త్రీయ నృత్యమైనా, వెస్ట్రన్‌ డ్యాన్స్‌ అయినా శరీరానికి అవసరమైన ఫిట్‌నె్‌సను అందించేటటువంటివే! కనీసం అరగంట పాటు ఏకధాటిగా డ్యాన్స్‌ చేయడం వల్ల కూడా మనకు రోజుకు అవసరమైన వ్యాయామం లభిస్తుంది.


యోగా.. ధ్యానం..

జిమ్‌కు వెళ్లడం కుదరని సమయంలో యోగా అత్యుత్తమ అవకాశం. అందునా త్రికోణాసనం, భుజంగాసనం లాంటివి  తగిన ప్రశాంతతనూ అందిస్తాయి.


కుర్చీతో కుస్తీ..!

కదలకుండా 8 గంటలు కుర్చీలో కూర్చుని పనిచేయడం ఇబ్బందే కానీ మీ సీటునే మీ ఫిట్‌నెస్‌ ఎక్విప్‌మెంట్‌గా మలచవచ్చు. కుర్చీతో కార్డియో వ్యాయామాలు కూడా చేయొచ్చు.  కుర్చీలో నుంచి లేచి కూర్చోవడం కూడా మంచి వ్యాయామమే. ఇక కుర్చీలో నుంచి లేచి అటూ ఇటూ తిరగడం వల్ల కాళ్లకు కూడా తగిన వ్యాయామం లభిస్తుంది. 


కమర్షియల్‌ కార్డియో.. 

ఇంటికి వచ్చిన తర్వాత టీవీలకు అతుక్కుపోవడం అందరికీ అలవాటే. టీవీల్లో వచ్చే కమర్షియల్‌ యాడ్స్‌ను కూడా కష్టపడి చూసేయడం మనలో చాలామందికి అలవాటు. ఈ కమర్షియల్‌ యాడ్స్‌నే ఎక్సర్‌సైజ్‌లకు తగిన సమయంగా భావించండి. సాధారణంగా యాడ్స్‌లో టీవీల్లో ఒకటిన్నర నిమిషం వస్తుంటాయి. ఈ సమయంలో 30 జంపింగ్‌ జాక్స్‌ లేదంటే 20 క్రంచెస్‌ లేదా స్క్వాట్స్‌ చేయడానికి ఉపయోగించండి. ఏ ఎక్సర్‌సైజ్‌ అయినా ఈ బ్రేక్స్‌లో చేయడం వల్ల బాడీ కూడా టోన్‌ అవుతుంది. 

Updated Date - 2022-07-09T17:27:16+05:30 IST