Government hospitals: సర్జరీలు సరే.. సౌకర్యాలేవి?

ABN , First Publish Date - 2022-11-14T11:15:26+05:30 IST

అది ఖమ్మంలోని మాతాశిశు సంక్షరణ కేంద్రం. అక్కడ రోజుకు 300 దాకా ఓపీ ఉంటుంది. రోజూ 25-30 ప్రసవాలవుతాయి. కానీ అక్కడ కేవలం 120 ఉన్నాయి. అవి చాలడం లేదు. రోజూ వచ్చే అంతమంది

Government hospitals: సర్జరీలు సరే.. సౌకర్యాలేవి?
సౌకర్యాలేవి?

అన్నీకూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలంటున్న సర్కారు

పైగా ఆస్పత్రుల మధ్య శస్త్రచికిత్సలకు పోటీ పెడుతున్న వైనం

ఏడేళ్లలో 17లక్షల సర్జరీలు.. సౌకర్యాలు అంతంతమాత్రం

అధునాతన యంత్రాలున్నా వైద్యులు లేని పరిస్థితి

ఫలితంగా పరీక్షలు, ఆపరేషన్ల నిర్వహణ ఆలస్యం

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): అది ఖమ్మంలోని మాతాశిశు సంక్షరణ కేంద్రం. అక్కడ రోజుకు 300 దాకా ఓపీ ఉంటుంది. రోజూ 25-30 ప్రసవాలవుతాయి. కానీ అక్కడ కేవలం 120 ఉన్నాయి. అవి చాలడం లేదు. రోజూ వచ్చే అంతమంది గర్భిణీల్లో కనీసం 100 మందికి అలా్ట్రసౌండ్‌ స్కానింగ్స్‌ చేయాల్సివస్తోంది. కానీ అక్కడ ఉంది ఒకే ఒక్క రేడియాలజిస్టు. ఆమె సెలవు పెడితే ఆ రోజుకు స్కానింగ్‌లు లేనట్లే. ఫలితంగా ఎంతో దూరం నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చిన గర్భిణులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన పరీక్షలు, చికిత్సలుచేసే అత్యాధునిక క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఒక్క కార్డియాలజిస్టును కూడా రిక్రూట్‌ చేయలేదు. సుమారు 10 కోట్ల వ్యయంలో ఏర్పాటు చేసిన ఆ క్యాథ్‌ ల్యాబ్‌ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. వాటి వైర్లను ఎలుకలు కొరికేయడంతో పాడైపోతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో ఆప్తామాలజిస్టు ఉన్నారు. కానీ అక్కడ కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు జరగడం లేదు. ఆపరేషన్‌ థియేటర్‌ లేకపోవడం వల్ల సర్జరీలు జరగడం లేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని సర్కారీ దవాఖానాల్లో నెలకొన్న పరిస్థితికి అద్దం పట్టే ఉదాహరణలివి!! ఒకవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు పెంచాలంటూ డాక్టర్లకు వైద్యశాఖ టార్గెట్లు పెడుతోంది. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా సర్కారు దవాఖానాలకే వచ్చేలా చూడాలని స్పష్టం చేస్తోంది.

ఆ మేరకు వైద్యుల పనితీరు మెరుగుపడాలని పదేపదే హెచ్చరిస్తోంది. అయితే అదే సమయంలో ఆస్పత్రుల్లో అందుకు తగ్గట్లు సౌకర్యాలను కల్పించడం లేదు. అన్ని జిల్లాల్లోనూ కాటరాక్టు సర్జరీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ మెజారిటీ జిల్లా ఆస్పత్రుల్లో కంటికి సంబంధించిన ఆపరేషన్‌ థియేటర్లు లేవు. అలాగే యంత్రపరికరాలున్నచోట అందుకు తగ్గట్లుగా స్పెషలిస్టు వైద్యులుండటం లేదు. ఉదాహరణకు ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిల్లో క్యాథ్‌ల్యాబ్‌ ఉన్నా కార్డియాలజిస్టు లేరు. రోగుల రద్దీకి తగ్గట్లుగా వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది ఉండటం లేదు. బోధనాస్పత్రుల్లో సుమారు 40-50 శాతం వైద్య పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అలాగే నర్సింగ్‌ పోస్టులు కూడా అంతేస్థాయిలో ఖాళీలున్నాయి. పైగా ఇప్పుడు కొత్త మెడికల్‌ కాలేజీలు రావడంతో అటు వైద్యులు, ఇటు నర్స్‌ల పోస్టులను భారీగా నియమాకాలు చేపట్టాల్సి ఉంది.

మునుపు సిజేరియన్లే ఎక్కువ కానీ..

గతంలో సర్కారు దవాఖానాల్లో జరిగే సర్జరీల్లో 80 శాతం సీజేరియన్‌ ఆపరేషన్లే జరిగేవి. మిగతా 20 శాతంలో ఎమర్జెన్సీ జనరల్‌ సర్జరీలు, అత్యవసర ఆర్థోపెడిక్‌ సర్జరీలుండేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. సీజేరియన్స్‌ 50 శాతమే జరిగితే మిగిలిన సర్జరీలు మరో 50 శాతం జరుగుతున్నాయి. జనరల్‌ సర్జరీ విభాగంలో హెర్నియా, పేగుపూత, థైరాయిడ్‌, కేన్సర్‌తో పాటు ముందస్తు ప్రణాళికతో చేసే శస్త్రచికిత్సలను చేస్తున్నారు. గతంలో ఈఎన్‌టీకి సంబంధించి జిల్లాల్లో గొంతులోని టాన్సిల్‌ ఆపరేషన్స్‌ పెద్దగా చేసేవారు కాదు. ప్రస్తుతం ఆ సర్జరీలు రెట్టింపయ్యాయి. మునుపు ఆర్థో సర్జరీకి సంబంధించి కేవలం ఫ్యాక్చర్‌ సర్జరీలే జరిగేవి. ఇప్పుడు వెన్నెముకకు సంబంధించిన వాటితో పాటు మోకీలు మార్పిడిలు కూడా జరుగుతున్నాయి. అయితే మెజారిటీ బోధనాస్పత్రులు పాత ఆపరేషన్‌ థియేటర్లతోనే నెట్టుకొస్తున్నాయి. ఓపీ, ఐపీ పెరుగుతన్నప్పటికీ థియేటర్ల సంఖ్య పెరగడం లేదు. దాంతో శస్త్రచికిత్సలు ఆలస్యమవుతున్నాయి. అయితే మౌలిక సదుపాయాల లేమితో సర్జరీల జాప్యంతో కొందరు బాధితుల ఆరోగ్యం దెబ్బతింటోంది. ప్రభుత్వ సూచన మేరకు సర్జరీలు పెంచేందుకు తాము సిద్ధంగానే ఉన్నప్పటికీ, అందుకు అవసరమైన సౌకర్యాల లేకపోవడంతో ప్రైవేటుతో పోటీపడలేకపోతున్నామని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని ఆస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్‌, సిటీ స్కాన్‌ మిషన్లను ఏర్పాటు చేశారు.

అయితే అవసరమైన వైద్యసిబ్బంది భర్తీని మరిచారు. అలాగే కొన్ని ప్రభుత్వాస్పత్రుల్లోని ఆపరేషన్ల థియేటర్లలో కనీసం చేతులు క్లీన్‌ చేసుకునేందుకు అవసరమైన బెటాడిన్‌ స్కృబ్‌ కూడా లేవని వైద్యులు ఆరోపిస్తున్నారు. పాత దుస్తులనే సర్జరీలకు వేసుకోవాల్సి వస్తున్నదంటున్నారు. కొన్నిసార్లు అవి చినిగిపోయి ఇబ్బందికరంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్లలో 17 లక్షల సర్జరీలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క బోధనాస్పత్రుల్లోనే 2015 నుంచి 2021 వరకు 5,69,665 మేజర్‌ శస్త్రచికిత్సలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో థైరాయిడ్‌, గాల్‌ బ్యాడర్‌, ఆర్థోఫెడిక్‌, ఈఎన్టీ విభాగాలకు చెందిన వివిధ రకాల ఆపరేషన్లు జరిగాయి. ఇక 11,67,538 మైనర్‌ సర్జరీలు జరిగాయి. వేలు, కాలి, స్కిన్‌ డ్యామేజ్‌ తదితరవి వీటిలో ఎక్కువగా ఉన్నాయి. ఇక సూపర్‌ స్పెషాలిటీకి చెందిన కిడ్నీ, లివర్‌, సర్జరీల సంఖ్య కూడా పెరిగాయి. అయితే అధునాతన సౌకర్యాలు పెరిగితే మరిన్ని ఆపరేషన్లు పెరుగుతాయని వైద్యవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

సర్జరీల కోసం టార్గెట్లు

మెరుగైన వైద్యసేవల్లో భాగంగా సర్జరీలు ఎక్కువగా జరిగేలా ప్రభుత్వ ఆస్పత్రుల మధ్యే సర్కారు పోటీ పెడుతోంది. ఫలితంగా బోధనాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు పెరుగుతున్నాయి. కానీ సౌకర్యాలు పెరగడం లేదు. ప్రభుత్వం విధిస్తున్న టార్గెట్లతో టీచింగ్‌ ఆస్పత్రుల్లో సర్జరీలు ఎక్కువగా చేస్తున్నారు. ఇటీవల నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకేరోజు ఏకంగా 54 ఆపరేషన్లు చేశారు. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం, ఇతర బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనూ గతంతో పొల్చితే సర్జరీలు పెరిగాయి. ఇటీవల ఒక జిల్లాల్లో ఒకేరోజు ఏడెనిమిది మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. దీన్ని దృష్టిలోపెట్టుకొని మరో జిల్లా ఆస్పత్రిలో ఒకే రోజు ఏకంగా పది మోకీలు మార్పిడి సర్జరీలు జరిగాయి. అయితే ఒకేరోజు ఇన్ని సర్జరీలు చేయడం ప్రమాదకరం అని, ఒకవేళ ఇన్ఫెక్షన్స్‌ సోకితే ఆపరేషన్‌ చేయించుకున్న వారందరికి శాశ్వతంగా కాళ్లు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఆస్పత్రుల మధ్య, వైద్యుల మధ్య పోటీ పెడుతోంది.

Updated Date - 2022-11-14T11:17:30+05:30 IST