గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఇలా చేయకూడదు...
ABN , First Publish Date - 2022-03-01T18:27:17+05:30 IST
ప్రాణాయామం ప్రాణాధారమైన ఆక్సిజన్ సరఫరా సవ్యంగా జరగడానికి తోడ్పడుతుంది. క్రమం తప్పక ఉజ్జయి ప్రాణాయామాన్ని సాధన చేస్తే, శ్వాస నెమ్మదించి, నాడీ శుద్ధి జరిగి రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
ఆంధ్రజ్యోతి(01-03-2022)
ప్రాణాయామం ప్రాణాధారమైన ఆక్సిజన్ సరఫరా సవ్యంగా జరగడానికి తోడ్పడుతుంది. క్రమం తప్పక ఉజ్జయి ప్రాణాయామాన్ని సాధన చేస్తే, శ్వాస నెమ్మదించి, నాడీ శుద్ధి జరిగి రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
ఉజ్జయి అంటే?
‘ఉజ్’ అంటే పైకి కదలడం, ‘జయి’ అంటే విజయం. ఉజ్జయి అంటే స్థూలంగా విజయవంతం అని అర్థం. ఉజ్జయి ప్రాణాయామం అంటే, విజయవంతమైన శ్వాస అని అర్థం. ఈ ప్రాణాయామం ద్వారా ఊపిరితిత్తులు పూర్తిగా, అన్ని దిక్కులకూ విప్పారతాయి. ఛాతీ పైకి లేచి, విస్తరిస్తుంది.
ఓషన్ బ్రీత్
ఉజ్జయి ప్రాణాయామం ఊపిరితిత్తుల్లోకి చేరుకోడానికంటే ముందే గాలిని వెచ్చబరుస్తుంది. ఫలితంగా శరీరంలో వేడి జనించి, టాక్సిన్లు విసర్జితమవుతాయి. శ్వాస పీల్చుకోవడం, వదలడం నాశికా రంథ్రాల ద్వారానే జరుగుతుంది. గాలిని నేరుగా గొంతు లోపలికి పీల్చుకోవడం మూలంగా, ఆ ప్రదేశంలోని కండరాలు కుంచించుకుని హిస్స్ మనే శబ్దం వెలువడుతుంది. ఆ శబ్దం సముద్రపు హోరును తలపించేలా ఉంటుంది కాబట్టి ఈ శ్వాసను ఓషన్ బ్రీత్ అని కూడా అంటారు. ఇలా గొంతులో గాలి ప్రవహించే మార్గం ఇరుకుగా మారేకొద్దీ, గాలి ప్రవాహ వేగం పెరుగుతుంది. అయితే గొంతు నుంచి వెలువడే శబ్దం సాధన చేసే వ్యక్తికి మాత్రమే వినిపించేలా తక్కువ శబ్దాన్ని వెలువరించాలి. అంతకంటే పెద్ద శబ్దం వస్తుందంటే, స్వరపేటికలు ఒత్తిడికి లోనవుతున్నాయని అర్థం చేసుకోవాలి. నాశికా రంధ్రాల గుండా గాలి, లోపలికి, బయటకు ప్రవహించాలి. పెదవులను మూసి ఉంచాలి. శ్వాస దీర్ఘంగా, సూక్ష్మంగా, ఊపిరితిత్తుల్లోని ప్రతి కణానికీ ఆక్సిజన్ సోకేలా సాగాలి. గాలిని లోపలికి పీల్చుకున్నప్పుడు, ఊపిరితిత్తులు నడుము రెండు పక్కలకూ, వెన్ను వైపుకూ, రెండు కాలర్ బోన్స్ వైపుకూ విస్తరిస్తాయి. ఫలితంగా అంతర్గత అవయవాలు మర్దనకు గురవుతాయి. సరిపడా ప్రాణాధారమైన ఆక్సిజన్ శరీరంలోకి చేరుకుంటుంది. ఉజ్జయి ప్రాణాయామం రోజుకు ఒకసారి 10 నుంచి 12 నిమిషాల పాటు సాధన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అయితే ప్రారంభంలో సాధన కష్టంగా అనిపించినా, క్రమేపీ తేలికవుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
శ్వాస వేగం నెమ్మదిస్తుంది కాబట్టి, ఉజ్జయి ప్రాణాయామంతో ఆయుష్షు పెరుగుతుంది. ఈ ప్రాణాయామంతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు మరెన్నో ఉన్నాయి. శరీరంలో శక్తి మార్గాలైన నాడులు శుద్ధి అవుతాయి మానసిక ఏకాగ్రత, ఆలోచనల్లో స్పష్టత వస్తుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది చర్మపు ఆరోగ్యం మెరుగవుతుంది నాడీ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది కంటి నిండా నిద్ర పడుతుంది స్వాంతన చేకూరడంతో పాటు మనసు, శరీరం ఉపశమనం చెందుతాయి. సైనస్ ఒత్తిడి తొలుగుతుంది. తలనొప్పులు తగ్గుతాయి. జీర్ణ, నాడీ వ్యవస్థలు బలపడతాయి.
జాగ్రత్తలు
గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఈ ప్రాణాయామంలో బంధ, శ్వాస నిలిపి ఉంచడం లాంటివి కలిపి సాధన చేయకూడదు. తల తిరిగితే, సాధనను ఆపి, మామూలుగా గాలి పీల్చుకోవాలి. ప్రాణాయామం చేస్తున్నప్పుడు గొంతును బిగపట్టకూడదు. పీల్చుకునే గాలి మోతాదును ఎటువంటి పరిస్థితుల్లోనూ బలవంతంగా అవసరానికి మించి పెంచకూడదు. శ్వాస స్థిరంగా, నెమ్మదిగా, లయబద్ధంగా సాగాలి.