యోగా... ఒత్తిడి పోగా!
ABN , First Publish Date - 2022-01-18T18:41:06+05:30 IST
వెన్నుకు స్వస్థత కలిగించి, ఒత్తిడిని తొలగించే ఆసనమిది. భుజాలు, వెన్ను, కటి కండరాలు విశ్రాంతి పొందడం మూలంగా ఉపశమనం కలుగుతుంది.
ఆంధ్రజ్యోతి(18-01-2022)
సుప్తబంధ కోణాసనం
వెన్నుకు స్వస్థత కలిగించి, ఒత్తిడిని తొలగించే ఆసనమిది. భుజాలు, వెన్ను, కటి కండరాలు విశ్రాంతి పొందడం మూలంగా ఉపశమనం కలుగుతుంది. ఫలితంగా మనసూ ప్రశాంతమవుతుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే...
రెండు బ్లాక్స్‌ను సాలంబ భరద్వాజాసనంలో ఉంచినట్టుగా అమర్చి, దిండును ఏటవాలుగా ఉంచాలి.ఆ రెండు బ్లాక్స్‌కు వెన్ను ఆనించి వెల్లకిలా పడుకోవాలి. ఈ భంగిమలో తల ఎత్తులో, మిగతా శరీర భాగం దిగువకు ఉంటుంది.రెండు కాళ్లను మోకాళ్ల దగ్గరకు మడిచి సీతాకోకచిలుక ఆకారంలో ఉంచాలి. ఈ భంగిమలో రెండు పాదాలు ఒకదాన్నొకటి తాకాలి.మోకాళ్లు నేలకు ఆనకుండా తొడల దగ్గర ఆసరా కోసం బ్లాక్స్ ఉంచుకోవచ్చు.ఈ భంగిమలో 15 నిమిషాలు కళ్లు మూసుకుని పడుకోవాలి.
విపరీత కారిణి!
ఒత్తిడి, ఆందోళనలకు ఈ ఆసనం విరుగుడుగా పని చేస్తుంది. ఈ ఆసనంలో కొద్ది నిమిషాలు గడిపినా ఫలితం ఎంతో అధికంగా ఉంటుంది. ఒత్తిడి, వ్యాకులతలు తొలగి మనసు ప్రశాంతమవుతుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే..చాపమీద వెల్లకిలా పడుకుని కాళ్లు రెండు నిటారుగా పైకి లేపాలి.ఇలా లేపినప్పుడు నడుము అడుగున ఆసరాగా బ్లాక్ ఉంచుకోవచ్చు.రెండు చేతులు నేలమీద ఉంచి, అరచేతులు బోర్లించి ఉంచాలి.ఈ భంగిమలో కాళ్లు రెండు నిటారుగా నిలిపేటప్పుడు మోకాళ్ల దగ్గర కొద్దిగా వంచవచ్చు.ఈ భంగిమలో కనీసం ఐదు నిమిషాల పాటు కదలకుండా ఉండాలి.
సాలంబ భరద్వాజాసనం
మనసును నెమ్మదింపచేసి, శక్తిని పుంజుకోగలిగేందుకు ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వేసినప్పుడు ఉదరానికి దొరికే ఆసరా వల్ల మనసులో చెలరేగే గందరగోళం సద్దుమణిగి, ప్రశాంతత కలుగుతుంది. ఈ ఆసనం ఇలా వేయాలి..నేలమీద మ్యాట్ పరుచుకుని, తలవైపు కొద్దిగా పెద్దగా ఉన్న బ్లాక్, దానికి అరడుగు దిగువన ఎత్తు తక్కువగా ఉన్న మరో బ్లాకును ఉంచాలి. ఆ రెండింటి మీద ఏటవాలుగా దిండును ఉంచి, దాని మీదకు ఒరిగి పడుకోవాలి.ఈ భంగిమలో కాళ్లు రెండూ పక్కకు మడిచి ఉంచాలి. చేతులతో దిండును కౌగిలించుకుని, తలను దిండుకు ఆనించి పడుకోవాలి.ఈ భంగిమలో ఐదు నిమిషాలు ఉండి, తిరిగి రెండో వైపు కూడా ఇలాగే చేయాలి.