జీవన నాణ్యతను మెరుగుపరిచే యోగా
ABN , First Publish Date - 2022-06-21T19:45:00+05:30 IST
యోగాను చికిత్సగా ఆచరించే విధానం 20వ శతాబ్దం ఆరంభంలోనే మొదలైంది. యోగాసనాలు శరీరాన్నీ, ధ్యానం మనసునీ నియంత్రించి, జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి...
యోగాను చికిత్సగా ఆచరించే విధానం 20వ శతాబ్దం ఆరంభంలోనే మొదలైంది. యోగాసనాలు శరీరాన్నీ, ధ్యానం మనసునీ నియంత్రించి, జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి.
యాంగ్జయిటీ, డిప్రెషన్
ఒత్తిడికి లోనైనప్పుడు శరీరంలో చోటుచేసుకునే మార్పులను నియంత్రించటం ద్వారా ఆ ప్రభావం శరీరంపై పడకుండా యోగా అడ్డుకుంటుంది. యోగా వల్ల స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్ పనితీరు క్రమబద్ధమై రక్తపోటు తగ్గటం, గుండె స్థిరంగా కొట్టుకోవటం, శ్వాస మెరుగవటం లాంటి లక్షణాలు మొదలవుతాయి. వీటి వల్ల ఎలాంటి మందుల అవసరం లేకుండానే, ఆందోళన, డిప్రెషన్‌లాంటి మానసిక రుగ్మతలు నయమవుతాయి.
ఙ్ఞాపకశక్తి, ఏకాగ్రత
జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులు, మానసిక ఒత్తిడులు దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనుల మీద ఏకాగ్రత లోపించటానికి కారణమవుతూ ఉంటాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమవుతూ ఉంటాం. యోగా మనసులోని గజిబిజి ఆలోచనలను పారదోలి పంచేంద్రియాలకు స్వాంతన అందిస్తుంది. మెదడులోని నిరంతర గందరగోళాన్ని వదిలించి, ధ్యాసను మళ్లిస్తే ఏకాగ్రత కుదరటంతోపాటు ఙ్ఞాపకశక్తి మెరుగవుతుందని స్వానుభవంలో తెలుస్తుంది. ఇది యోగాతోనే సాధ్యం.
ఎముకలు, కండరాలు
యోగాసనాల ద్వారా కండరాలు, ఎముకలు, కీళ్లు వాటి పూర్తి సామర్ధ్యం మేరకు పని చేస్తాయి. యోగా వల్ల కీళ్ల మధ్య ఉండే మెత్తని మృదులాస్థి సాగి, దగ్గరవుతూ ఉంటుంది. ఇలా మరే వ్యాయామంలో జరిగే అవకాశమే లేదు. ఇలా యోగాలో జరగటం వల్ల కార్టిలేజ్‌కు కొత్త పోషకాలు అంది, కదలికలకు అనుగుణంగా కీళ్లు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా వంగగలుగుతాయి. ఫలితంగా మృదులాస్థి క్షీణించి కీళ్లు అరిగిపోవడమనే సమస్య తలెత్తదు.
వెన్ను బలవర్ధకం
వెన్నుపూసల మధ్య ఉండే స్పైనల్ డిస్క్‌లు దగ్గరవుతూ, దూరమవుతూ నాడులకు తగిన చేతనను అందిస్తాయి. యోగాసనాల్లోని ముందుకు, వెనక్కు వంగే, మెలితిరిగే భంగిమల వల్ల వెన్నుపూసల మధ్య ఫ్లెక్సిబిలిటీ మెరుగై పటుత్వం సమకూరుతుంది.
రోగనిరోధక శక్తి
వివిధ యోగాసనాల ద్వారా కండరాలను సాగదీయటం వల్ల లింఫ్ గ్రంథుల స్రావాలు పెరుగుతాయి. ఇమ్యూన్ సెల్స్‌తో నిండి ఉండే ఈ స్రావాల విడుదలతో ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే గుణం, క్యాన్సర్ కణాల నాశనం, కణాల పనివల్ల విడుదలయ్యే వ్యర్ధాల విసర్జనలు జరుగుతాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
మధుమేహం
కార్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్ స్రావాలను నియంత్రించటం, బరువు తగ్గించటం, ఇన్సులిన్‌కు స్పందించే గుణాన్ని పెంచటం ద్వారా యోగా చేసే మధుమేహుల చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా మధుమేహంతో లింకయి ఉండే గుండె పోటు, కిడ్నీ ఫెయిల్యూర్‌లాంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తవు.
నాడీ వ్యవస్థ
యోగాను నాడుల పనితీరు మెరుగుపరచటానికి కూడా ఉపయోగించవచ్చు. రాత్రుళ్లు నిద్ర పట్టనప్పుడు రిలాక్సేషన్ కోసం, మనసును స్వాధీనంలో ఉంచుకోవటం కోసం కూడా యోగాభ్యాసాన్ని సాధన చేయొచ్చు.