చికిత్సకు లొంగని వ్యాధులు కూడా ఇలా చేస్తే నయమవుతాయి..
ABN , First Publish Date - 2022-03-22T18:24:35+05:30 IST
యోగాసనాలు శరీరాన్నీ, ధ్యానం మనసునీ నియంత్రించి, జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. సాధారణ చికిత్సకు లొంగని కొన్ని వ్యాధులు యోగాభ్యాసంతో అదుపులోకొస్తున్నట్టు పలు పరిశోధనల్లో రుజువైంది.
ఆంధ్రజ్యోతి(22-03-2022)
యోగాసనాలు శరీరాన్నీ, ధ్యానం మనసునీ నియంత్రించి, జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. సాధారణ చికిత్సకు లొంగని కొన్ని వ్యాధులు యోగాభ్యాసంతో అదుపులోకొస్తున్నట్టు పలు పరిశోధనల్లో రుజువైంది.
యాంగ్జయిటీ, డిప్రెషన్
ఒత్తిడికి లోనయినప్పుడు శరీరంలో జరిగే మార్పులను నియంత్రించటం ద్వారా ఆ ప్రభావం శరీరంపై పడకుండా కాపాడటంలో యోగా సమర్థనీయమైనది. యోగా వల్ల స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్ పనితీరు క్రమబద్ధమై రక్తపోటు తగ్గటం, గుండె స్థిరంగా కొట్టుకోవటం, శ్వాస మెరుగవటంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటి వల్ల ఎలాంటి మందులతో పనిలేకుండానే ఆందోళన, డిప్రెషన్‌లాంటి మానసిక రుగ్మతలు యోగాతో అదుపులోకొస్తాయి.
ఙ్ఞాపకశక్తి, ఏకాగ్రత
జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులు, మానసిక ఒత్తిడులు దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనుల మీద ఏకాగ్రత లోపించటానికి కారణమవుతూ ఉంటాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమవుతూ ఉంటాం. యోగా మనసులోని గజిబిజి ఆలోచనలను పారదోలి పంచేంద్రియాలకు సాంత్వన అందిస్తుంది. మెదడులోని నిరంతర గందరగోళాన్ని వదిలించి ధ్యాసను మళ్లిస్తే ఏకాగ్రత కుదరటంతోపాటు ఙ్ఞాపకశక్తి మెరుగవుతుందని స్వానుభవంలో తెలుస్తుంది. ఇది యోగాతోనే సాధ్యపడుతుంది.
ఎముకలు, కండరాలు
యోగాసనాల ద్వారా కండరాలు, ఎముకలు, కీళ్లు వాటి పూర్తి సామర్ధ్యానికి తగ్గట్టు వాడే వీలుంటుంది. యోగాసనాల వల్ల కీళ్ల మధ్య ఉండే మెత్తని మృదులాస్థి సాగి, దగ్గరవుతూ ఉంటుంది. ఇలా యోగాలో జరగటం వల్ల కార్టిలేజ్‌కు కొత్త పోషకాలు అంది,, కదలికలకు అనుగుణంగా కీళ్లు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా వంగగలుగుతాయి. ఫలితంగా మృదులాస్థి క్షీణించి కీళ్లు అరిగిపోవటమనే సమస్య తలెత్తదు.
వెన్ను పటిష్టం...
వెన్నుపూసల మధ్య ఉండే స్పైనల్ డిస్క్‌లు దగ్గరవుతూ, దూరమవుతూ నాడులకు తగిన చేతననందిస్తాయి. యోగాసనాల్లోని ముందుకు, వెనక్కు వంగే, మెలితిరిగే భంగిమల వల్ల వెన్నుపూసల మధ్య ఫ్లెక్సిబిలిటీ మెరుగై, శరీర పటుత్వం సమకూరుతుంది.
రోగనిరోధక శక్తి
వివిధ యోగాసనాల ద్వారా కండరాలను సాగదీయటం వల్ల లింఫ్ గ్రంథుల స్రావాలు పెరుగుతాయి. ఇమ్యూన్ సెల్స్‌తో నిండి ఉండే ఈ స్రావాల విడుదలతో ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే గుణం, క్యాన్సర్ కణాల నాశనం, కణాల పనివల్ల విడుదలయ్యే వ్యర్ధాల విసర్జనలు జరుగుతాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
మధుమేహం
కార్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్ స్రావాలను నియంత్రించటం, బరువు తగ్గించటం, ఇన్సులిన్‌కు స్పందించే గుణాన్ని పెంచటం ద్వారా యోగా సాధన చేసే మధుమేహుల చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా మధుమేహంతో లింక్ అయి ఉండే గుండె పోటు, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తవు.
నాడీ వ్యవస్థ
యోగాతో నాడుల పనితీరును మెరుగుపరచుకోవచ్చు. రాత్రుళ్లు నిద్ర పట్టనప్పుడు రిలాక్సేషన్ కోసం, మనసును స్వాధీనంలో ఉంచుకోవటం కోసం కూడా యోగాభ్యాసాన్ని సాధన చేయొచ్చు.
యోగా భంగిమలు - ప్రభావాలు
యోగా భంగిమల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
భరద్వాజాసనం: ఈ ఆసనంతో వెన్నెముక, కటి కండరాలు, ఎముకలు బలపడతాయి.
సేతుబంధనం: మెదడును నెమ్మదించి, అలసిన కాళ్లకు ఉపశమనమిస్తాయి.
మార్జర్యాసనం: వెన్ను, ఉదరంలోని అవయవాలు మర్దన అవుతాయి.
అథోముఖ శవాసనం: పూర్తి శరీరం ఉల్లాసభరితమవుతుంది.
అగ్నిస్థంభాసనం: సయాటిక్ నరంతో సంబంధమున్న పిరుదుల కండరాలు స్ట్రెచ్ అవుతాయి.
అర్థ మత్సేంద్రాసనం: వెన్నును బలపరిచి, ఆకలిని పెంచే అవయవాలను ప్రేరేపిస్తుంది.
అర్ధచంద్రాసనం: కాళ్లు, మడమలు బలపడతాయి.
ధనురాసనం: నడుము కింది భాగం, చేతులు శక్తివంతమవుతాయి.
హాలాసనం: బడలిక వదిలి మంచి నిద్ర పడుతుంది.
సుఖాసనం: రుతుస్రావ నొప్పిని నివారిస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది.