అక్షత.. బ్రిటిష్‌ రాణి కన్నా రిచ్‌!

ABN , First Publish Date - 2022-10-26T04:37:32+05:30 IST

రిషి ప్రధాని పదవికి పోటీ పడినప్పుడు.. ఆయన కన్నా ఎక్కువగా అక్షత పేరే అక్కడి మీడియాలో మార్మోగింది.

అక్షత.. బ్రిటిష్‌ రాణి కన్నా రిచ్‌!

న్యూఢిల్లీ, అక్టోబరు 25: రిషి ప్రధాని పదవికి పోటీ పడినప్పుడు.. ఆయన కన్నా ఎక్కువగా అక్షత పేరే అక్కడి మీడియాలో మార్మోగింది. వివాదాస్పదమైంది. దీనికి కారణం ఆమె సంపద, ఆమె పౌరసత్వం. నారాయణమూర్తి కూతురుగా అక్షతకు ఇన్ఫోసి్‌సలో ఉన్న 3.89 కోట్ల షేర్ల (మొత్తం షేర్లలో 0.93 శాతం) విలువే రూ.5956 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఒక్క 2022లోనే ఆమెకు ఇన్ఫోసిస్‌ నుంచి డివిడెండ్‌ రూపంలో వచ్చిన ఆదాయం రూ.126.61 కోట్లు. దీనికితోడు ‘అక్షతా డిజైన్స్‌’ పేరుతో దుస్తుల తయారీ బ్రాండు ఏర్పాటు చేశారు. మరో రెండు, మూడు సంస్థలున్నా.. బ్రిటన్‌లో ఉంటున్నా వేరే దేశంలో స్థిరనివాసం ఉన్నవారికి ఇచ్చే ‘నాన్‌-డొమిసైల్‌’ హోదా ఉన్నందున బ్రిటన్‌లో పన్ను కట్టేవారు కాదు. దీనిపై అక్కడి మీడియా, ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపించాయి. తాను బ్రిటన్‌లో కూడా పన్ను కడతానని అక్షతా స్పష్టం చేయడంతో విమర్శల జోరు తగ్గింది. కాగా.. క్వీన్‌ ఎలిజబెత్‌ జీవించి ఉన్న సమయంలో ఆమెకు, అక్షతకు సంపద విషయంలో పోలిక పెడుతూ బ్రిటన్‌ మీడియా అనేక కథనాలు ప్రచురించేది. రాణి ఆస్తుల విలువ దాదాపు రూ.3400 కోట్లు అయితే.. అక్షత ఆస్తుల విలువ రూ.4200 కోట్లు (ఇది అప్పటి విలువ; ఇక, రిషి సునాక్‌ ఆస్తుల విలువ వేరే, అది దాదాపు రూ.3 వేల కోట్లు) అంటూ రాణి కన్నా అక్షతే సంపన్నురాలు అని తేల్చేవి. ఇప్పుడు రాణి లేదు కాబట్టి.. బ్రిటన్‌ రాజు కన్నా అక్షతే ధనవంతురాలు అనుకోవాలి!! సునాక్‌, అక్షత.. ఇద్దరి సంపదా కలిపితే 730 మిలియన్‌ పౌండ్లు. అంటే మన కరెన్సీలో రూ.7 వేల కోట్లు.. బ్రిటన్‌ ప్రజాప్రతినిధుల సభలోని ఎంపీలందరికన్నా ధనవంతుడు రిషినే.

Updated Date - 2022-10-26T08:38:01+05:30 IST