Buddhist temple : హవ్వ! బౌద్ధ సన్యాసులు చేసిన పనికి టెంపుల్ ఖాళీ!
ABN , First Publish Date - 2022-11-29T16:26:45+05:30 IST
సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని బౌద్ధులు తమ మతాచారాలను పాటించడానికి అవకాశం లేకుండాపోయింది.
బ్యాంకాక్ : సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని కొన్ని గ్రామాల్లో నివసిస్తున్న బౌద్ధులు తమ మతాచారాలను పాటించడానికి అవకాశం లేకుండాపోయింది. దీంతో వారు చాలా ఆవేదన చెందుతున్నారు. దీనికి కారణం ఓ బుద్ధిస్ట్ టెంపుల్ (Buddhist Temple)లో ఉన్న బౌద్ధ సన్యాసులందరూ మాదక ద్రవ్యాల పరీక్షలో విఫలమవడమే. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలుగకుండా వేరొక ప్రాంతం నుంచి బౌద్ధ సన్యాసులను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని బుంగ్ సామ్ ఫాన్ జిల్లా అధికారి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న బుద్ధిస్ట్ టెంపుల్‌కు చెందిన నలుగురు బౌద్ధ సన్యాసులు (Buddhist Monks) డ్రగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారు. వీరు మీథాంఫెటమైన్ వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో ఆ నలుగురిని పునరావాస కేంద్రానికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. వారికిగల సన్యాస హోదాను తొలగించారు.
ఈ బుద్ధిస్ట్ టెంపుల్‌లో ఉన్న అందరు (నలుగురు) సన్యాసులు పునరావాస కేంద్రానికి వెళ్ళడంతో సమీప గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సన్యాసులకు మెరిట్ మేకింగ్ (భోజన సమర్పణ) చేయడానికి అవకాశం ఉండటం లేదని వాపోతున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి బౌద్ధ సన్యాసులను ఇక్కడికి రప్పిస్తామని అధికారులు చెప్పారు.
మాదక ద్రవ్యాలు, నేరాలకు సంబంధించిన ఐక్య రాజ్య సమితి విభాగం తెలిపిన వివరాల ప్రకారం, మయన్మార్‌లోని షాన్ స్టేట్ నుంచి లావోస్ మీదుగా మాదక ద్రవ్యాలు థాయ్‌లాండ్‌కు చేరుతున్నట్లు తెలుస్తోంది. వీథుల్లోనే మాదక ద్రవ్యాల బిళ్లలను అమ్ముతున్నారని సమాచారం.