చైనాను ఊపేస్తున్న బప్పీలహిరి ‘జిమ్మీ జిమ్మీ’
ABN , First Publish Date - 2022-11-02T05:27:04+05:30 IST
జీరో కొవిడ్ విధానం అంటూ కరోనా కట్టడి పేరుతో విధిస్తున్న ఆంక్షలతో చైనీయులు విసుగెత్తిపోతున్నారు. లాక్డౌన్లో ఇళ్లకే పరిమితమైతే ఆకలి కేకలు పెరిగిపోతున్నాయంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ పాటను అనుకరిస్తూ లాక్డౌన్ ఆంక్షలపై నిరసన
బీజింగ్, నవంబరు 1: జీరో కొవిడ్ విధానం అంటూ కరోనా కట్టడి పేరుతో విధిస్తున్న ఆంక్షలతో చైనీయులు విసుగెత్తిపోతున్నారు. లాక్డౌన్లో ఇళ్లకే పరిమితమైతే ఆకలి కేకలు పెరిగిపోతున్నాయంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం వారికి మన బాలీవుడ్ సాంగ్ ప్రధానాస్త్రంగా మారింది. 1982లో విడుదలైన ‘డిస్కో డాన్సర్’ సినిమాలోని బప్పీ లహిరి స్వరపరిచిన ‘జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా’ పాటతో వారు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. చైనా భాషలో ‘జి మీ’ అంటే ‘‘నాకు అన్నం ఇవ్వండి’ అని అర్థం. లాక్డౌన్ దెబ్బకు చైనాలో లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారని, అందుకు ఇదే నిదర్శని చెబుతూ వారు ఖాళీ పాత్రలు చూపిస్తున్నారు. ఈ పాటపై షార్ట్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. చైనా టిక్‌టాక్ ‘డౌయిన్’లో ఈ పాట తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి కమ్యూనిస్ట్ దేశమైన చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే కంటెంట్‌ను వైరల్ కాకుండా అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ, ఈ పాట మాత్రం ఇంకా వారి దృష్టిని ఆకర్షించినట్టు లేదు. భారతీయ చిత్రాలకు చైనాలో 1950 నుంచే మంచి ఆదరణ ఉంది. అప్పట్లో రాజ్ కపూర్ సినిమాల నుంచి ఇటీవల కాలంలో వచ్చిన త్రీఇడియట్స్, దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, హిందీ మీడియం వంటి చిత్రాల వరకు ఇక్కడ మంచి ప్రజాదరణ పొందాయి.