Chinese Anti Lockdown Protests: లాక్‌డౌన్ల గురించి ప్రపంచానికి తెలియకుండా చైనా వేసిన ఎత్తుగడ ఇదే!
ABN , First Publish Date - 2022-11-29T18:26:45+05:30 IST
ప్రపంచం క్రమంగా కరోనా వైరస్ (Corona Virus) గురించి మర్చిపోతున్న వేళ చైనాలో కొవిడ్ కేసులు
న్యూఢిల్లీ: ప్రపంచం క్రమంగా కరోనా వైరస్ (Corona Virus) గురించి మర్చిపోతున్న వేళ చైనాలో కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ ప్రతి రోజూ వేలల్లో కేసులు వెలుగు చూస్తుండడంతో అప్రమత్తమైన చైనా (China) దేశంలోని చాలా నగరాల్లో లాక్‌డౌన్ విధించి కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. తొలి నుంచీ జీరో కొవిడ్ (Zero Covid) విధానాన్ని అమలు చేస్తున్న చైనా ఒక్క కేసులు వెలుగు చూసినా కఠిన ఆంక్షలు విధిస్తోంది.
వాయవ్య చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలోని ఉరుమ్‌కీ నగరంలో వారం రోజుల క్రితం ఓ రెసిడెన్షియల్ భవనంలో అగ్నిప్రమాదం జరిగి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోజుల తరబడి లాక్‌డౌన్ (Lockdown)లో మగ్గిపోతున్న ప్రజల ఆగ్రహానికి ఇది మరింత కారణమైంది. భవనంలో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయడం వల్ల లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారని, చివరికి శ్వాస తీసుకోలేక ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ చనిపోయిన వారికి నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున జనం భవనం వద్దకు చేరుకున్నారు. ఆంక్షలను తోసిరాజని పూలు, పండ్లతో ఆ ప్రాంతానికి చేరుకుని చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ గద్దె దిగాలని, లాక్‌డౌన్లు ఎత్తివేయాలని నినదించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, పెప్పర్ స్ప్రే వినియోగించారు.
ఉరుమ్కీ నిరసనలు దేశంలోని అన్ని ప్రాంతాలకు పాకాయి. లాక్‌డౌన్లు ఎత్తివేయాలంటూ (Lift Lockdown) చాలా నగరాల్లో ప్రజలు పెద్ద రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. తమ దేశంలో జరిగే విషయాలను ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడే చైనా తాజాగా, జరుగుతున్న ఆందోళనలకు కూడా ప్రపంచానికి తెలియకుండా ప్లాన్ వేసింది. చైనాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుని ట్విట్టర్ ఏదైనా చైనా నగరం పేరు సెర్చ్ చేస్తే వెంటనే చైనీస్ బాట్స్ (Bots) అప్రమత్తమైపోతున్నాయి. పోర్న్, గాంబ్లింగ్ కంటెంట్‌ను తెరపైకి తీసుకొస్తున్నాయి. అసభ్యకరమైన కంటెంట్‌ను చూపిస్తూ యూజర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. షాంఘై, బీజింగ్ వంటి నగరాల పేర్లను చైనా భాషలో టైప్ చేసిన వెంటనే యాక్టివ్ అయిపోతున్న బాట్స్ సెక్స్ వర్కర్లు, పోర్నోగ్రఫీ, గాంబ్లింగ్ కంటెంట్‌ను చూపిస్తున్నాయి. ఒకసారి వాటిని క్లిక్ చేస్తే యూజర్ ఇక అందులోంచి బయటకు వచ్చే మార్గం ఉండదు. అలా, అసలు విషయం నుంచి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి.
స్టాన్‌ఫోర్డ్ ఇంటర్నెట్ అబ్జర్వేటరీ డైరెక్టర్ అలెక్స్ స్టామోస్ ప్రకారం.. ట్విట్టర్ (Twitter) జోక్యం చేసుకోకుండా నిరోధించడంలో చైనా చర్య ‘మొదటి అతిపెద్ద వైఫల్యాన్ని’ సూచిస్తోంది. చైనాలో ట్విట్టర్ యాక్సెస్ పరిమితం కావడంతో అక్కడ జరుగుతున్న నిరసనలు అంతర్జాతీయ దృష్టిలో పడకుండా పరిమితం చేయడానికి ఈ చర్యలు ఉద్దేశించినట్టు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చైనా బాట్స్ ట్విట్టర్‌లో ‘ఎస్కార్ట్ యాడ్స్’ను పోటెత్తిస్తున్నాయని, దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని చైనీయులు తెలుసుకోకుండా బాట్స్ అడ్డుపడుతున్నాయని జర్నలిస్ట్, టెక్నాలజీ, సెన్సార్‌షిప్ నిపుణుడు మెంగ్యూ డాంగ్ పేర్కొన్నారు. చైనా ప్రభుత్వం ట్విట్టర్‌ను మేనిప్యులేషన్ చేస్తున్న విషయాన్ని ‘వాషింగ్టన్ పోస్ట్’ తొలుత బయటపెట్టింది.