ఉక్రెయిన్‌లో అంధకారం
ABN , First Publish Date - 2022-11-05T04:56:55+05:30 IST
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని పవర్ గ్రిడ్‌కు అంతరాయం కలిగి విద్యుత్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
రష్యా ఇంధన ఉగ్రవాదానికి పాల్పడుతోంది: జెలెన్‌స్కీ
కీవ్, నవంబరు 4: రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని పవర్ గ్రిడ్‌కు అంతరాయం కలిగి విద్యుత్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో సుమారు 45 లక్షల మంది అంధకారంలో చిక్కుకున్నారు. ‘రష్యా ఇంధన ఉగ్రవాదాన్ని ఆశ్రయించడం దాని బలహీనతకు నిదర్శనం. వారు యుద్ధభూమిలో ఉక్రెయిన్‌ను ఓడించలేరు. అందుకే మా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు’ అని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. విద్యుత్‌ను పొదుపుగా వాడాలని ప్రజలను కోరారు. ఐరోపాలోనే అత్యంత పెద్దదైన అణు విద్యుత్ కేంద్రం ఉక్రెయిన్‌లోని జపోరిజియాలో ఉంది. ఈ విద్యుత్ కర్మాగారం పవర్ లైన్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది.
ఖేర్సన్ నుంచి రష్యా వెనక్కి..? : రష్యా దళాలు డిప్నో నది పశ్చిమ తీరం నుంచి వెనుదిరుగుతున్నాయని, ఖేర్సన్ నగరాన్ని వదిలిపెడుతున్నాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఖేర్సన్‌లో రష్యా నియమించిన అధికారి కిరిల్ స్ట్రెమెసోవ్ రష్యా మీడియాతో మాట్లాడుతూ.. మాస్కో దళాలను ఆ ప్రాంతం నుంచి వెనక్కు పిలిచే అవకాశం ఉందన్నారు.