China protests: దిగొచ్చిన చైనా.. లాక్‌డౌన్ ఎత్తివేత!
ABN , First Publish Date - 2022-12-01T17:38:31+05:30 IST
లాక్‌డౌన్‌లు, కఠినమైన కరోనా ఆంక్షలకు విసిగిపోయిన చైనీలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ..
బీజింగ్: లాక్‌డౌన్‌లు, కఠినమైన కరోనా ఆంక్షలకు విసిగిపోయిన చైనీలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తుండడం, అవి క్రమంగా అన్ని నగరాలకు పాకుతుండడంతో చైనా (China) దిగొచ్చింది. మెట్రోపాలిటన్ నగరాలైన గ్వాంగ్ఝౌ, చాంగ్‌కింగ్‌లలో కరోనా ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని షరతులతో కొవిడ్ బాధితులకు (Covid Victims) ఇంట్లోనే క్వారంటైన్‌కు అనుమతిస్తామని, సన్నిహితులను కలుసుకోవ్చని చాంగ్‌కింగ్ అధికారులు తెలిపారు.
హాంగ్‌కాంగ్ సమీపంలోని గ్వాంగ్‌ఝౌలో ఏడు జిల్లాల్లో లాక్‌డౌన్(Lockdown)లను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఓ జిల్లాలో స్కూళ్లు, రెస్టారెంట్లు, సినిమాలు సహా ఇతర వ్యాపారాలను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చారు. దేశంలో కొవిడ్ రెస్పాన్స్ ఇన్‌చార్జ్, వైస్ ప్రీమియర్ సన్ చున్లాన్ వైద్యాధికారులతో మాట్లాడుతూ.. మహమ్మారి నియంత్రణలో కొత్త దశ, సవాళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పారు.
కరోనా లాక్‌డౌన్‌లు, ఆంక్షలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మొదలు కావడంతో దిగొచ్చిన ప్రభుత్వం ఈ ఆక్షలను సడలించి, చాలా చోట్ల లాక్‌డౌన్లను తాత్కాలికంగా ఎత్తివేసింది. గ్వాంగ్ఝౌలోని హైషు జిల్లాలో అల్లర్లు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. బారియర్లను విరగ్గొట్టారు. భద్రతాధికారులపై గాజు సీసాలు విసిరారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.